హాయ్..! నా ప్రేమను గెలుచుకోడానికి నన్నే త్యాగం చేశాను..

author img

By

Published : Feb 14, 2023, 5:55 AM IST

రెండు మనసులు మాటలు
రెండు మనసులు మాటలు ()

Valentines Day Love story : రెండు మనసులు మాటలు నేర్చుకున్న తర్వాత పలికే పదం ప్రేమ అంటారు ప్రేమలో మునిగితేలుతున్నవారెవరైనా. దీనికి ప్రత్యేక మైన లిపి లేదు కానీ.. ఈడొచ్చిన వారందరికి గురువు అవసరం లేకుండానే వచ్చే భాష. చిన్ననాటి నుంచి ఎన్నో ప్రేమ జంటలను దగ్గరుండి చూసిన నాకు ప్రేమపై ఓ కచ్చితమైన అభిప్రాయం అంటూ ఏదీలేదు.. కానీ చూస్తూ చూస్తూనే సూర్యకిరణానికి గడ్డిపరక మొనన నిలిచిన మంచు తుషారంలా కరిగినట్టు.. నాకే తెలియకుండా ఆమెతో ప్రేమలో పడిపోయింది నామనసు. కొన్ని వేల ప్రేమజంటలకు సాక్షమైన నేను.. నా ప్రేమను గెలుచుకోడానికి నన్నే త్యాగం చేశాను.. విశాఖ సాగరతీరంలో అందరికీ సుపరిచితమైన నేను.. ఈ ప్రేమికుల రోజు నా కథను మీతో చెప్పుకోవాలనిపించి ఇలా మీ ముందుకొచ్చాను.

Valentines Day Love story : సరిగ్గా ఐదేళ్లక్రితం మొదలైన కథ..(నా మాటల్లో భావం నకలీ కాకుండా ఉండడానికి నా స్థానిక భాషలోనే చెప్పుకుంటాను.. కాస్త అర్థం చేసుకోండి..) ఆ రోజుఏంటో సరిగ్గా గుర్తులేదు కానీ.. ప్రేమికుల పండుగ.. అదేనండి ఫిబ్రవరి 14.. 2018. నిత్యం రద్ధీగా ఉండే విశాఖ సాగరం తీరం.. భీమిలీ బీచ్.. ఆరోజు లెక్కలేనన్ని ప్రేమజంటలు. చుట్టూ ఎంతో మంది ఉన్నా ప్రేమికుల్లో ఆజంటకు వారికి వారిరువురు తప్ప ఎవ్వరూ కనిపించడంలేదనుకుంటా.. ఆవిషయం అక్కడ ఎవ్వరిని అడిగినా అదే చెబుతారు. ఇలా ఒకటా రెండా.. ప్రేమ సఫలమైన వారు మరళా సాగరతీరానికి జంటగా వచ్చేవారు.. కొందరు కడలిలోనే జంటగా కలిసిపోయేవారు. ఎన్నో ప్రేమలను చూసిన నాకు.. ఆవేళ సాయంత్రం ఎప్పుడూ ఉన్న చోటే ఉండగా ఓ అద్భుతం జరిగింది.

ఏకాంతంగా కూర్చొని కడలి పైనుంచి వస్తున్న పిల్లగాలి సంగీతాన్ని వింటూ.. వస్తూపోతూ కెరటాల చుట్టాలు పలకరిస్తున్నాను. సమయం ఎట్టా గడిచిపోయిందో తెలియకుండానే మాపుటేల అయిపోయింది. సాయంత్రం పోటు కావడం వల్ల కెరటాలు నేను ఉన్న చోటుదాటి కాస్త ముందుకెళ్తున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కృత్రిమం చేస్తూ.. చుట్టూ వాహనాల ధ్వనులు.. విద్యుత్ కాంతులు.. డీజే పాటలు ఉండనే ఉన్నాయి.

నా మట్టుకు నేను వచ్చి పోతున్న కెరటాలను పేరుపేరునా పలకరిస్తూనే ఉన్నాను.. ఇంతలో ఓ చల్లని గొంతు నుంచి నాపేరు.. చుట్టూ చూశాను.. ఎవ్వరూ కనిపించలేదు. నన్ను కాదేమోనని ఊరుకున్నాను.. మరలా మరింత దగ్గరగా వినిపించింది ఆ గొంతు. ఆమె దాగుడు మూతల్లో నేను తనను కనిపెట్టలేకపోతున్నాను. ఈపాలు ఇలా కాదు అని గొంతు వినిపించినోపే ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నాను. నన్ను ఆటపట్టిద్దాముకుని నా దగ్గరకొచ్చి పిలిచి పుసుక్కున దొరికిపోయింది.

