ETV Bharat / state

యూపీకే లేని 3 రాజధానులు ఏపీకి ఎందుకు..? : రాంమాధవ్

author img

By

Published : Aug 11, 2020, 1:20 PM IST

Updated : Aug 11, 2020, 2:14 PM IST

bjp-leader-rammadav
bjp-leader-rammadav

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం పరిమితంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. అంతమాత్రాన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా.. ఊరుకుంటుందని కాదని తెలిపారు. విజయవాడలో భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమ సభలో రాంమాధవ్ స్పష్టం చేశారు. రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి రాజ్యాంగపరమైన సమాధానం న్యాయస్థానానికి అందజేసిందన్నారు.

2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి హైదరాబాద్‌లో ఐదేళ్లో.. పదేళ్లో ఉండి పాలన చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌ వదిలి విజయవాడ వచ్చారని రాంమాధవ్ అన్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించారని.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడూ.. కేంద్రం జోక్యం చేసుకోకుండా.. నిర్మాణాలకు 2500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి సహాయం చేసిందన్నారు. గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని.. ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులపై తీసుకునే నిర్ణయంలోనూ పరిమితంగానే కేంద్ర ప్రభుత్వ చొరవ ఉంటుందని తెలిపారు.

"దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కి లక్నో ఒక్కటే రాజధానిగా ఉంది. అక్కడి నుంచి పరిపాలన సజావుగానే జరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని.. మూడు రాజధానులు కడతామంటే.. అవినీతిపై ఖచ్చితంగా భాజపా పోరాడుతుంది. ఈ నిర్ణయం మూడింతల అవినీతికి సాధనంగా మారకూడదు. అమరావతి ప్రాంతంలో పోరాటం చేస్తోన్న చిట్టచివరి రైతు వరకు న్యాయం జరిగేందుకు భాజపా ముందుండి పోరాటం చేయాలి. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం ముందు ఉంది. మూడు రాజధానుల విషయంలో ఏ నిర్ణయం వస్తుందనేది చూడాలి. 3 రాజధానులు అవినీతికి పెద్ద ఆలవాలంగా మారకూడదు. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ఇలాంటి అంశాలపై భాజపా రాష్ట్ర శాఖ నిర్మాణాత్మకంగా సంఘర్షణ పూరితంగా పోరాటం చేయాలి."- రాంమాధవ్ ,భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

2024లో రాష్ట్రంలో భాజపా అధికారానికి దగ్గరగా రావాలంటే ఇప్పటి నుంచి చాలా కష్టపడి పనిచేయాలని రాంమాధవ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భాజపా నిలవాలన్నారు. ప్రతిపక్ష పార్టీల విషయంలో ప్రభుత్వవైఖరిని తాము చూస్తున్నామని.. అధికార పార్టీ దురహంకారం, గూండాయిజంను సమర్ధంగా ఎదుర్కోవాలని అన్నారు. రాజకీయాలు పూలమాన్పు కాదని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన పోటీదారుల ఇళ్లకు పోలీసులు వెళ్లి భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. అధికార పార్టీలు దుర్వినియోగానికి పాల్పడుతుంటే సంఘర్షణతో పోరాటానికి సిద్ధం కావాలని నేతలుకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం బలమైన రాజకీయ శక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం నిలబడే వ్యక్తులను భాజపా వైపు ఆకర్షించాలని.. కులతత్వం నుంచి బయటకొచ్చి అందరికీ ఒక వేదికపైకి తీసుకురావాలని అన్నారు. నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ కొత్త కమిటీని త్వరగా నియమించి.. ప్రజలకు చేరువ కావాలని సూచించారు.

ఇదీ చదవండి: మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

Last Updated :Aug 11, 2020, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.