ETV Bharat / state

కలుషితమౌతున్న నదీ జలాలు.. భయపెడుతున్న నివేదికలు

author img

By

Published : Dec 26, 2022, 10:46 AM IST

PCB Report on River Water Pollution: పెరిగిపోతున్న జనాభా, పారిశ్రామిక వాడలతో నదీ జలాలను కాలుష్యం ముంచెత్తుతోంది. నీటి వనరుల నాణ్యతపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ).. ఇటీవల రాష్ట్ర పర్యావరణశాఖకు నివేదిక ఇచ్చింది. మూసీ నదితో పాటు సగానికిపైగా చెరువుల్లో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది. గోదావరి సహా ఉపనదుల్లోనూ నీటి కాలుష్యం ఉండగా, కృష్ణా నది కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొంది.

Water Pollution
నదీ జలాలు కలుషితం

PCB Report on River Water Pollution: తెలంగాణలో నదులు, ఉపనదులు, చెరువులను కాలుష్యం ముంచెత్తుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 274 ప్రదేశాల్లో నీటి నాణ్యత పరీక్షలు చేస్తుంటే ఒక్కచోట కూడా మెరుగైన ‘ఎ’ గ్రేడ్‌ రాలేదు. మూడో వంతుకు పైగా ప్రదేశాల్లో నీటి నాణ్యత.. మనుషులు, జంతువులకు తాగడానికి పనికిరాని స్థాయిలో ‘ఈ’ గ్రేడ్‌లో ఉంది. నీటి వనరుల నాణ్యతపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇటీవల రాష్ట్ర పర్యావరణశాఖకు నివేదిక ఇచ్చింది. మూసీ నదితో పాటు సగానికిపైగా చెరువుల్లో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది. గోదావరి సహా ఉపనదుల్లోనూ నీటి కాలుష్యం ఉండగా, కృష్ణా నది కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొంది. నదుల పరీవాహక ప్రాంతాల్లో పరీక్షించిన ఏ ప్రదేశంలోనూ నీరు పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా కనిపించలేదు.

మూసీలో సగం చోట్ల: రాష్ట్రంలోని నదులు, ఉపనదులు, చెరువులు, భూగర్భంలోని నీటి నాణ్యతను పీసీబీ ‘నేషనల్‌ వాటర్‌ మానిటరింగ్‌ ప్రోగ్రాం’లో భాగంగా 274 చోట్ల పర్యవేక్షిస్తోంది. సగానికిపైగా చెరువుల్లో నీళ్ల గ్రేడ్‌ ‘ఈ’, అంతకంటే దిగువకు పడిపోయింది. మూసీలో సగం చోట్ల కాలుష్యం తీవ్రంగా ఉంది. శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక రసాయన వ్యర్థాలు, పంటలకు ఎరువులు వాడిన నీళ్లు కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) సంఖ్య, సామర్థ్యం తక్కువగా ఉన్నాయి. ఎస్టీపీలు లేనిచోట ఈ మురుగు నేరుగా నదులు, చెరువుల్లో కలుస్తోంది. ఉన్నచోట సైతం కొన్ని సరిగా పనిచేయకపోవడం, తక్కువ సామర్థ్యం వంటివి కాలుష్యానికి దారితీస్తున్నాయి.

నీటి నాణ్యత గ్రేడింగ్‌:

  • ఎ- మంచి నీళ్లు. బ్యాక్టీరియాను నిర్మూలించి తాగాలి.
  • బి- ఇందులో నేరుగా స్నానం చేయొచ్చు. కొలిఫాం బ్యాక్టీరియా కొంచెం ఎక్కువ. శుద్ధి చేశాకే తాగాలి.
  • సి- శుద్ధి చేసి, బ్యాక్టీరియాను తొలగించిన తర్వాతే తాగాలి.
  • డి- ఈ నీళ్లు చేపలు, జంతువులకు మాత్రమే పనికివస్తాయి.
  • ఈ- ఇవి సాగునీటి అవసరాలకు మాత్రమే పనికివస్తాయి.
  • ఈ కంటే తక్కువ- ఏ అవసరానికీ పనికిరావు.
..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.