ETV Bharat / state

Untimely Rains : వేసవిలో అకాల వర్షం.. రైతులకు అపార నష్టం

author img

By

Published : Apr 23, 2023, 4:27 PM IST

Updated : Apr 23, 2023, 9:57 PM IST

Untimely Rains Damage Crops In Konaseema: అకాల వర్షాలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కోనసీమ, అల్లూరి జిల్లాల్లో చేతికందిన పంట నీటి పాలు కావడంతో రైతులు లబోదిమంటున్నారు. ఈదురు గాలులకు కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు. రోజుల తరబడి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలనే నిండామునిగిపోయామని ఆగ్రహం రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Untimely Rains Damage Crops In Konaseema
కోనసీమలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు

వేసవిలో అకాల వర్షం.. రైతులకు అపార నష్టం

Untimely Rains Damage Crops In Konaseema : అకాల వర్షంతో రైతులు సతమతమవుతున్నారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంతో సహా పలు ప్రాంతాలలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. జిల్లావ్యాప్తంగా లక్షల 72 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 30 శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. అక్కడక్కడ ధాన్యం కొనుగోలు మొదలుపెట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించేందుకు వీలుగా తేమను తగ్గించేందుకు రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. వేసవిలో అకాల వర్షం ఇబ్బంది పెడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించేందుకు వీలుగా సకాలంలో సంచులు సరఫరా చేయడం లేదని రైతుల మదనపడుతున్నారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు.

నేల కొరిగిన చెట్లు..తప్పిన ప్రమాదం : అకాల వర్షాలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కురిసిన వర్షానికి చేతికందిన పంట నీటిపాలైందని దిగులు చెందుతున్నారు. ఇంకా వానలు కొనసాగితే.. ధాన్యం మొలకలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కాట్రేనికోన మండలం కందిపప్పులో ఈదురు గాలులకు కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఒక చెట్టు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోపై పడటంతో.. ఆటో రెండు ముక్కలైంది.

అకాల వర్షం..రైతులకు తీవ్ర నష్టం : రాజోలులో అకాల వర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన వరి పంట చేతికి అందకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మాసూలు చేసుకుని ఐదు రోజులు కావస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. తక్షణం తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. లేకుంటే ఆత్మహత్యలే శరణం శరణ్యమని కన్నీటి పర్యంతమవుతున్నారు. అకాల వర్షాలకు రాజోలులో 221 ఎకరాల ధాన్యం, 421 ఎకరాల్లో పనల మీద వరి పూర్తిగా తడిసి ముద్దయిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తడిసిన ధాన్యంపై పది లీటర్ల నీటిలో 2శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేసుకుంటే మొలకలు రావని చెబుతున్నారు.

వర్షానికి తడిసిపోయిన మిరప : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. విలిన మండలాల్లో ప్రధాన పంటగా మిరపను.. 5వేల650ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మిరప కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అకాల వర్షంతో మిరప కాయలు తడిసి ముద్దైయ్యాయని అన్నదాతలు వాపోతున్నారు.

" ఇప్పటికే సుమారు 30 క్వింటాలు కోశాము. వర్షానికి మిరప మొత్తం తడిసి పోయింది. ఇప్పుడు వాటిని ఎవ్వరు కొంటారో మాకు అర్థం కావడం లేదు. " - సత్య నారాయణ, మిరప రైతు

పిడుగుపడటంతో ఇద్దరు రైతులు మృతి : గుంటూరు జిల్లాలో పిడుగు పాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. ప్రత్తిపాడు, పాత మళ్లాయపాలెం ,కొత్త మల్లాయపాలెం సమీపంలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పంట ఉత్పత్తులపై పరదాలు కప్పుతున్న రైతులకు సమీపంలో పిడుగు పడటంతో శ్యామ్ బాబు అనే రైతు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. స్వృహ కోల్పోయిన మరో రైతును సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృపాదానం అనే రైతు మరణించారు. భారీ ఈదురు గాలులకు రహదారులపై ఉన్న దుకాణాలు నేలమట్టమయ్యాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.

ఉరుములు, మెరుపులతో వర్షం : కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. మొక్కజొన్న, పసుపు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతున్నాయని రైతుల ఆందోళన చెందుతున్నారు.

పిడుగు పడి వరి గడ్డి వాములు దగ్ధం : కృష్ణా జిల్లాలో పలుచోట్ల పిడుగు పడి వరి గడ్డి వాములు దగ్ధం అయ్యాయి. కోడూరు మండలం, పిట్టల్లంకలో వరికుప్పపై పిడుగు పడింది. భావిశెట్టివారిపాలెంకు చెందిన భావిశెట్టి గోపాలరావుకు చెందిన 70 సెంట్ల వరికుప్ప పూర్తిగా దగ్ధమైంది. చల్లపల్లి మండలం రామానగరంలో, గ్రామంలో పిడుగు పడి అయిదు ఎకరాల గడ్డి వాములు దగ్ధం అయ్యింది. మోపిదేవి మండలం, మెళ్ళమర్రు లో పిడుగు పాటుకు రెండు ఎకరాల వరి గడ్డి వాము దగ్ధమైంది.

ఇవీ చదవండి

Last Updated : Apr 23, 2023, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.