ETV Bharat / state

Pulichintala Project: నెలలు..సంవత్సరాలు గడిచాయి.. కొట్టుకుపోయిన గేటును పెట్టలేకపోయారు!

author img

By

Published : Apr 20, 2023, 4:12 PM IST

Updated : Apr 20, 2023, 4:46 PM IST

Pulichintala Project Gate: అది కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌.! 45 టీఎంసీల నీరు నిల్వచేసే ప్రాజెక్ట్‌.! పెట్టాల్సింది ఒకే ఒక్క గేట్‌..! కానీ ప్రభుత్వం గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మిస్తున్నట్లు ఫీలైపోతోంది..! రోజులు నెలలయ్యాయి.! నెలలు సంవత్సరాలు అవుతున్నాయి. నీటిపారుదల శాఖకు ఒక మంత్రి పోయి మరొక మంత్రి కూడా మారారు. కానీ వరదలకు కొట్టుకుపోయిన గేటు పెట్టే గతిలేదు. ప్రభుత్వం 18 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేయలేకపోయింది! మళ్లీ వానాకాలం సీజన్‌ వస్తున్నా శాశ్వత గేటు బిగించకుండా నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. గేటు ఫ్యాబ్రికేషన్‌ పూర్తైందని, మరికొన్ని రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

Pulichintala Project Gate : 2021 ఆగస్టు 5వ తేదీ రాత్రి వరదలకు పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబర్‌ గేటు కొట్టుకుపోయింది. ఇంత కీలకమైన ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోతే జలవనరులశాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించాలి. కానీ నేటికీ స్టాప్‌లాక్ గేటుతోనే నెట్టుకొస్తున్నారు. శాశ్వత గేటు బిగింపు ప్రణాళికలు 20 నెలలైనా కొలిక్కిరాలేదు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో నేటికీ కొత్తగేటు ఏర్పాటు చేయలేదు. సాధారణంగా ఏటా నవంబరు నుంచి జూన్‌ మధ్యలో పనులు చేసేందుకు అనువుగా ఉంటుంది. 2021 ఆగస్టు 5న పులిచింతల గేటు కొట్టుకుపోతే ఆ ఏడాది నవంబరు నాటికి పనులు చేపట్టేలా పాలనామోదం ఇవ్వాల్సి ఉండగా 2022 జూన్‌ ఒకటి నాటికి పాలనామోద ఉత్తర్వులు ఇచ్చాయి. అంటే గేటుకొట్టుకుపోయిన 9 నెలల తర్వాత పాలనా ఆమోదం ఇచ్చారు. ఇప్పటికి 20 నెలలవుతున్నా శాశ్వత గేటు బిగించనేలేదు.

పులిచింతలలో 16వ నంబరు రేడియల్‌ గేటు తయారీ, ఏర్పాటుకు 7 కోట్ల 54 లక్షల 20 వేల రూపాయలు, ట్రునియన్‌ స్థాయిలో పియర్ల సామర్థ్యం పెంచడం, ఇతర పనులకు కోటి 73 లక్షల 20 వేలు, రేడియల్‌ గేట్ల ఆపరేషన్, నిర్వహణ ఖర్చులు గ్యాంట్రీ క్రేన్, రివర్‌ స్లూయిస్‌ గేట్ల మరమ్మతులు, నిర్వహణకు 9 కోట్ల 57 లక్షల 10 వేల రూపాయలు కేటాయించారు. మొత్తంగా 18కోట్ల 84 లక్షల 50 వేల రూపాయలు కేటాయించారు. ఈ పనులు వేటికవే భిన్నమైనవి అయినందున స్వల్పకాల టెండర్లు పిలిచి వేర్వేరుగా అప్పగించాలని అప్పట్లో ఉత్తర్వులిచ్చారు.

కానీ ఎవరికి టెండర్లు ఇచ్చారో, కేటాయింపుల్లో ఎంత ఖర్చు చేశారో తెలియదుగానీ నేటికీ శాశ్వత గేటైతే అక్కడ పెట్టలేదు. గేటు ఫ్యాబ్రికేషన్‌ పూర్తైందని, త్వరలోనే ఆ గేటు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రౌటింగు తదితర పనులు చేశామని అంటున్నారు. రేడియల్‌ గేట్ల ఆపరేషన్, రబ్బరు సీళ్ల ఏర్పాటు, రివర్‌ స్లూయిస్‌ గేట్ల మరమ్మతులు వంటి అనేక పనులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. మొత్తంగా మరో సీజన్‌ పూర్తవుతున్నా మూడో వంతు పనులు కూడా ఇంకా పూర్తి చేయలేదు.

పులిచింతల ప్రాజెక్ట్‌ నిర్వహణపై అప్పట్లో నిపుణుల కమిటీ సూచనలు సైతం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఈ ప్రాజెక్టులో గేట్ల ఏర్పాటుకు నిర్మించిన అన్ని పియర్ల సామర్థ్యాన్ని ఐఐటీ నిపుణులతో పరీక్షించాలని కమిటీ సూచిస్తే ప్రభుత్వం అందుకు భిన్నంగా జేఎన్‌టీయూ హైదరాబాద్‌ వారితో పరీక్షలు చేయించింది. ప్రాజెక్టులో మొత్తం 24 గేట్లుండగా నీరు లీక్‌ అవుతోంది. దానిని తగ్గించేందుకు గేట్ల వద్ద రబ్బరు సీళ్లు మార్చాల్సి ఉంది. ఐతే కేవలం 3 గేట్ల వద్ద మాత్రమే రబ్బరు సీళ్లు మార్చడం వీలయిందని అధికారులు చెబుతున్నారు. త్వరలో మిగతావీ మారుస్తామని వెల్లడించారు.

పనులు చేసుకునేందుకు వీలుగా గేట్ల నిర్వహణకు అవసరమైన కాలి నడక వంతెన నిర్మించాలని కమిటీ సూచించింది. 24 గేట్లకుగాను 12గేట్ల వరకే వంతెన ఉంది. ఇంకా ఆ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంది. నిధులు ఇవ్వనందునే పనులు పెండింగ్‌లో ఉన్నాయనే విమర్శలున్నాయి. పులిచింతల ప్రాజెక్టులో గేటు ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. వాటిని ప్రస్తుతం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి బదలాయించినట్లు తెలిసింది.

పులిచింతల ప్రాజెక్టు గేటుకు మోక్షమెప్పుడు సార్

ఇవీ చదవండి

Last Updated : Apr 20, 2023, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.