ఆస్తి వివాదం.. తల్లీకుమార్తెను హత్య చేసిన బంధువులు

author img

By

Published : Jun 14, 2022, 9:56 AM IST

Updated : Jun 15, 2022, 6:48 AM IST

knife

09:50 June 14

ఆస్తి దగాదాల నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ

ఆస్తి విభేదాలు మానవ సంబంధాలను మంట కలిపాయి. రక్త సంబంధీకుల చేతిలో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. భూమి విషయంలో నెలకొన్న వివాదం కారణంగా తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురవ్వగా... మరో వ్యక్తి గాయపడిన ఘటన కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసినవారిపాలెంలో చోటు చేసుకుంది. బందరు డీఎస్పీ మాసుంబాషా వివరాల మేరకు.. పోసినవారిపాలెం గ్రామానికి చెందిన పోసిన శాంతమ్మ(81)కు ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. ఎవరికి వారు జీవనం సాగిస్తున్నారు. శాంతమ్మ కుమార్తె రూపావతి(47) భర్తతో విడిపోయి గ్రామంలోనే ఒంటరిగా ఉంటోంది. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలున్నాయి. దానిపై రూపావతి కోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో మళ్లీ వివాదం రాజుకుంది. కేసు ఉపసంహరించుకోవాలంటూ రూపావతి, ఆమెకు మద్దతు తెలుపుతున్న శాంతమ్మపై ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. గతంలో గొడవలు కూడా జరిగాయి.

మంగళవారం ఉదయం శాంతమ్మ కుమారుడి కొడుకులైన సాంబశివరావు, మల్లేశ్వరరావులతో పాటు మరో ఐదుగురు నాన్నమ్మతో పాటు మేనత్త అయిన రూపావతిలపై వారి వారి ఇళ్ల వద్ద మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శాంతమ్మ మరో కూతురి కొడుకు శిరివెళ్ల నాగరాజు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతనిపైన దాడి చేయడంతో కాలికి తీవ్ర రక్తగాయమైంది. జిల్లా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. తల్లీకుమార్తెల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో తాలూకా సీఐ వీరయ్యగౌడ్‌, గూడూరు ఎస్సై కల్యాణి పికెట్‌ ఏర్పాటు చేశారు. పోలీసులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితుల కుటుంబీకులు జిల్లా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డీఎస్పీ మాసుంబాషా వారితో చర్చించారు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను తప్పించే ప్రయత్నం చేశామని ఆరోపించడం సరికాదని చెప్పారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 15, 2022, 6:48 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.