ETV Bharat / state

Ukraine Crisis: 'అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే... మూడో ప్రపంచ యుద్ధమే'

author img

By

Published : Feb 26, 2022, 6:51 AM IST

Updated : Feb 26, 2022, 8:45 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా కోపానికి కారణమేంటి..? ఆ రెండు దేశాల మధ్య యుద్ధం దేనికి దారి తీస్తుంది..? ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి..? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్న వేళ... యుద్ధంలో ప్రత్యక్షంగా అమెరికా జోక్యం చేసుకుని ఉంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉండేదంటున్నారు... అక్కడి పరిస్థితులపై అపార అవగాహన ఉన్న మాజీ దౌత్యవేత్త సురేష్ బాబు. తీవ్ర పరిణామాలుంటాయనే... అగ్రరాజ్యం ఆంక్షలకు పరిమితమైందని వివరించారు. చాలాదేశాల్లో... దౌత్యవేత్తగా సుదీర్ఘకాలం పనిచేసిన సురేష్ బాబుతో ముఖాముఖి..

Ukraine Crisis
Ukraine Crisis

అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే... మూడో ప్రపంచ యుద్ధమే: మాజీ దౌత్యవేత్త సురేష్ బాబు

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఉంటే మూడో ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ జరిగే ప్రమాదం ఉండేదని పూర్వపు యూఎస్‌ఎస్‌ఆర్‌, ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్‌ స్థితిగతులపై అపార అవగాహన ఉన్న, ఆయా దేశాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ దౌత్యవేత్త డాక్టర్‌ టి.సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు. నాటోలో సభ్యత్వం ఇవ్వకపోయినా ఉక్రెయిన్‌కి 600 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని, మిలటరీ సాంకేతిక నైపుణ్యాన్ని, సైనిక సిబ్బందికి విస్తృతస్థాయిలో శిక్షణను అందించిందని సురేష్‌బాబు తెలిపారు. నాటో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌లోని సైనిక కమాండ్‌తో ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ని అనుసంధానించిందని చెప్పారు. ప్రత్యక్షంగా యుద్ధంలో దిగబోమని ముందునుంచే అమెరికా. నాటో ప్రకటించాయని గుర్తుచేశారు. పటిష్ఠమైన సైనిక బలగం, అపార అణ్వాయుధ సంపత్తి కలిగిన రష్యాతో యుద్ధానికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీసేదని, అందుకే కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడానికే అమెరికా సహా నాటో దేశాలు పరిమితమయ్యాయని విశ్లేషించారు. రష్యా చమురు, సహజవాయువుపై ఆధారపడిన ఐరోపా దేశాలకు ఈ ఆంక్షలు ఎంత ఇబ్బందికరమో, రష్యాకీ అంతే ఇబ్బందికరం అవుతాయని... వీటన్నింటికీ సిద్ధపడే రష్యా యుద్ధానికి దిగిందని వివరించారు. మూడువైపుల నుంచి చుట్టుముట్టడం.. కీలక స్థావరాలను రెండో రోజే చేజిక్కించుకోవటం.. ఇలా రోజుల్లోనే యుద్ధం ముగిసేలా కొన్ని నెలల నుంచే రష్యా సన్నద్ధమైనట్లు యుద్ధం తీరు తెలియజేస్తోందని విశ్లేషించారు.

దౌత్యరంగంలో అపార అనుభవం..

విజయవాడ నగర మొదటి మేయర్‌ వెంకటేశ్వరరావు కుమారుడైన సురేష్‌బాబు రష్యాలో ఉన్నతవిద్య అభ్యసించారు. చరిత్రలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. దిల్లీలోని జేఎన్‌యూలో గల సోవియట్‌ స్టడీస్‌ సెంటర్‌లో రిసెర్చ్‌ కన్సల్టెంటుగా ఉన్నారు. యూపీఎస్‌సీ ద్వారా విదేశాంగశాఖలో అధికారిగా చేరి వివిధ హోదాల్లో యూఎస్‌ఎస్‌ఆర్‌లో, ఆ తర్వాత కామన్‌వెల్త్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ స్టేట్స్‌(సీఐఎస్‌) పరిధిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో ఉన్న భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంలో కాన్సుల్‌గా, మాస్కోలోని ఎంబసీలో కాన్సులర్‌గా, ఆర్మేనియా, జార్జియా, మంగోలియాలకు అంబాసిడర్‌గా పనిచేశారు. పీవీ నరసింహారావు, వాజపేయి, మన్‌మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీ లాంటి నాయకులు రష్యా, సీఐఎస్‌ దేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాల అధ్యక్షులతో జరిగిన సమావేశాల్లో అనువాదకునిగా వ్యవహరించారు.

