ETV Bharat / state

దసరా ఉత్సవాలకు దుర్గగుడిలో విస్తృత ఏర్పాట్లు

author img

By

Published : Sep 12, 2020, 10:29 AM IST

దుర్గగుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. కరోనా విస్తరిస్తున్నందున..భక్తుల నియంత్రణపైనే ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. మొత్తంగా పది రోజుల ఉత్సవాలకు కలిపి.. లక్ష మందికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనానికి అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు.

Officials   preparing arrangements for Dussehra celebrations
విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు

మొత్తంగా పది రోజుల ఉత్సవాలకు కలిపి.. లక్ష మందికి

దుర్గగుడిలో దసరా ఉత్సవాలను ఈసారి ఎలా నిర్వహించాలనే విషయంపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులను పెద్దసంఖ్యలో కొండపైకి అనుమతించేందుకు వీలు లేదు. దీంతో వారిని ఎలా నియంత్రించాలనే విషయంపైనే ప్రధానంగా అధికారులు దృష్టిసారిస్తున్నారు. ఏటా దసరా ఉత్సవాల పది రోజుల్లో కనీసం 15లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. రోజు కనీసం లక్ష నుంచి రెండు లక్షల మంది వరకు తరలివస్తుంటారు. మూలానక్షత్రం రోజు రెండు నుంచి రెండున్నర లక్షల మంది వరకు భక్తులు వస్తారు. అందుకే.. తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనాలు జరుగుతుంటాయి. అమ్మవారి అలంకరణ చేసేటప్పుడు మాత్రమే భక్తుల దర్శనాలను నిలుపుతారు. అలాంటిది ఈసారి.. మొత్తంగా పది రోజుల ఉత్సవాలకు కలిపి.. లక్ష మందికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనానికి అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. అంటే రోజుకు ఉచిత, రూ.100, రూ.300 టిక్కెట్‌ దర్శనాలు కలిపి పది వేలకు మించి భక్తులను వదలరు. అదికూడా సాయంత్రం ఐదుగంటలతోనే ముగిస్తారు.

ఇంటి దగ్గరే ఉండి వీక్షించేలా ఏర్పాట్లు..!

ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రత్యేక పూజలు సహా అన్నీ పరోక్ష పద్ధతిలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే.. భక్తులు నేరుగా దుర్గగుడికి వచ్చి దర్శనం చేసుకోకుండా.. ఇంటి దగ్గరే ఉండి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాలలో ఏటా నిర్వహించే లక్ష కుంకమార్చన, చండీహోమానికి కూడా ఈసారి భక్తులను అనుమతించే అవకాశం లేదు. ఏటా ఉత్సవాల పది రోజులు రెండు సార్లుగా ఈ పూజలు జరుగుతాయి. ఒక్కోసారికి 200మంది వరకు ఉభయదాతలను అనుమతించేవారు. ఈసారి.. వీలైతే పూర్తిగా అనుమతించకపోవడం లేదంటే 50మందికి అవకాశం కల్పించాలనేది ఆలోచన. ప్రత్యేక పూజలకు ఆటంకం లేకుండా భక్తులు ఏటా మాదిరిగానే టిక్కెట్‌ కొనుగోలు చేసుకుని డబ్బులు చెల్లిస్తే.. వారి పేరుతో ఇక్కడ పూజలు నిర్వహించి.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం సహా ఇంటికే పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు.

కొండపైనే క్యూ లైన్ల ఏర్పాటు

ఉచిత దర్శనాలు సహా అందరూ ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవాలి. ఆ టిక్కెట్‌ పట్టుకుని వస్తేనే.. దర్శనానికి అనుమతిస్తారు. లేదంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కొండపైకి రానివ్వకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగా ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న వినాయక మంటపం దగ్గర నుంచి కాకుండా.. కొండపైన ఉన్న ఓంకారం మలుపు నుంచి క్యూలైన్లను వేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాలు అక్టోబరు 17 నుంచి 25వరకు నిర్వహిస్తుండగా ఈనెల 18 నుంచి ఉచిత, రూ.100, రూ.300, ప్రత్యేక పూజల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఆ టిక్కెట్లు ఉన్నవాళ్లే దర్శనానికి రావాలని, మిగతా వాళ్లు రావొద్దని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి. బంట్టుమిల్లిలో పోతురాజు విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.