సమస్యల సవాళ్లతో ఆటోనగర్ విలవిల - రోజు గడవడం లేదంటూ మెకానిక్‌ల ఆవేదన

సమస్యల సవాళ్లతో ఆటోనగర్ విలవిల - రోజు గడవడం లేదంటూ మెకానిక్‌ల ఆవేదన
Machilipatnam Auto Nagar Faced lack of Facilities: ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆటోనగర్ నేడు నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం స్థలాలు కేటాయించడంతో షెడ్లు ఏర్పాటు చేసుకున్న మెకానిక్‌లు.. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధే లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు.
Machilipatnam Auto Nagar Faced lack of Facilities: మౌలిక సదుపాయాలు లేక మచిలీపట్నం ఆటోనగర్ నిర్మానుష్యంగా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మెకానిక్ షెడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో గత్యంతరం లేక యజమానులు ఇతర ప్రాంతాల్లో మెకానిక్ షెడ్లు నిర్మించుకుంటున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పోతేపల్లిలో ఆటోనగర్ ఏర్పాటుకు 2006లో భూమి కేటాయించారు. 47ఎకరాల విస్తీర్ణంలో 216 మందికి స్థలాలు పంపిణీ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి వసతులు కల్పించలేదు. సౌకర్యాల లేమితో ఆటోనగర్‌లో మెకానిక్ షెడ్ల ఏర్పాటుకు యజమానులు ముందుకు రావడంలేదు. వచ్చిన వారు సైతం సరైన వ్యాపారం లేక వెనక్కు వెళ్లిపోతున్నారు. ఆటోనగర్‌లో స్థలాలను మెరక చేయకపోవడంతో మురికి కూపాలుగా మారుతున్నాయి.
రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేక ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేసుకున్న వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా అక్కడి ప్రాంతం చెరువును తలపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని మెకానిక్ షెడ్లను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు చేసిన ఆలోచన నేటికి సత్ఫలితాలను ఇవ్వకా.. బురదలో పోసిన పన్నీరులా మారిపోయింది. మోటారు వాహనాల మెకానిక్‌లకు స్థలాలు ఇచ్చినా వసతుల లేకపోవడంతో ఇక్కడికి వచ్చేందుకు వారు విముఖత చూపుతున్నారు. మౌలిక వసతులు కల్పించక పోవడంతో స్థలాలు కేటాయించినా నిరూపయోగంగా మారిందని షెడ్లను నిర్వహిస్తున్నవారు వాపోతున్నారు.
"రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది మునిగిపోవడం ప్రారంభమైంది. మురుగునీరు పారే తూమును వారు మూసేశారు. మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా నీళ్లు లేవు. స్థలం ఉండి రాకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు." -రాఘవులు, మచిలీపట్నం
"లారీలు ఆటోనగర్‌కు రావాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. దానివల్ల ఇక్కడ వ్యాపారం లేదు. ప్రధాన సమస్య ఏంటంటే ఆటోనగర్‌కు పెద్దరోడ్డు ఏర్పాటు చేయాలి." -ప్రసాద్, మచిలీపట్నం
స్థలాలు ఉన్న మెకానిక్‌లు నగరంలోని పలుచోట్ల రహదారుల వెంట షెడ్లు నిర్వహిస్తున్నారు. ఆటోనగర్‌లో సరైన వసతులు లేక అక్కడికి వాహనాల మరమ్మతుల కోసం ఎవరూ రావడం లేదని యాజమానులు ఇలా షెడ్లు నిర్మించుకుంటున్నామని అంటున్నారు. పాత వాహనాలు, వాటి విడిభాగాలు సైతం రహదారుల పక్కనే వేయడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తే మోకానిక్‌లకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెబుతున్నారు.
Drinking Water Problem: ఆటోనగర్ దుస్థితి.. వానకాలంలోనూ తాగునీటి సమస్య.. వెంటాడుతున్న డ్రైనేజీ సమస్య
"మేము ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అయ్యింది. ఏడు సంవత్సరాల నుంచి మేము జీవనోపాధిని కోల్పోయాము. మేము వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకు అభివృద్ధి లేదు." -జోగేంద్రరావు, మచిలీపట్నం
"ఉళ్లో ఉన్నప్పుడు ఖర్చులు పోను ఎంతో కొంత మిగిలేది. జీవనోపాధి దొరికేది. ప్రస్తుతం ఒకరోజు గిరాకి వస్తోంది. మరోరోజు రావడం లేదు. ఇంట్లోనుంచి తీసుకుని వచ్చి పెట్టాల్సి వస్తోంది." -దుర్గాప్రసాద్, మచిలీపట్నం