కొత్తరూపంలో యూఎస్‌ఎస్‌ఆర్‌ని తీసుకురావాలన్న కోరిక..

పాత సోవియట్‌ రిపబ్లిక్‌లు నాటోలో చేరకుండా నియంత్రించడమే కాకుండా కొత్త రూపంలో బలమైన యూఎస్‌ఎస్‌ఆర్‌ తరహా వేదికను ఏర్పాటుచేయాలన్న కోరిక కూడా ఉక్రెయిన్‌తో యుద్ధానికి తలపడేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పురికొల్పి ఉంటుంది. ఉక్రెయిన్‌ భౌగోళికంగా పెద్ద దేశం. యూఎస్‌ఎస్‌ఆర్‌లో మూడో అతిపెద్దది. రష్యాతో సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. యూఎస్‌ఎస్‌ఆర్‌తో కలిసున్నప్పుడు అందరికీ కావాల్సినన్ని గోధుమల్ని ఉత్పత్తిచేసేంత సారవంతమైన భూమి ఉంది. ఉక్రెయిన్‌ను సోవియట్‌కు అన్నదాతగా చెప్పేవారు. ఇది నాటోలో చేరితే అక్కడి నుంచి ప్రయోగించే క్షిపణులు 5-7 నిమిషాల్లోనే మాస్కోకు చేరగలవు. వీటన్నింటి దృష్ట్యా ఉక్రెయిన్‌ నాటోలో చేరకుండా చూడటం రష్యాకు కీలకం. యూఎస్‌ఎస్‌ఆర్‌ విచ్ఛినమైన తర్వాత తొలుత తూర్పు ఐరోపా దేశాలు, తర్వాత ఒకప్పటి సోవియట్‌ రిపబ్లిక్‌లైన బాల్టిక్‌ దేశాలు నాటోలో భాగస్వాములయ్యాయి. మొదట్లో బలహీనంగా ఉన్న రష్యా దీనికి అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోయింది. ఒకదశలో తామూ నాటోలో భాగస్వాములవుతామని ప్రతిపాదించింది. నాటోతో పరస్పర సహకారానికి నాటో-రష్యా కౌన్సిల్‌ ఏర్పాటుచేసుకుంది. క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత ఆ కౌన్సిల్‌ రద్దయింది. బాల్టిక్‌ దేశాలు ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు చాలా చిన్నవి, పెద్దగా ప్రాధాన్యం లేనివి. ఇవి నాటోలో చేరినప్పుడూ రష్యా వ్యతిరేకించింది. నాటో నుంచి బాల్టిక్‌ దేశాల మీదుగా ఏదైనా ముప్పు తలెత్తినా, ఎదుర్కొనేందుకు అవసరమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో కూడిన ఏర్పాట్లను బెలారస్‌లో రష్యా సిద్ధం చేసుకుంది. 2008లో జార్జియా నాటోలో భాగస్వామిగా మారే ప్రయత్నాలు చేసినప్పుడు గట్టిగా అడ్డుపడింది. ఆ దేశంలో రష్యన్లు అధికంగా ఉండే రెండు ప్రాంతాల్ని స్వతంత్ర దేశాలుగా గుర్తించింది. ఇక్కడి ప్రజలకు రష్యా పాస్‌పోర్టులు అందించింది. ఒకదశలో జార్జియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశ రాజధాని వరకు రష్యా సైన్యం వెళ్లింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి దౌత్యంతో ఉద్రిక్తతలు సడలిపోయాయి. తర్వాత నాటోలో జార్జియా చేరే ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటికీ రష్యా, జార్జియాల మధ్య దౌత్య సంబంధాల్లేవు.

ఉక్రెయిన్‌.. వ్యూహాత్మకం..

