ETV Bharat / state

ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు.. ఇప్పుడు అక్రమాలకు అడ్డా

author img

By

Published : Dec 28, 2022, 5:45 PM IST

GUDIWADA
GUDIWADA

Illegal Activities in Gudivada: ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పట్టణమది. ఇప్పుడు దౌర్జన్యాలు, దందాలు, అక్రమాలు, కబ్జాలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి మారలేదు. కానీ ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడున్నరేళ్లుగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయి.. అధికార పార్టీ రౌడీయిజానికి, గూండాయిజానికి కేంద్రంగా మారింది. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న ఆ నియోజకవర్గమే గుడివాడ.Gudivada is an obstacle to tyranny, dandas, illegalities and possessions

ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు.. ఇప్పుడు అక్రమాలకు అడ్డా.. అదే గుడివాడ!

Illegal Activities in Gudivada: రాష్ట్రంలో మూడున్నరేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుడివాడలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్షాలపై దాడులకు తెగబడడం, విపక్షాలకు చెందిన కార్యకర్తలను, సానుభూతిపరులను అణచివేయడం, వేధించడం, కేసుల్లో ఇరికించడం, హింసించడం వంటి చర్యలతో ఇక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇంత జరుగుతున్నా చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఏనాడూ, ఏ దశలోనూ అడ్డుకోలేదు.

అధికార పార్టీకే వంత పాడుతున్నారు. వారి అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు. పోలీసుల అండతో నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. వారు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. భూకబ్జాలకు లెక్కేలేదు. పేకాట, గంజాయి అమ్మకాలూ పెరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులకు ఎదురుచెప్పిన వారికి బెదిరింపులు తప్పడం లేదు. దీంతో గుడివాడలో తరచూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది.

గుడివాడ పరిసర ప్రాంతాల్లో మట్టి అమ్మకాల నుంచి వీధి గొడవల పంచాయతీల వరకూ కొడాలి నాని అనుచరుల కనుసన్నల్లోనే సాగుతోంది. పోలీసులన్నా, చట్టాలన్నా వారికి లెక్కలేదు. తాము చేసిందే చట్టం అన్నరీతిలో వారి ఆగడాలు సాగుతున్నాయి. మండలంలోని సిద్ధాంతం, వేల్పూరు తదితర గ్రామాల నుంచి అక్రమంగా మట్టి తెచ్చి జగనన్న కాలనీ లేఅవుట్లను మెరక చేసి ప్రభుత్వం నుంచి భారీగా దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేస్తే వారిపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గతంలో మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేసిన యలవర్తి శ్రీనివాసరావుతో పాటు, అతనికి సంబంధించిన హోటల్‌పైనా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పార్టీ వ్యవహారంలో విమర్శలు చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఇంటిపైనా దాడి చేసి నానా రభస సృష్టించారు. ఇటీవల ఎన్టీఆర్‌ స్టేడియంలో మాజీ ఎంపీపీ గుత్తా శివరామకృష్ణపై నాని అనుచరులు భౌతిక దాడులకు దిగారు.

ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో, వివిధ జూద క్రీడలు నిర్వహించారు. క్యాసినోలో ప్రవేశ రుసుమే పదివేల రూపాయలు వసూలు చేశారు. ఇలా కోట్లలో దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ శిబిరంపై స్థానిక పోలీసులు కాకుండా ఏలూరు పోలీసులు దాడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లక్షల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ పలుచోట్ల రహస్యంగా ఆక్వా చెరువుల గట్లపై జూద శిబిరాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అడిగిన పని చేయకపోతే అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారు. గుడివాడ మండలంలో అక్రమంగా మట్టితవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి... అర్థరాత్రి రెవెన్యూ సిబ్బందితో కలిసి అడ్డుకోవడానికి వెళ్లిన ఆర్‌.ఐ. అరవింద్‌ను కొందరు నేతలు పొక్లెయిన్‌తో నెట్టి దాడి చేశారు. ఈ ఘటనలో నిందితులపై గుడివాడ తాలూకా స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. పట్టణంలోని ఓ సినిమా థియేటర్‌లో మార్పులు చేసి రెవెన్యూ అధికారి అనుమతి కోసం ఫైల్‌ పంపారు. నిబంధనలకు విరుద్ధంగా చేశారని, మార్చాలని అప్పటి తహసీల్దారు శ్రీనివాసరావు సూచించారు. దీంతో థియేటర్‌ నిర్వాహకుడైన వైసీపీ నేత.. ఆయనపై దాడి చేశారు..

గుడివాడలో సామాన్యులకు చెందిన ఇళ్ల స్థలాలపైనా కొడాలి నాని అనుచరుల కన్ను పడింది. నియోజకవర్గంలో పలుచోట్ల స్థలాల కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ సొమ్ములు దండుకుంటున్నారు. గుడివాడ బైపాస్‌ రోడ్‌లో శ్రీచైతన్య నగర్‌ కాలనీ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన వెంచర్‌లో సుమారు ఆరు ఎకరాలపై వివాదం ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే అనుచరులు... స్థలాలు కొన్న వారిలో కొందరిని బెదిరించి సంతకాలు తీసుకున్నారు.

స్థలాలను స్వాధీనం చేసుకుని ప్లాట్లను దున్నేసి చదును చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా కంచె వేశారు. బైపాస్‌ రోడ్డులోని ఓ విద్యాసంస్థకు చెందిన యజమాని.. బాకీలు తీర్చేందుకని తన స్థలాన్ని బేరం పెట్టారు. దానిని ఎవరూ కొనకుండా ఈ ముఠా బెదిరించింది. స్థల యజమానికి కొంత మొత్తాన్ని చేతిలో పెట్టి వారు భారీ ధరకు అమ్ముకున్నారు. గుడివాడలో కొత్తగా ఎవరైనా అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తే పెంట్‌హౌస్‌ తమకే ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. గుడివాడలో ఇటీవల ఓ స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ విషయంలో ఈ ముఠా కల్పించుకుంది. షాపులు తమ పేరిట రాయాలని వ్యాపారి కుమారుడిపై ఒత్తిడి చేశారు. లేనిపక్షంలో చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.