ETV Bharat / state

CM Delhi tour: పెండింగ్​ సమస్యలపై చర్చకు దిల్లీకి.. సీఎం వస్తారన్న సీఎస్ జవహర్ రెడ్డి

author img

By

Published : Apr 18, 2023, 8:02 PM IST

CM Delhi tour : కేంద్రంతో ముడిపడి ఉన్న రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి దిల్లీ వెళ్లనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రధానంగా విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పలు సమస్యలను ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖులను కలిసే అవకాశం ఉన్నందున మా అభ్యర్ధన మేరకు సీఎం జగన్ సైతం దిల్లీకి వస్తున్నారని వివరించారు.

cs jawahar reddy
cs jawahar reddy

CM Delhi tour : రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్​లో ఉన్న పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు దిల్లీ వెళ్లనున్నట్లు సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర కార్యదర్శుల సమావేశానికి రేపు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామని.. తమ పర్యటనలో సీఎం జగన్ కూడా ఉండాలని కోరుతున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి దిల్లీకి వస్తారని.. ఈ సమావేశం కోసం ఆయన విదేశీ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర కార్యదర్శులతో సమావేశంతో పాటు ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన దిల్లీకి రావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇటీవల సీఎం దిల్లీ పర్యటన పై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శలు చేశారు.

ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం నిధుల లేమి కారణంగా వాయిదా వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాల అమలుకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ సూచనల మేరకే వసతి దీవెనను వాయిదా వేశామని వెల్లడించారు.

రాష్ట్ర విభజన సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రిని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు పది అంశాలను లేఖలోనూ ప్రస్తావించారు. ఆయా అంశాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ జనవరి 24న సమావేశమై చర్చించింది. కొన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చింది. జెన్ కో చెల్లింపులపై.. బకాయిలు చెల్లించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవే కాకుండా.. పలు అంశాలపై ప్రధానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకు రావడంతో అధికారులతో చర్చించడానికి రాష్ట్ర బృందాన్ని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి దిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం. మాతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కూడా రావాల్సిన అవసరం ఉన్నందున.. మా రిక్వెస్ట్ మేరకు తన వ్యక్తిగత పర్యటనలు వాయిదా వేసుకుని దిల్లీ రావడానికి అంగీకరించారు. ఏప్రిల్ మాసంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగనన్న వసతి దీవెన వాయిదా వేయాలని కోరడంతో సీఎం గారు అంగీకరించారు. - కేఎస్ జవహర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

శ్రీకాకుళం జిల్లాలో పర్యటన.. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా.. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 10:15 గంటలకు చేరుకుంటారు. 10.47 గంటలకు మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి.. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీ, దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.40 గంటలకు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సన్మాన కార్యక్రమం, సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.