ETV Bharat / state

VIJAYAWADA DURGAMMA: బాలా త్రిపురసుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

author img

By

Published : Oct 8, 2021, 7:08 AM IST

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. నిన్న అమ్మవారు స్వర్ణకవచాలంకృత రూపంలో దర్శనమివ్వగా... రెండవ రోజైన నేడు బాలా త్రిపురసుందరీదేవిగా కనిపించనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

DEVI NAVARATHRI CELEBRATIONS AT VIJAYAWADA KANADURGA TEMPLE
బాలా త్రిపురసుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వనుంది. బాలా త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటే పూర్ణఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. బాలాదేవి మహిమాన్వితమైనది. బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. ముఖ్యమైనది. అందుకే విద్యోపాసనకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవత శ్రీబాలాత్రిపుర సుందరీదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని ప్రతీతి.

కొవిడ్‌ నేపథ్యంలో మొదటిరోజు నిబంధనల మధ్య భక్తులు తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ఆరంభమైంది. మొదటి రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిచ్చారు. అప్పటికే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సాయంత్రం 6గంటల సమయానికి 9వేల మంది భక్తులు తరలివచ్చి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ వెల్లడించారు. మొదటి రోజు ఉదయం నుంచి క్యూలైన్లు ఖాళీగానే ఉన్నాయి. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది. ఐదు క్యూలైన్లలో కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని నేరుగా కిందకు వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4లక్షల ఆదాయం సమకూరింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోని భక్తుల సౌకర్యార్థం నగరపాలక సంస్థ కార్యాలయం, పున్నమిఘాట్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్‌ పైలా స్వామినాయుడు తెలిపారు.

ప్రతి రోజూ సమన్వయ సమావేశం..

తొలి రోజు భక్తుల రాక, ఏర్పాట్లు, తలెత్తిన ఇబ్బందులపై కలెక్టర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యంలో దుర్గాఘాట్‌ వద్ద ఉన్న మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో గురువారం సాయంత్రం సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు, జేసీ శింశంకర్‌, మోహన్‌కుమార్‌, ఆలయ ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. భక్తుల కోసం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, చిన్న పిల్లలకు పాలు అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం కొండ దిగువన ఉన్న ప్రసాదాల కౌంటర్లతో పాటు మోడల్‌ గెస్ట్‌హౌస్‌, పున్నమిఘాట్‌ దగ్గర కూడా మరో కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం తప్పనిసరిగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు వేడుకల నిర్వహణపై చర్చిస్తామని తెలిపారు. దేవస్థానం, పోలీసు, రెవెన్యూ సహా అన్ని శాఖల సిబ్బంది మరింత సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు.

అమ్మను దర్శించుకునేందుకు వస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు

ఇదీ చూడండి: GODAVARI: ఏడాదిన్నర తరువాత... గోదావరికి పూర్వ వైభవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.