ETV Bharat / state

గన్నవరంలో విధ్వంసం.. టీడీపీ కార్యాలయంపై దాడి

author img

By

Published : Feb 21, 2023, 8:34 AM IST

Attack on TDP office in Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు.. అరాచకం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయంపై విధ్వంసకాండకు దిగారు. పోలీసుల సమక్షంలోనే.. కార్లపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతోపాటు కార్యాలయంలో సామగ్రిని ధ్వంసం చేశారు. తెలుగుదేశం శ్రేణులతో మీడియా ప్రతినిధులు, పోలీసులూ గాయపడ్డారు. ఇంతా చేసి.. తిరిగి తెలుగుదేశం శ్రేణులపైనే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Attack on TDP office in Gannavaram
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి

గన్నవరంలో గరం గరం

Attack on TDP office in Gannavaram: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల అరాచకంతో..గన్నవరం రణరంగమైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మనుషులు..తెలుగుదేశం కార్యాలయంపై మూకుమ్మడిగా దాడి చేశారు. గత కొన్నిరోజులుగా.. వంశీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ను అగౌరవపర్చేలా మాట్లాడారంటూ వంశీకి.. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఘాటుగా బదులిచ్చారు. ఆ తర్వాత గన్నవరానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కూడా వంశీపై విమర్శలు చేశారు.

విధ్వంసం: సోమవారం ఉదయమే దొంతు చిన్నాకు.. పదేపదే బెదిరింపు ఫోన్లు వెళ్లాయి. ఇంటి మీదకు వెళ్లి కుటుంబ సభ్యులనూ భయపెట్టారు. అప్పుడే.. టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు.. గన్నవరం పార్టీ కార్యాలయంలో సమావేశమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ప్రదర్శనగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే వంశీ మనుషులు విధ్వంసానికి దిగారు.

జై వంశీ అంటూ నినాదాలు: వైఎస్సార్సీపీ బెదిరింపులపై.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు చర్చించుకున్నారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి దిగారు. పోలీసులను తోసుకుంటూ.. టీడీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కర్రలు, రాళ్లతో లోపల అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు.. పగలగొట్టారు. ఎనికేపాడుకు చెందిన తెలుగు యువత నాయకుడు కోనేరు సందీప్‌ ఇన్నోవా కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మరో మూడు కార్లను ధ్వంసం చేశారు. దాదాపు గంట పాటు ఈ విధ్వంసకాండ కొనసాగింది. జై వంశీ అంటూ నినాదాలు చేస్తూ వీరంగం వేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. కానీ మౌన ప్రేక్షకుల్లా నిలిచారు. సుమారు 50 మంది.. దాడిలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పెట్రోల్ పోసి కార్లకు నిప్పు: కర్రలు, రాళ్లతో వంశీ అనుచరులు.. విధ్వంసం సృష్టించారు. ప్రాంగణంలోని కార్లనూ పగలగొట్టడంతోపాటు.. ఓ కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దొరికిన వారిని దొరికినట్లు బాదారు. వంశీకు అత్యంత సన్నిహితులే టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో.. స్వయంగా పాల్గొన్నారు. వంశీకు అన్నీతానై వ్యవహరించే.. ఓలుపల్లి రంగా, గన్నవరం ఎంపీపీ రవి, బాపులపాడు ఎంపీపీ నగేష్, తేలప్రోలు రాముగా పిలిచే భీమవరపు యతేంద్ర రామకృష్ణ.. నల్ల ప్రసాద్, పోతుమర్తి బాబీ, కొల్లి చిట్టి, గొంది పరంథామయ్య..గుడ్డేటి సుధాకర్, త్రిపుర్నేని బాబీ ఈ దాడికి నేతృత్వం వహించినట్లుగా సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాల్లో.. స్పష్టంగా కన్పించింది. దీన్నిబట్టిచూస్తే.. పక్కా ప్రణాళికతోనే వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

పోలీసులకు ముందే తెలుసా?: సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీదుగా వంశీ కారు వెళ్లింది. ఎమ్మెల్యే వాహన శ్రేణి వెళ్లగానే దాడి మొదలైంది. పైగా అప్పటివరకు వంశీతోపాటు తిరిగిన అనుచరులుంతా ఈ దాడిలో పాల్గొన్నారు. దాడికి ముందే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పోగయ్యారు. ఏదో జరగబోతుందని.. ముందే పోలీసులకు తెలిసినా వారు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యారు. పైగా దాడి చేస్తున్న ఎమ్మెల్యే సన్నిహితుల్ని బతిమాలడం దృశ్యాల్లో కనిపిస్తోంది. కార్ల అద్దాలు పగలగొడుతున్నా, తగలబెడుతున్నా గట్టిగా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. పైగా చరవాణిలో ఫోటోలు, వీడియోలు తీస్తూ కన్పించారు. విధ్వంసం పూర్తిగా ముగిశాక ఒక్కొక్కరిని బయటకు పంపారు. ఆ తర్వాత తెదేపా శ్రేణులు 16వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగగానే వారిని నియంత్రించేందుకు గట్టిగా కృషి చేశారు.

పలువురికి గాయాలు: దాడి సందర్భంగా గన్నవరం సీఐ కనకారావుతో పాటు.. టీడీపీ మహిళా నాయకురాలు మండవ లక్ష్మీ, నాయకులు కోనేరు సందీప్, పోక కిరణ్, డ్రైవర్‌ శివ, కార్యాలయ సిబ్బంది సత్య, ఓ దినపత్రిక విలేఖరి గాయపడ్డారు. సీఐని సిబ్బంది ద్విచక్ర వాహనంపై.. గన్నవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన టీడీపీ శ్రేణులకు స్థానికంగానే.. చికిత్స అందించారు. ఘటన సమాచారం తెలియగానే.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలోకి ఎక్కించి.. తొలుత వీరవల్లి, ఆ తర్వాత హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారని చెప్పినా.. ఆ రెండు చోట్లకు తీసుకువెళ్లలేదు. ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్‌లో ఉంచడం, ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో.. నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.

మరోసారి రెచ్చిపోయిన అల్లరిమూకలు: సోమవారం రాత్రి 9 గంటల తర్వాత వంశీకు మద్దతుగా.. అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ఇంటి మీదకు.. దూసుకెళ్లారు. ఇంటి వద్ద ఉన్న చిన్నా కారుపై పెట్రోల్‌ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. కారుకు నిప్పంటుకోగా.. పోలీసులు మంటలు అదుపు చేసి, ఎమ్మెల్యే మద్దతుదార్లను వెనక్కి పంపారు. తెలుగుదేశం కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సహా.. నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పార్టీ ఆఫీస్ ఖాళీ చేయించారు. గన్నవరం.. టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.