మొదటి నుంచీ నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తుండగా.. రష్యా అడ్డుకుంటూనే ఉంది. మిగతా రిపబ్లిక్‌లతో పోలిస్తే ఉక్రెయిన్‌ వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. నల్లసముద్రంపై పట్టు ఉండాలంటే ఉక్రెయిన్‌ పరిధిలోని క్రిమియాతోపాటు ఉత్తర ప్రాంతం కీలకం. ఇక్కడే నాలుగు ముఖ్యమైన ఓడ రేవులున్నాయి. అందుకే క్రిమియాను రష్యా 2014లో స్వాధీనం చేసుకుంది. ఇది వివాదంగా మారింది. నాటోలో చేరే దేశానికి ఇతర పక్షాలతో వివాదాలు ఉండకూడదు. నాటోలో ఉక్రెయిన్‌ చేరేందుకు ఇదీ అడ్డంకిగా మారింది. ఉక్రెయిన్‌ పశ్చిమ, తూర్పుప్రాంతాల మధ్య మతపరంగా, భాషాపరంగా అంతరాలున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌ ప్రజలు రష్యన్‌ మాట్లాడతారు. రష్యా ఆర్థొడాక్స్‌ చర్చిని అనుసరిస్తారు. పశ్చిమ ప్రాంతం వారు ఉక్రెయిన్‌ భాష మాట్లాడతారు. కేథలిక్‌ చర్చిని అనుసరిస్తారు. వీరు తామంతా పశ్చిమ ఐరోపాకు చెందినవారమని భావిస్తారు. సోవియట్‌కు ఒకప్పటి అగ్రనేతలైన కృశ్చేవ్‌, బ్రిజ్నేవ్‌లు ఉక్రెయిన్‌ ప్రాంతవాసులే. గోర్బచేవ్‌ సైతం రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతంవారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఐరోపాను విభజించినప్పుడు పోలండ్‌, హంగెరీలకి చెందిన కొంత ప్రాంతాన్ని ఉక్రెయిన్‌లో అప్పటి సోవియట్‌ అధ్యక్షుడు స్టాలిన్‌ కలిపారు. ఇలాంటి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాషను రెండో ప్రాధాన్యభాషగా ప్రభుత్వం మార్చేయడంతో అల్లర్లు చెలరేగాయి. 40వేల మందిని ఉక్రెయిన్‌ బలగాలు చంపేశాయి. ఇక్కడ రష్యన్‌ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న రెండు ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా విడిపోయేలా రష్యా సహకరించింది. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికే దిగింది. బెలారస్‌తో పాటు మధ్య ఆసియా దేశాలైన ఒకప్పటి సోవియట్‌ రిపబ్లిక్‌లతో రష్యాకి సన్నిహిత సంబంధాలున్నాయి. వీటన్నింటితో ఆర్థిక సహకారానికి కస్టమ్స్‌ యూనియన్‌ వంటి వేదికలు.. బెలారస్‌, మధ్య ఆసియా దేశాలతో ప్రత్యేక యూనియన్‌ ఏర్పాటుచేసింది. రక్షణ వ్యవహారాల సహకారం కోసం నాటోకు సమాంతరంగా కలెక్టివ్‌ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటుచేసింది. ఇతర రిపబ్లిక్‌లు రష్యాతో కలిసుండటమే మేలని భావిస్తున్నాయి. యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌లో తనకు అనుకూల ప్రభుత్వం వస్తే దాన్నీ కలిపి బలమైన యూనియన్‌ ఏర్పాటుచేయటం పుతిన్‌ ఉద్దేశం కావచ్చు.

ఉక్రెయిన్‌తో మనకి సన్నిహిత సంబంధాలు..

తొలినుంచి ఉక్రెయిన్‌తో మన దేశానికి సన్నిహిత సంబంధాలుండేవి. యూఎస్‌ఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు మాస్కోలో మన రాయబార కార్యాలయం ఉంది. మొత్తం 15 రిపబ్లిక్‌లకు గాను ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ఒక్కదాంట్లోనే అదనంగా మనకు కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ఉండేది. ఇది కీలక ఓడరేవున్న నగరం. తమిళనాడులోని కూడంకుళంలో అణు విద్యుదుత్పత్తి కర్మాగారాన్ని రష్యా సంస్థ నిర్మిస్తుండగా, అందులోని కొన్ని విడిభాగాలు ఉక్రెయిన్‌ నుంచే వస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌లతో కలిసి సంయుక్తంగా మన దేశం కొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. పొద్దుతిరుగుడు నూనెను ఇక్కడి నుంచే భారీగా దిగుమతి చేసుకుంటున్నాం.

ఇమ్రాన్‌ ఇప్పుడే వెళ్లడం కాకతాళీయమేమో!

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యే సమయంలోనే పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ రష్యాలో పర్యటించటం, పుతిన్‌తో భేటీ కావటం కాకతాళీయం కావచ్చు. ఏ దేశమైనా తన సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. మన దేశానికి పుతిన్‌ అగ్రప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికి 8సార్లు భారత్‌ని సందర్శించారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో సాయం చేస్తున్నారు. కీలకమైన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ఇటీవలే మనకి అందజేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రధానిగా ఎవరున్నా రష్యాతో సత్సంబంధాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ‘స్ట్రాటజిక్‌ అండ్‌ ప్రివిలేజ్డ్‌’ అని రెండు దేశాల విదేశాంగ శాఖల్లో భావిస్తారు. రష్యా, చైనా, భారత్‌... ఆసియాలో అగ్రరాజ్యాలు. వీటి మధ్య సమన్వయం ఉండాలి.

ఇదీ చదవండి:

NIA: నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

Last Updated : Feb 26, 2022, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.