ETV Bharat / state

Doctor Murder: ఇంట్లోకి చొరబడి.. కళ్లలో కారం చల్లి.. మచిలీపట్నంలో డాక్టర్​ దారుణ హత్య

author img

By

Published : Jul 27, 2023, 1:32 PM IST

Machilipatnam Doctor Murder
Machilipatnam Doctor Murder

Machilipatnam Doctor Murder: సమయం.. 25వ తేదీ, రాత్రి 8.30 గంటలు.. కుండపోత వర్షం కురుస్తోంది. ఆసుపత్రిలోని పై అంతస్తులో డాక్టర్‌ ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. ఇంట్లో ఉన్న డాక్టర్‌ రాధ వచ్చి తలుపు తీశారు. అంతే.. కళ్లు మూసి తెరిచే లోగా.. వచ్చిన వారు ఆమె కళ్లల్లో కారం చల్లారు. వైద్యురాలు తేరుకునే లోగానే.. తలపై మోది, ఆమె ఒంటిపై నగలు తీసుకుని అంతే వేగంతో పరారయ్యారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడిక్కకడే చనిపోయారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది.

Machilipatnam Doctor Murder: కృష్ణా జిల్లా బందరులోని జవ్వారుపేటలో లోక్‌నాథ్​ ఉమామహేశ్వరరావు, రాధ (59) దంపతులు పిల్లల వైద్యనిపుణులు. సొంత భవనంలోనే కింద అంతస్తులో క్లినిక్‌ నిర్వహిస్తూ పై అంతస్తులో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా రాధ ప్రాక్టీస్‌ చేయడం లేదు. మంగళవారం సాయంత్రం ఓపీ చూసేందుకు ఉమామహేశ్వరరావు సాయంత్రం ఆరు గంటల సమయంలో కిందకు వచ్చారు. రాత్రి 9.08 గంటల సమయంలో భార్యకు ఫోన్‌ చేశారు. అటు నుంచి స్పందన రాలేదు. రాత్రి పది గంటల వరకూ షేషెంట్లను చూసి ఆయన పైకి వెళ్లారు. ముందు తలుపు వేసి ఉండటంతో.. వెనక తెరిచి ఉన్న వంటగది ద్వారా లోపలికి వెళ్లారు. హాల్‌లో రక్తపు మడుగులో భార్య రాధ విగత జీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. నేలపై కారం చిమ్మిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతురాలి ఒంటి పై ఉన్న గాజులు, గొలుసు, నల్లపూసల తాడు మాయమయ్యాయి.

ఇంట్లోని ఇతర విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురికాలేదు. తలపై గాయాలు ఉండటంతో హత్యకు గురైనట్టు గుర్తించి వెంటనే నగరంలోని ఇనగుదురుపేట పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. తల వెనుక బలమైన గాయాలతో ఉన్న మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో డాక్టర్‌ రాధ ఒక్కరే ఉన్నారు. కుమార్తెకు వివాహమై హైదరాబాద్‌లో ఉంటోంది. కుమారుడు ఈనెల 19వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని అత్తగారింటికి వెళ్లాడు.

తెలిసిన వారి పనేనా..?: మంగళవారం రాత్రి 8.15 గంటల నుంచి 9 గంటల మధ్య హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో ప్రధాన రహదారిపై రద్దీ ఉంటుంది. మరో వైపు ఆసుపత్రిలోనూ రోగులు, సిబ్బంది ఉంటారు. ఆ సమయంలో కొత్త వ్యక్తులు పై అంతస్తులో ఉన్న రాధ వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఆసుపత్రి ముందు గేటు నుంచే కాకుండా వెనక వైపు నుంచి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పక్కనే ఉన్న మరో ఆసుపత్రి పై అంతస్తు నుంచి కూడా ఇటు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో కాకుండా అందరూ తిరిగే సమయంలో ఎటువంటి పరిచయం లేని వ్యక్తులు వచ్చి హత్య చేసే అవకాశాలు లేవని భావిస్తున్నారు. బాగా పరిచయస్తులైన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి అంతస్తులో ఏమాత్రం అలికిడి ఉన్నా.. కిందకు వినిపించే అవకాశం ఉంది. ఎక్కడా అరుపులు వినిపించలేదని సిబ్బంది చెబుతున్నారు. కేవలం ఆమె వంటిపై ఉన్న నగల కోసమే ఇంత దారుణానికి పాల్పడ్డారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

పని చేయని సీసీ కెమెరాలు: ఆసుపత్రి ప్రాంగణంలో మొత్తం 14 సీసీ కెమెరాలున్నా ఒక్కటీ పనిచేయడం లేదు. మూడు నెలల కిందట షార్ట్​సర్క్యూట్​తో కెమెరాలు పాడయ్యాయని, గతంలో రెండు సార్లు మరమ్మతులు చేయించినా మళ్లీ మొరాయించడంతో తిరిగి వాటిని బాగు చేయించలేదని మృతురాలి భర్త ఉమామహేశ్వరరావు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతురాలు, ఆమె భర్త సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. రాధ కాల్​డేటాను తెప్పించి విశ్లేషించే పనిలో ఉన్నారు.

హత్యకు పాల్పడింది ఒక్కరే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. రెండో వ్యక్తి ఉండే అవకాశాలు తక్కువే అని అంచనా వేస్తున్నారు. ఇంట్లోని పాద, వేలిముద్రలను పోలీసులు సేకరించారు. వాటిని ఆసుపత్రిలోని సిబ్బంది వాటితో సరిపోల్చుకుంటున్నారు. మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. దొంగతనం కోసమే హత్య జరిగిందా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ శ్రీహరి తెలిపారు. ఘటనాస్థలాన్ని కృష్ణా జిల్లా ఇన్​ఛార్జ్​ ఎస్పీ రవిప్రకాష్​ పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.