ఎంతటి అందమైన రూపం తనది. పండువెన్నెల్లో కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. మిలమిలా మెరుస్తున్న ముత్యాల నవ్వుకు గలగల సవ్వడి తోడై.. ఏ పనిలో ఉన్నా చూపుతిప్పుకోనివ్వలేని అందం ఆమెది. ఒళ్లంతా వంపులే అనుకుంటాను.. ఎలా అంటే అలా తిరిగిపోతుంది.. అప్పుడే పరుగులు, వెంటనే నడకలు.. సిగను పూసిన మత్య్సపూలతో.. ఒళ్లంతా లవణీయత నింపుకున్న నిండు పున్నమిలా ఉంది. నేను తనను గుర్తు పట్టడంవల్ల సిగ్గుల మొగ్గై తుర్రున పారిపోయింది. ఈసారి వచ్చినప్పుడు తనతో ఎలాగైనా మాట్లాడాలని తెలిసిన అక్షరాలన్నీ కుప్పగా పోసుకుని.. కావాల్సిన వాటిని ఏరుకుని పదాల దండ కట్టుకుని.. ఆమె రాకకై చూస్తూ ఉన్నాను. కనిపించిన వెంటనే అక్షరాల మాలను తన మెడలో వేసి ఒక్కో మాట విప్పి తనతో చెప్పాలనుకున్నాను. ఏంలాభం.. తను కనిపించగానే చూస్తూనే ఉండిపోయాను. మరళా వెళ్లిపోయింది.. ఈసారి అరగంట వరకు కనిపించలేదు. ఈ 30నిమిషాల్లో నా హృదయం.. నింగిని, కడలితో పాటు ఈ భూమండలాన్ని జల్లెడవేసింది. అలసి కూర్చున్న నా చెంతకు తానే వచ్చింది. నా కష్టాన్ని తానే గుర్తించి నా మాటలకు తానే నాంది పలికింది.

ఆమెపేరు అంబునిధి. వాళ్ల అమ్మానాన్నకు ఏకైక గారాల పట్టి అంట. ఆ విషయం చూస్తుంటూనే తెలిస్తోందనుకోండి. తనను వాళ్లు విడిచి ఉండడమే లేదు. వాళ్లు లేని ఏ రెప్పపాటు సమయమో తనతో నాకు మాట్లాడేది. తను నన్ను ఈ తీరాన ఎప్పటి నుంచో చూస్తోందట. చానాళ్లు మాట్లాడదామనుకునే దగ్గరగా వచ్చి వెళ్లిపోయేదట. నాతో చెప్పాలనుకున్న ఎన్నో మాటలను మూటలు కట్టుకుని ఒక్కొకటి విడమరిచి చెబుతుంటే.. ఆ కడలిపై తేలియాడుతూ వెళ్లిపోతుంది నామనసు. ఏదేమైనా మనకు బాగా నచ్చిన అమ్మాయి.. మనకు తెలియకుండానే మనపై మనసుపారేసుకుని.. ఆ మాటలను మనతో పంచుకుంటూ ఉంటే ఆ భావాన్ని వర్ణించ అక్షరాలు ఉంటాయంటే నేను నమ్మను.

ఇలా ఎలా గడిచిపోయిందో తెలియదు సుమారు రెండేళ్లు తిరుగొచ్చాయి. తన రాకతో నాలో వచ్చిన మార్పు నాకే కాదు. నన్ను పసిగట్టేవాళ్లకు తెలిసిపోయింది. ఈసారి ప్రేమ పండుగను మేమిద్దరం సముద్రమంత సంబురంగా చేసుకుందాముకున్నాం. మా మనసును పెద్దల ముందు పెడదామని నిర్ణయించుకున్నాం. ఎంతో ప్రేమగా చూసుకునే మా వాళ్లు మా మనసును అర్థం చేసుకుంటారని అనుకున్నాం. చిగురులు తొడిగిన మా ప్రేమ.. పెద్దల నిర్ణయంతో చిగురుటాకులా వణికింది.

ప్రేమ పండుగకు 15రోజులు ముందు నుంచి తనజాడ కానరాలేదు. ధూళి రేణువు నుంచి.. నింగిలో తార వరకు కనిపించిన అందరినీ అడిగాను. అయినా జాడ తెలియరాలేదు. వచ్చిపోయే కెరటాల చుట్టాలతో.. కబురు పంపించా అసలు ఏమైందో కాస్త కబురుచేయమని. పక్షం గడిచినా తన రూపు కానరాలేదు. నా బాధను చూసి నా చుట్టూ ఉన్నవాళ్లు, బంధువులు.. ఓదారుస్తూ ఉన్నారు. దేహానికి తగిలిన గాయాన్ని మాన్పడానికి ముందులున్నాయి కానీ.. హృదయానికి కలిగిన బాధను తగ్గించేందుకు ఏదీలేదు.. తన పలుకు తప్ప. ఈ పక్షం రోజుల్లో నేను అనుభవించిన వేదన నలిగిన నా హృదయానికే తెలుసు.. అర్ధరాత్రైనా నిద్రరాని నా కనులు కడలి తీరానే కూర్చుని తన రాకకోసం చూస్తునే ఉన్నాయి.

