ETV Bharat / state

కొనసాగుతున్న ఐటీ సోదాలు.. తనిఖీలతో జల్లెడ పడుతున్న 50 బృందాలు..

author img

By

Published : Feb 1, 2023, 10:35 AM IST

తెలంగాణలో ఐటీ సోదాలు
తెలంగాణలో ఐటీ సోదాలు

IT Raids in Hyderabad: తెలంగాణలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం మొదలైన ఐటీ అధికారుల తనిఖీలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. మాజీ కలెక్టర్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సహా పలు సంస్థల్లో అధికారులు ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్నారు.

IT Raids in Hyderabad: తెలంగాణలో కలకలం రేపిన ఐటీ సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇల్లు, రాజపుష్ప, వసుధ, వర్టెక్స్, ముప్ప సంస్థలపై దాడులు జరిపిన ఐటీ అధికారులు ఇవాళ మరిన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. దాదాపు 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి.

ఆదాయపన్ను సోదాలు కొత్త కాకపోయినా.. గతంలో ఒకే సంస్థకు చెందిన వేర్వేరు కార్యాలయాలు, ఇళ్లలో ఒకసారి సోదాలు జరిపేవారు. కానీ, మంగళవారం మాత్రం ఒకేసారి మూడు ప్రముఖ స్థిరాస్తి సంస్థలు, ఒక ఔషధ సంస్థకు చెందిన కార్యాలయాలు, వాటికి సంబంధించిన వారి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.

రామచంద్రాపురం సమీపంలోని తెల్లాపూర్‌లో రాజపుష్ప లైఫ్‌స్టైల్‌ కాలనీలో నివాసం ఉంటున్న సిద్దిపేట మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఉదయం 8 గంటల సమయంలో అయిదు వాహనాల్లో అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. వాహనాలు లోనికి ప్రవేశించిన తరువాత భద్రతా సిబ్బంది కాలనీ గేట్లు మూసివేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు.

రాజపుష్ప సంస్థ వ్యవస్థాపకుల్లో వెంకట్రామిరెడ్డి ఒకరు. కొంతకాలం క్రితం కలెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయల్లోకి ప్రవేశించారు. ఇటీవల ఆయన కుమారుడి వివాహం జరిగింది. దీనికి అయిన ఖర్చు గురించి కూడా ఆదాయపన్ను అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉదయం మొదలైన సోదాలు రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. దాంతోపాటు నానక్‌రాంగూడలో రాజపుష్ప సమిట్‌ పేరిట ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జరిపారు.

ఈ సంస్థ తెల్లాపూర్‌లో దాదాపు 60 ఎకరాల్లో విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తోంది. కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో అనేక నిర్మాణాలను చేపట్టింది. ఆయా నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను పరిశీలించి కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రియల్‌ఎస్టేట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముప్పా సంస్థలోనూ సోదాలు జరిపారు. గచ్చిబౌలి జనార్దన్‌హిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వెంచర్ల వద్ద ఉన్న కార్యాలయాలు, సంస్థ ఎండీ, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిపారు.
  • కొత్తగూడలోని జూబ్లీఎన్‌క్లేవ్‌ కాలనీలో ఉన్న నిర్మాణ సంస్థ వర్టెక్స్‌ కార్యాలయంలో సైతం ఐటీ అధికారులు సోదాలు చేశారు. 1994 నుంచి స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తోంది.
  • వెంగళరావునగర్‌ ప్రధాన కేంద్రంగా ఔషధ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తున్న వసుధ ఫార్మా కెమ్‌ లిమిటెడ్‌ కార్యాలయం, మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌ కాలనీలోని వంశీరామ్‌జ్యోతి గెలాక్సీ భవనంలోని కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు చేపట్టారు. వసుధ ఛైర్మన్‌ వెంకటపతిరాజుతోపాటు డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

సీఆర్‌పీఎఫ్‌ భద్రత..: ఒకేసారి 4 ప్రముఖ సంస్థల్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు పక్కా ముందస్తు ప్రణాళికతోనే వచ్చారు. సోమవారం సాయంత్రానికే ఆదాయపన్ను అధికారులు.. అకౌంటెంట్లు, హార్డ్‌వేర్‌ నిపుణులతో 50కిపైగా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసుకున్నారు. భద్రత కోసం సీఆర్‌పీఎఫ్‌ సాయం కోరారు. మంగళవారం ఉదయానికే ఐటీ శాఖ కార్యాలయాలకు చేరుకున్న సిబ్బంది అధికారులతోపాటు బయలుదేరారు. సోదాలు చేపట్టిన కార్యాలయాలు, ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.