ETV Bharat / state

వైకాపా ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ కరవు: అచ్చెన్నాయుడు

author img

By

Published : Nov 23, 2020, 6:43 PM IST

రాష్ట్రంలో మైనారిటీలపై వైకాపా నేతలు మూకదాడులకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదని ఆరోపించారు. వైకాపా నేతల దాడి వల్లే గుంటూరు జిల్లా తాడికొండలో మౌజమ్ మహమ్మద్ హనీఫ్ ఆత్మహత్యకు యత్నించారన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలోనే మైనారిటీలకు రక్షణలేదని ఆరోపించారు. హనీఫ్​పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

atcham naidu
atcham naidu

రాష్ట్రంలో మైనారిటీలపై వైకాపా నేతలు మూకదాడులకు పాల్పడుతూ, వారు జీవించే హక్కును కాలరాస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని దుయ్యబట్టారు. మైనారిటీలపై విద్వేష దాడులు, హత్యలు పెరగటంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డారు. సలాం ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా తాడికొండలో మౌజమ్ మహమ్మద్ హనీఫ్ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమన్నారు. మైనారిటీలపై జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ ఘటన అద్దం పడుతోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోంమంత్రి సొంత జిల్లాలోనే దాడులు జరుగుతున్నా ఇంతవరకూ నిందితులను పట్టుకోకపోవటం ప్రభుత్వ అసమర్థతేనని అచ్చెన్న ధ్వజమెత్తారు. మైనారిటీలపై వైకాపా ప్రభుత్వ కపట ప్రేమ మరోసారి బయటపడిందన్న ఆయన.... దోషులను శిక్షించాల్సిన ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుండటంతోనే ఈ తరహా వికృత చేష్టలు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. దాడిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితుల్ని శిక్షించటంతో పాటు మున్ముందు ఇలా జరగకుండా మైనారిటీ హక్కులను కాపాడే పటిష్ఠ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి : రఫీ

వైకాపా వేధింపులతోనే తాడికొండలో హనీఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి రఫీ ఆరోపించారు. శ్మశానంలో మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే అనుచరులు హనీఫ్​పై దాడిచేసి దుర్భాషలాడారన్నారు. దీంతో మనస్థాపం చెందిన హనీఫ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించారని తెలిపారు. వైకాపా నేతలు శ్మశానాలను సైతం కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మైనారిటీలకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదన్నట్లుగా వైకాపా నేతల తీరుందన్న రఫీ... ముఖ్యమంత్రి స్పందించకుంటే వైకాపా నాయకులు ఇంకా హద్దు మీరి ప్రవర్తిస్తారన్నారు. హనీఫ్​పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : నివర్​తో ఒక్కసారిగా పెరిగిన వరి కోత ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.