ETV Bharat / state

కృష్ణా- గోదావరి బేసిన్​లో భారీగా మీథేన్!

author img

By

Published : Sep 13, 2020, 5:58 AM IST

రాష్ట్రంలోని కృష్ణా- గోదావరి(కేజీ) బేసిన్​లో పుష్కలంగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు ఉన్నాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిలాజ ఇంధనానికి రెట్టింపు స్థాయిలో ఇక్కడ మీథేన్ నిక్షేపాలున్నాయని అంచనా. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

methane hydrate deposits
methane hydrate deposits

రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి బేసిన్‌లో భారీగా మీథేన్‌ హైడ్రేట్‌ నిక్షేపాలున్నట్టు తేలింది. ఏకంగా 0.56 నుంచి 7.68 లక్షల కోట్ల ట్రిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌ మేర ఉండొచ్చని అంచనా. ఇక్కడ లభ్యమయ్యే మీథేన్‌... ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శిలాజ ఇంధన నిక్షేపాలకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని అఘార్కర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఏఆర్​ఐ) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కేజీ బేసిన్‌లో భారీగా మీథేన్ హైడ్రేట్ నిల్వలున్నట్టు తేలింది. ఈ పరిశోధన వివరాలు "మెరైన్‌ జీనోమిక్స్‌" అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. మీథేన్‌ పర్యావరణ అనుకూల ఇంధనం. దీని దహన ప్రక్రియలో హానికారక ఉద్గారాలు పెద్దగా వెలువడవు. ఆక్సిజన్‌ సమక్షంలో మండించినప్పుడు రెండు నీటి అణువులు, ఒక కార్బన్‌ డయాక్సైడ్‌ అణువు విడుదలవుతాయి. ఆర్థిక కోణంలోనూ ప్రయోజనకరమే.

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఇంధన నిల్వలపై ఇటీవల పరిశోధనలు చేసినప్పుడు... అక్కడ జీవ మూలాలున్న మీథేన్‌ హైడ్రేట్‌ నిల్వలను కనుగొన్నట్టు కేంద్రం ప్రకటించింది. శిలాజ ఇంధన వనరులు అంతరించిపోతున్నందున తరుణంలో ప్రత్యామ్నాయ శుద్ధ ఇంధనం వైపు చూస్తున్న ప్రపంచానికి ఇది శుభవార్తేనని కేంద్రం పేర్కొంది. ఆ నిల్వల నుంచి తగినంతగా మీథేన్‌ వాయువును సరఫరా చేయొచ్చంది. మెథనోజెన్‌లు అనే సూక్ష్మజీవులు ఈ బయోజెనిక్‌ మీథేన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని.... అది మీథేన్‌ హైడ్రేట్‌గా అందుబాటులో ఉంటోందని తెలిపింది. ఒక క్యూబిక్‌ మీటర్ మీథేన్‌ హైడ్రేట్‌లో 160-180 క్యూబిక్‌ మీటర్ల మీథేన్‌ ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన ఇక్కడ లభ్యమయ్యే మీథేన్‌... ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శిలాజ ఇంధన నిక్షేపాలకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఏఆర్​ఐ అధ్యయనం పేర్కొంది.

కృష్ణా- గోదావరి బేసిన్​లో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు మెథనోజెన్‌లకు అనుకూలంగా ఉన్నాయని ఏఆర్​ఐ వివరించింది. అండమాన్‌ తీరం, మహానది వద్ద సైతం ఈ నిక్షేపాలు ఉన్నాయని పేర్కొంది. అయితే వాటితో పోలిస్తే కేజీ బేసిన్‌లో మెథనోజెనిక్‌ వైవిధ్యత అధికంగా ఉందని వివరించింది. దీనిపై తదుపరి అధ్యయనాలు నిర్వహించాలని సూచించింది.

ఇదీ చదవండి

నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.