ETV Bharat / state

అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే..?: కోటంరెడ్డి

author img

By

Published : Feb 1, 2023, 10:16 AM IST

Updated : Feb 1, 2023, 6:12 PM IST

kotamreddy
kotamreddy

10:09 February 01

ఫోన్​ ట్యాపింగ్​పై ఆధారాలు బయటపెట్టిన కోటంరెడ్డి

ఫోన్​ ట్యాపింగ్​పై ఆధారాలు బయటపెట్టిన కోటంరెడ్డి

Kotam Reddy Sridhar Reddy on Phone Tapping Issue: ఫోన్​ ట్యాపింగ్​పై నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్​ రెడ్డి ఆధారాలను బయట పెట్టారు. తన ఫోన్​ ట్యాపింగ్​ చేయటం చాలా బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్​ ట్యాపింగ్​ అవుతోందని నాలుగు నెలల క్రితమే.. ఓ ఐపీఎస్​ అధికారి తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఆ అధికారి ఫోన్​ ట్యాపింగ్​ గురించి తనతో చెప్పినప్పుడు.. సీఎం పై కోపంతో అలా చెప్తున్నారని భావించానని అన్నారు. 20 రోజుల క్రితం తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం లభించిందని ఆయన తెలిపారు. ఫోన్​ ట్యాపింగ్​ నిజమని తెలిసి ఎంతో మనస్తాపం చెందానన్నారు.

ముఖ్యమంత్రికి, సజ్జలకు తెలియకుండా తన ఫోన్ ట్యాప్​ కాదని కోటం రెడ్డి అన్నారు. తనను అనుమానించారని తెలిసి చాలా బాధపడ్డానని.. అనుమానం ఉన్నచోట ఉండాలని తనకు లేదని వివరించారు. కొన్నిరోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టారని వెల్లడించారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని తాను బాధపడ్డానని పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితం ఇంటెలిజెన్స్‌ అధికారులు నేరుగా మీడియా సమావేశంలోనే కనిపించారని అన్నారు. ఇంటెలిజెన్స్‌ అధికారులను గమనించి కొందరు వార్తలు రాశారన్నారు.

ఫోన్​ ట్యాపింగ్​పై ప్రెస్‌మీట్‌ పెడతానని ఎన్నడు అనుకోలేదని అన్నారు. వైసీపీకి తాను ఎంత వీరవిధేయుడినో అందరికీ తెలుసని.. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంతో పోరాటం చేశానని గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదని స్పష్టం చేశారు. వైసీపీ గురించి ఎక్కడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదని అన్నారు. మూడున్నరేళ్లుగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నానని.. ఇంత విధేయుడిగా ఉన్న తనను ఎంతగానో అవమానించారని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి జగన్‌ కోసం పార్టీలో ఉన్నానని.. ఎప్పుడూ జనంలోనే ఉన్నానని వెల్లడించారు. జగన్‌ గౌరవం పెంచేలా పార్టీ కోసం పనిచేశానని అన్నారు. తనకు నటన, మోసం చేతకాదని కోటంరెడ్డి వివరించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని.. వైసీపీ నుంచి పోటీకి నా మనస్సు అంగీకరించట్లేదని కోటంరెడ్డి వెల్లడించారు. కనీసం తనను సంజాయిషీ అడగకుండానే తనపై చర్యలు చేపట్టారని అన్నారు. తాను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ ఉద్యోగాలకు ఇబ్బందని వివరించారు. నిన్న బాలినేని వచ్చి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని చెప్పారని.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లవచ్చని బాలినేని అన్నారని తెలిపారు. బాలినేని మాటలు సీఎం మాటలుగా భావిస్తున్నానని కోటం రెడ్డి స్పష్టం చేశారు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే ఎలా ఉంటుందని కోటం రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సజ్జల, విజయసాయి, ధనుంజయ్‌రెడ్డి ఫోన్లు ట్యాప్‌ చేస్తే వారి స్పందన ఎలా ఉంటుందని అన్నారు. మీరు పొరపాటు చేసి ట్యాపింగ్‌ జరగలేదని అబద్ధాలు చెబుతారా? అని ప్రశ్నించారు.

