ETV Bharat / state

ఉదారంగా సాయం అందేలా చూడండి..కేంద్ర బృందానికి సీఎస్ విజ్ఞప్తి

author img

By

Published : Nov 9, 2020, 2:06 PM IST

Updated : Nov 10, 2020, 3:53 AM IST

రాష్ట్రంలో 3నెలల పాటు చోటుచేసుకున్న తుపాన్లు, భారీ వర్షాలతో 6వేల 386 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు నివేదించారు. 17 లక్షల 74వేల మంది అవస్థలకు గురయ్యారన్నారు. తాత్కాలికంగా 840 కోట్లు, శాశ్వతంగా 4వేల 439కోట్ల రూపాయల సాయం అవసరమని తెలిపారు.

a-tour-of-central-teams-
a-tour-of-central-teams-

రాష్ట్రంలో భారీ వర్షాలకు జరిగిన నష్టాల క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం పంపిన ఏడుగురు సభ్యుల బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సహా సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైంది. హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్‌ అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, విద్యుత్తు, ఆర్థిక, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ, జలశక్తి, రహదారులశాఖ ఉన్నతాధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తుపాను, అల్పపీడనాల వల్ల కురిసిన భారీ వర్షాలు, జరిగిన పంట నష్టాలను సీఎస్‌ వారికి వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాలను చాలా వరకూ నివారించిందన్నారు. వరద ప్రభావిత కుటుంబాలకు తగిన సాయంతో పాటు, రైతులకు పెట్టుబడి రాయితీ అందించామని చెప్పారు. వర్షాలకు తడిసి, రంగుమారిన ధాన్యం, దెబ్బతిన్న వేరుశనగను రైతుల నుంచి కొనుగోలు చేసేలా కేంద్రం నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా తమ నివేదికలో సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మొత్తం రూ.6,386 కోట్లు...

3 నెలల పాటు వరుసగా వచ్చిన తుపాన్లు, భారీ వర్షాల వల్ల వ్యవసాయం, ఇతర రంగాలకు మొత్తం 6వేల 386కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాష్ట్రం కేంద్ర బృందానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. తాత్కాలిక పునరుద్ధరణ, సహాయ చర్యలకు 840 కోట్లు, శాశ్వత చర్యలకు మరో 4 వేల 439కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తెలిపింది. 2లక్షల 12వేల హెక్టార్లలో వరి దెబ్బతినగా... 903 కోట్లు నష్టం వాటిల్లింది. 24వేల 516 హెక్టార్లలో 483 కోట్ల మేర ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 5వేల 583 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిని 2వేల 976కోట్ల నష్టం చోటుచేసుకొంది. 1081 మైనర్, 142 మీడియం, 443 మేజర్ ఇరిగేషన్ పనులు దెబ్బతిన్నాయి. వెయ్యీ 74 కోట్ల నష్టం కలిగింది. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 3వేల 125 కిలోమీటర్ల మేర రోడ్లు, డ్రైనేజీ పనులు దెబ్బతిని 781కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పురపాలక శాఖకు 75కోట్లు, పశు సంవర్ధక, మత్స్య, ఇంధన, గ్రామీణ నీటిసరఫరా విభాగాల పరిధిలో అపార నష్టం చోటుచేసుకొందని సీఎస్ కేంద్ర బృందానికి వివరించారు.

రాష్ట్రంలో మొత్తం 387 మండలాల్లో 3వేల 310 గ్రామాలు భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు. 448 గ్రామాలు, స్థానిక సంస్థలు, 27 పట్టణాలు ముంపునకు గురికాగా, 17లక్షల 74వేల మంది అవస్థలకు గురయ్యారన్నారు. 45మంది చనిపోగా, ఐదుగురు గల్లంతయ్యారని, 8వేల 784 ఇళ్లు దెబ్బ తిన్నాయని చెప్పారు. లక్షా 68వేల 603 గృహాల చుట్టూ నీరు చేరగా, 2 లక్షల 85 వేల మందిని 393 సహాయ, పునరావాస శిబిరాలకు తరలించామన్నారు. 12లక్షల 85వేల ఆహార పొట్లాలు, 85లక్షల 66వేల మంచినీటి ప్యాకెట్లు, 34వేల 708 లీటర్ల పాలు అందించినట్లు తెలిపారు. 738 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఇళ్ళ చుట్టూ నీరు చేరిన కుటుంబాలకు 2వేల రూపాయల చొప్పున నగదు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో ఉల్లిపాయలు, టమాటాలను ఉచితంగా అందించామని వివరించారు. ఇందుకోసం 399 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. వ్యవసాయం, రహదారులు - భవనాలు, పౌరసరఫరాలు, పురపాలక అధికారులు శాఖల వారీగా జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంతకుముందు వరదల నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది.

ఇదీ చదవండి:

సైబర్​నేరాలు అరికట్టేందుకు సాంకేతికతపై మరింత పట్టు

Last Updated :Nov 10, 2020, 3:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.