ETV Bharat / state

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అక్రమ సంబంధం

author img

By

Published : Oct 6, 2020, 10:54 PM IST

అది సాగర్‌ కాలువ. అక్కడ ఒడ్డున మూడు మృతదేహాలు పడిఉన్నాయి. అదుపు తప్పినట్లు పడిపోయిన ఆటో. ఇదేదో రోడ్డు ప్రమాదం అనుకున్నారు అందరు. క్షుణ్ణంగా పరిశీలిస్తే.. కుటుంబ యజమాని తల, ముఖం, కాలిపై ఆయుధంతో బలంగా కొట్టిన దెబ్బలు, అతని భార్య తలపై లోతైన గాయాలు, కుమార్తె మెడ నులిమినట్లు గుర్తులు ఉండటంతో చేసిన కుట్ర బయటపడింది.

Krishna District Police Chased Murder Case in 24 Hours
ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అక్రమ సంబంధం

పదేళ్ల పాప సహా ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో సంచలనం రేకెత్తించింది. విస్సన్నపేట సమీపంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాలువ వద్ద ఉదయం నడకకు వెళ్లినవారు.. అక్కడ మృతదేహాలను చూసి రోడ్డు ప్రమాదం జరిగినట్లు భావించి పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన ముగ్గురూ కాలువ ఒడ్డు నుంచి సుమారు ఐదు అడుగుల లోతులోని తుప్పల్లో విగతజీవులుగా పడిఉన్నారు. వీరు ఉపయోగించిన ఆటో సగభాగం మాత్రమే కాలువలోకి వెళ్లి, రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆటో అద్దాలను కర్రతో పగులగొట్టినట్లు ఉంది. వాహనంలోని పింగాణి వస్తువులు చెల్లాచెదురుకాలేదు. ముందుగా స్థానిక ఎస్‌.ఐ. సంఘటన స్థలం వద్దకు చేరుకొని విచారించారు. ఇది రోడ్డు ప్రమాదం అనుకొన్నారు. కానీ మృతదేహాలపై గాయాలను చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు నందిగామ, నూజివీడు డీఎస్పీలు రమణమూర్తి, బి.శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన పెళ్లూరి చిన్నస్వామి (35), అతని భార్య తిరుపతమ్మ (30), కుమార్తె మీనాక్షి (10)ల మృతి తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ తర్వాత వీరు హత్యకు గురైనట్లు భావించారు. చిన్నస్వామి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24గంటల్లోనే కేసును ఛేదించారు.

ఆగిరిపల్లి మండలం కొత్త ఈదరకు చెందిన పెళ్లూరి చినస్వామి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వ్యాపారి దాసరి వెంకన్న వద్ద పని చేస్తున్నాడు. వీళ్లిద్దరు ఇంటిని అద్దెకు తీసుకుని నూజివీడులో ఉంటున్నారు. వెంకన్న వద్ద ప్లాస్టిక్, పింగాణి వస్తువులను తీసుకుని చినస్వామి గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ విక్రయిస్తుంటాడు. చినస్వామి తన యజమాని భార్యతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంకన్న ఆగ్రహంతో రగిలిపోయాడు. చినస్వామిని హతమార్చడం కోసం పథకం పన్నాడు. తన భార్య, కుమారుడి సహకారంతో చినస్వామికి మద్యం తాగించి రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి సమీపంలో ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చారు.

ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చినస్వామి భార్య తిరుపతమ్మను హత్య చేశారు. కళ్ల ముందే తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో భయాందోళనకు గురైన వీరి పదేళ్ల కుమార్తె మీనాక్షి పరుగెడుతుండగా వెంటపడి పట్టుకున్నారు. ఏ మాత్రం కనికరం చూపించకుండా మెడకు చున్నీ బిగించి దారుణంగా హతమార్చారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం కోసం విస్సన్నపేట సమీపంలోని కాలువలోకి ఆటోను పల్టీ కొట్టించే ప్రయత్నం చేయగా.. అది ఇరుక్కుపోవడంతో మృతదేహాలను కాలువలో పడేసి అక్కడి నుంచి ఉడాయించారు.

ఈ కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. వెంకన్నను, అతనికి సహకరించిన భార్య, కుమారుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంధ్రబాబు తెలిపారు.

ఇదీ చదవండి: కుట్ర ముసుగు తొలగి..హత్యల కోణం వెలుగులోకి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.