ETV Bharat / state

Maize Marketing Problems : అప్పుడు వానకు.. ఇప్పుడు కొనుగోలుకు.. మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు

author img

By

Published : May 23, 2023, 8:37 AM IST

Maize  Marketing Problems
మొక్కజొన్న మార్కెటింగ్​ సమస్యలు

Maize Farmers Problems : ఎండకు వానకు ఓర్చి పండించిన మొక్కజొన్నను రైతన్న అమ్ముకోవటానికి నానా ఆగాచాట్లు పడాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షం నుంచి పంటను కాపాడుకుని.. తీర చేతికి అందిన సమయంలో అమ్ముకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు అడ్డువస్తున్నాయి. చేసేదేమి లేక రైతులు పంటను మధ్యవర్తులకు నష్టాలకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి.

పంట అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులు

Maize Farmers Marketing Problems : ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక.. రైతులు తంటాలు పడుతున్నారు. పంట కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. కొత్తగా విధించిన నిబంధనలు రైతులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వాటిని పాటించలేక.. మద్దతు ధరను కూడా కాదని తక్కువ ధరలకే మధ్యవర్తులకు రైతులు పంట విక్రయిస్తున్నారు. కొత్త నిబంధనలతో మొక్కజొన్న రైతులు పంటను ఎక్కడ, ఎలా అమ్మకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగుచేశారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతినకుండా ఎన్నో పాట్లు పడి పంటను రక్షించుకున్నారు. వచ్చిన పంటను అమ్మి అప్పులైనా తీర్చుకోవాలని ఆశించారు. దళారుల చేతుల్లో మోసపోకుండా.. పంట తామే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సంతోషపడ్డారు. అయితే రైతు భరోసా కేంద్రం అధికారులు విధించిన నిబంధనలు కర్షకుల ఆనందాన్ని ఆవిరి చేశాయి.

ఆరుగాలం శ్రమించి పంట పండించడం, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడం ఒక ఎత్తయితే.. దాన్ని అమ్ముకోవడం రైతులకు తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే అధికారులు చెప్పిన ప్రాంతానికి రైతులే పంటను తరలించాలని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా, కాటా, కూలీ ఖర్చులు రైతులే భరించాలన్న నియమం పెట్టారని వాపోతున్నారు. ఇలా అయితే మద్దతు ధర ఇచ్చినా గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరగా క్వింటాల్​కు 19 వందల 62 రూపాయలు ఇస్తామని ప్రకటించింది కానీస.., రవాణా, కూలీ, కాటా ఖర్చులు పోనూ తమకు మిగిలేదేమీ ఉండదని రైతులు చెబుతున్నారు.

"ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే వాళ్లు చెప్పిన ప్రాంతాలకు సరుకు తరలించటానికి మేమే రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాటా, కూలీ ఖర్చులన్నీ మేమే భరించాలి. ఇవన్నీ ఖర్చులు భరించి అక్కడికి తీసుకువెళ్లి విక్రయిస్తే ఏమీ మిగలదు. అందుకే మధ్యవర్తులకు అమ్ముకుంటున్నాము. వాళ్లు మా దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు." -కాటూరి రవి, రైతు

వర్షాలు పడిన సమయంలో కనీసం పట్టలు, సంచులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు కొనుగోళ్లలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తోందని మొక్కజొన్న రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి అమ్ముకుని నష్టాల పాలయ్యేకంటే.. ఎంతో కొంతకు మధ్యవర్తులకే విక్రయించడం మేలన్న భావనకు రైతులు వచ్చారు. దళారులు మద్దతు ధర కన్నా తక్కువకే అడుగుతున్నా.. పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో వారికే అమ్మేస్తున్నామని చెబుతున్నారు.

"ఇప్పుడు ఈ పంటను అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి వచ్చేలాగా లేదు. ఇది అమ్ముకుని పెట్టుబడికి తీసుకువచ్చిన అప్పులు తీర్చాలి. అన్ని లెక్కలు వేస్తే కనీసం కూలీ డబ్బులు కూడా గిట్టటం లేదు. మొక్కజొన్న పంట సాగు చేసే వరకు ధర భాగానే ఉంది అన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ధర తగ్గిపోయిందంటున్నారు. కొనుగోలు చేసే వాళ్లు కొనుగోలు చేయటానికి నానా పేచి పెడతారు. రూపాయి ఎక్కువో తక్కులో ముందు పంట మా దగ్గరి నుంచి వెళ్లిపోవాలని అమ్ముకుంటున్నాము." -రాజేశ్వరి, రైతు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.