ఓరోజు పరాగ్గా కూర్చుని ఉన్న నాకు.. తన స్పర్శతో మనసు పులకించింది. వెయ్యి జాబిళ్లు, కోటి తారలు ఏకమైనంత కాంతి నా మోములో.. యుగాల తర్వాత ఆమెను చూసిన అనుభూతి. ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఉబ్బిన కళ్లతో.. దేహమంతా గాయాలతో చిత్రవధ అనుభవించిన దానిలా ఉంది. తన కన్నీళ్లతోనే కరిగిపోయింది నా హృదయం. ఏమైందని కనుక్కుంటే.. మా ప్రేమ ఫలితం ఇదని చెప్పింది.. నాతో ప్రేమ విషయం తెలిసి వాళ్లఅమ్మా నాన్నతో పాటు బంధువులు వ్యతిరేకించారంట. సోదరులు దాడి చేసి.. నా వైపు రాకుండా కట్టడి చేశారంట. నన్ను చూసేందుకు వచ్చినా, మాట్లాడినట్టు తెలిసినా నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరిండంతో నాకోసం భయపడి మిన్నుకుండిపోయినట్లు.. ప్రతిక్షణం నాకోసం పరితపించిన తన మనసును నా ముందు ఉంచింది.

మా పెళ్లికి ఒప్పుకోడానికి మా కుల, మత, జాతులు వేరంట. నాతో పెళ్లని చెప్పగానే తనను చంపడం తప్ప.. అయినంతపని చేశారంట. తను దూరమైన ఈ కొన్ని రోజులు నేను ఎంత నరకం అనుభవించానో.. నాకంటే ఓ పదింతలు ఎక్కువే అనుభవించింది తను. తనను ఆ పరిస్థితిలో చూడగానే కుల, మత, వర్ణ వివక్షతలు పెట్టిన ఈ సమాజంపై నాకు పట్టలేనంత కోపం వచ్చింది. కానీ చేసేది ఏమీలేదు.. పరిస్థితులకు తలొంచడం తప్ప. నాకు ఆరోజే తెలిసింది కన్నీటి రుచి ఏమిటో. తనను నాతో వచ్చేయమంటే రానంది. కనిపెంచి పోషించిన తల్లి తండ్రులకు అన్యాయం చేయలేనని. అలాగని నన్ను మరవలేనని బరువెక్కిన హృదయంతో లిప్తపాటులో కంటి ముందు నుంచి కనుమరుగైపోయింది. తను వెళ్లిన వైపే నా కనులు రెప్పవేయడం మరచిపోయి చూస్తూనే ఉండిపోయింది.

తను వెళ్లిపోవడంతోనే ముక్కలైన నా హృదయం.. సాగర తీరమంతా పరుచుకుంది. తను ఎప్పటికైనా ఏదొక తీరంలో కనిపిస్తుందని, అప్పటికైనా నా ప్రేమ ఫలిస్తోందని ఇప్పటికీ ఒడ్డునే వేచిచూస్తోంది. హృదయాన్ని కోల్పోయిన నేను కడలి అంచునే నిజమైన బండరాళ్లుగా మారిపోయాను. కానీ ఇప్పటికీ ఆమె హృదయాన్ని గెలుచుకున్న వాడిగా.. మా ప్రేమపై నమ్మకంతో.. ఆమె నాకోసం ఎప్పటికైనా తిరుగొస్తుందని వేచి చూస్తున్నా. మీరు ఎక్కడైనా బీచ్ కి వెళితే నా ప్రేయసి మీ కంటపడితో నా మాట మీ మాటగా ఆమె చెవిన వేస్తారు కదూ. ఇంతకీ మేము ఎవరో చెప్పలేదు కదూ.. సాగరతీరాన ఉన్న బండ రాయిని నేనైతే.. కెరటం నా ప్రేయసి..

"మధురానుభూతుల రుచులు చూపించిన మా ప్రేమ.. కన్నీటి రుచిని కూడా చూపించింది. సంతోష సామ్రాజ్యాలను పాలించడమే కాదు.. దుఃఖ సాగరాలను ఈదాలని తెలిసేలా చేసింది." మనసును మాత్రమే ప్రేమించే అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. - ఇట్లు ఓ పగిలిన హృదయం..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.