తాను ఆధారాలు బయటపెడితే రాష్ట్రం.. కేంద్రానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం నా బాల్యమిత్రుడితో ఐ ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. మిత్రుడితో మాట్లాడిన విషయాల గురించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తనను అడిగారని వెల్లడించారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు తనకు ఆడియో క్లిప్‌ పంపారని పేర్కొన్నారు. ట్యాపింగ్‌కు ఇంతకుమించి ఆధారాలు ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కాకుండా ఆడియో క్లిప్‌ ఎలా బయటకు వచ్చిందని అన్నారు. రెండు ఐ ఫోన్ల మధ్య సంభాషణ ట్యాప్‌ చేయకుండా ఎలా బయటకొచ్చిందన్నారు.

మంత్రులు, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్‌ అయి ఉండవచ్చని అన్నారు. మనసు ఒకచోట.. శరీరం ఒకచోట ఉండటం నాకు ఇష్టం లేదని తెలిపారు. నన్ను అవమానించినచోట నేను ఉండలేనని.. నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పండన్నారు. 98499 66000 ఫోన్​ నెంబర్‌ నుంచి నా ఆడియో క్లిప్‌ నాకు వచ్చిందని.. ఆ నెంబర్‌ ఎవరిదో చెక్‌ చేసుకోండని తెలిపారు. ఏసీబీ చీఫ్‌గా ఉన్నప్పటినుంచి సీతారామాంజనేయులు ఈ నెంబర్​ వాడుతున్నారని.. నేను ట్యాపింగ్‌ అంటున్నా, కాదని మీరు అంటే నిరూపించండని సవాల్​ విసిరారు. ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయబోతున్నానని వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అందరూ ఆలోచించుకోవాలని.. దేశ ద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ట్యాప్‌ చేస్తారని అన్నారు.

ఫోన్లు ట్యాప్‌ చేస్తే కాపురాలు నిలబడతాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలే ట్యాపింగ్‌ చేస్తుంటే ఇంకెవరికి చెబుతామని వాపోయారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిర్ధారణ అయ్యాకే తన ప్లాన్‌ తాను చేసుకుంటున్నానని అన్నారు. భవిష్యత్‌ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని.. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నానని వెల్లడించారు. తనను దోషిగా నిలబెట్టాలని చూశారని.. అందుకే ట్యాపింగ్‌ బయటపెట్టానని అన్నారు.

బాలినేని వద్దకు కోటంరెడ్డి తమ్ముడు స్వయంగా వెళ్లలేదని.. బాలినేని పిలిస్తేనే వెళ్లాడని కోటంరెడ్డి వివరించారు. ఐబీ చీఫ్‌ తనంతట తానే నాతో మాట్లాడారని అనుకోవట్లేదని.. పార్టీ పెద్దలు చెబితేనే ఐబీ చీఫ్‌ తనతో మాట్లాడారని అనుకుంటున్నాని తెలిపారు. తాను ఇటీవల సీఎంను కలిసిన సమయానికి ట్యాపింగ్‌ ఆధారం తన వద్ద లేదని వెల్లడించారు. భవిష్యత్తు ఏంటని కార్యకర్తలు అడిగారని.. టీడీపీ తరఫున పోటీచేయాలని ఉందని కార్యకర్తలతో చెప్పానని కోటంరెడ్డి వెల్లడించారు. టీడీపీ తరఫున పోటీపై నిర్ణయం చంద్రబాబుదని అన్నారు. రాష్ట్రంలో వందమందికి కేబినెట్‌ హోదా ఉందని.. వైసీపీ తరఫున తనకు ఏ గౌరవం ఇవ్వలేదన్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్నాయని తెలిపారని అన్నారు. ఐబీ చీఫ్‌ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతారని తాను అనుకోలేదన్నారు. ట్యాపింగ్‌ అంశంలో అధికారులను తప్పుబట్టాల్సిన పనిలేదని.. ప్రభుత్వ పెద్దలు చెబితేనే ట్యాపింగ్‌ జరుగుతోందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Feb 1, 2023, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.