ETV Bharat / state

పదెకరాల్లో ప్రకృతి సేద్యం...పది మందికి ఆదర్శం..!

author img

By

Published : Dec 11, 2019, 8:03 AM IST

builder natural farming in poranki
పదెకరాల్లో ప్రకృతి సేద్యం...పది మందికి ఆదర్శం

ఇంజనీరింగ్‌ చదివారు. ఖరీదైన భవనాలు నిర్మిస్తూ...బిల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పనులకు... ఆదాయానికి ఢోకా లేని జీవితం గడుపుతున్నారు. అయినా అతనిలో ఏదో అసంతృప్తి. రోజురోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం... విషతుల్యమవుతోన్న ఆహారం... ప్రకృతి సేద్యంపై జరుగుతోన్న ప్రచారం... ఇవన్నీ ఆ ఇంజనీర్‌ను ఆలోచింపజేశాయి. నిర్మాణ రంగాన్ని కొనసాగిస్తూనే... తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పొలం బాట పట్టించాయి. సేంద్రీయ పద్ధతిలో వరి, ఇతర పంటల సాగు వైపు నడిపించాయి. పుడమి ఆరోగ్యానికి తాను సైతం ఓ నీటిబిందువై కదిలారు. ఆయనే కృష్ణా జిల్లా పోరంకికి చెందిన తోటకూర రామకృష్ణ.

పదెకరాల్లో ప్రకృతి సేద్యం...పది మందికి ఆదర్శం
ఇతని పేరు తోటకూర రామకృష్ణ. ఇంజినీరు పట్టభద్రులు. కృష్ణా జిల్లా పోరంకి స్వస్థలం. భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. రామకృష్ణ కుటుంబానికి పోరంకిలో పదెకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. మట్టిపై తనకుండే మక్కువతో నాలుగేళ్ల కిందట అందరిలానే సంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఓ సారి ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు సుభాష్‌ పాలేకర్‌ ప్రసంగాలు విన్నారు. ఆనాటి నుంచి ప్రకృతి సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. అంతవరకు అనుసరిస్తున్న సాధారణ వ్యవసాయ విధానాన్ని పక్కన పెట్టి... సేంద్రీయ సాగుబాట పట్టారు.

తన ఇంటి పాల అవసరాలకైనా పనికొస్తాయనే ఉద్దేశ్యంతో గోవుల పెంపకాన్నే చేపట్టారు రామకృష్ణ. రసాయన ఎరువులు, పురుగు మందులకు చెల్లుచీటి పాడారు. తన వద్ద ఎనిమిది ఆవులు, ఒక దూడ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే పేడ, మూత్రంతోనే పొలానికి అవసరమైన ఎరువులు సిద్ధం చేసుకున్నారు. జీవామృతం, వేప పిండి, మజ్జిగ, పలు రకాల కషాయాలు వాడటం మొదలుపెట్టారు. ఎలాంటి ఇతర రసాయనాలు వినియోగించకుండా సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేపట్టారు. దేశవాళీ విత్తనాలను ఎంచుకున్నారు. ఒకే విత్తనాన్ని మొత్తం పది ఎకరాలు వేయకుండా వివిధ రకాలను వినియోగించారు. విభిన్న రకాలైన నారాయణకామిని, ఘని, చింతలూరు సన్నాలు, కాలాబట్టి (నల్ల వరి) వంటి దేశీయ వరి వంగడాలు ఎంచుకున్నారు. ఇష్టంగా కష్టపడ్డారు. తొలి ఏడాది 16, తర్వాతి సంవత్సరం 20, ఈసారి ఏకంగా 24 బస్తాల దిగుబడులు సాధించారు. రామకృష్ణ ప్రకృతి సేద్యానికి వ్యవసాయశాఖ సిబ్బంది తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు.

ప్రకృతి సేద్యంతో పండే పంటలకు మంచి ధర రాదనేది అపోహ మాత్రమేనని రామకృష్ణ చెబుతున్నారు. తన పంట దిగుబడులను కొనుగోలు చేయడానికి దుకాణదారులు మూడు నెలల ముందు నుంచే వెంటబడుతున్నారన్నారు. ముందస్తుగా చెల్లింపులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అన్నింటి కన్నా ముఖ్యంగా.. ఈ ప్రకృతికి, తోటి మనుషులకు సేంద్రీయ సాగు ద్వారా తన వంతు సేవ అందిస్తున్నానన్న ఆత్మసంతృప్తిని చెందుతున్నానని త్వరలోనే ఈ తరహాలోనే కూరగాయల సాగు చేపట్టాలన్నది తన లక్ష్యమని రామకృష్ణ పేర్కొంటున్నారు.

ఔషధ, పోషక విలువలున్న వరి రకాలు పెంచితే మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుందన్నది రామకృష్ణ నమ్మకం. ఎంత వ్యాపార ఒత్తిడి ఉన్నా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతుంటారు. ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులను సంప్రదిస్తూ వారి సలహాలతో సాగుకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.

ఇవీ చదవండి...విశాఖ టు విజయవాడ... వయా యువత..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.