ETV Bharat / state

FLOODS: రాష్ట్రంలో వర్షాలు.. జగదిగ్బంధంలో లంక గ్రామాలు

author img

By

Published : Jul 13, 2022, 12:26 PM IST

Updated : Jul 13, 2022, 4:14 PM IST

FLOODS
జగదిగ్బంధంలో లంక గ్రామాలు

FLOODS: రాష్ట్రంలో వాన జోరు కొనసాగుతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద పరవళ్లు తొక్కుతోంది. దాంతో చాలా మంది లంక ప్రజలకు బాహ్య ప్రపంచం తోటి సంబంధాలు కొనసాగడంలేదు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

FLOODS: గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు.. నీటిలోనే నానుతున్నాయి. ఎగువ నుంచి వరద స్వల్పంగా తగ్గినప్పటికీ...లంక గ్రామాలు మాత్రం ఇంకా తేరుకోలేదు. సముద్రంలోకి భారీగా నీటిని విడిచిపెట్టిన నేపథ్యంలో.. కోనసీమలోని ఊడిమూడి లంక, జి. పెదపూడి లంక, అరికెల వారిపేట, బూరుగులంక, అయోధ్య లంక, పెద్దమల్ల లంక, అయినవిల్లి గ్రామాలు.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఆయా ఊళ్లలోని ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరికొంత మంది మోకాళ్ల లోతు నీటిలోనే నడుచుకుంటూ.. ఇంకొంతమంది పడవల్లో ప్రయాణిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు.

రాష్ట్రంలో వర్షాలు.. జగదిగ్బంధంలో లంక గ్రామాలు

అల్లూరి సీతారామరాజు: కొద్దిరోజులగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా... అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో కొండవాగులు, జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో భూపతిపాలెం జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో.. 2గేట్లను అధికారులు ఎత్తారు. 204 మీటర్ల సామర్థ్యం కలిగిన ఈ జలాశయం నుంచి దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి 15వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దానివలన దిగువన ఉన్న రంప, పందిరి మామిడి, ఐ.పోలవరం వద్ద వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో గిరిజనుల రాకపోకలు స్తంభించాయి.

*అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. చింతూరు డివిజన్లోని వి.ఆర్. పురం, కూనవరం, చింతూరు, యటపాక మండలాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులుగా ఆయన ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వృద్ధులు, గర్భిణిలను ముందుగా శిబిరాలకు తరలించి వైద్య సహాయం అందించామని కలెక్టర్ తెలిపారు. ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు.

బాపట్ల జిల్లా: వర్షాలకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. బెండ, దొండ, అరటి చెట్లు ఈదురుగాలులకు నేలకొరిగాయి. రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లంక గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగి రెండ్రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 3 నెలల కిందట వర్షంతో నష్టపోయిన తమను మళ్లీ ఊదురు గాలులు, వాన దెబ్బతీసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వెంటనే స్పందించి పంట నష్టాన్ని అందించాలని కోరుతున్నారు.

కోనసీమ జిల్లా: గోదావరి నదీపాయలకు వరద నీరు పోటెత్తడంతో.. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని సుమారు పది లంక గ్రామాలు.. వరద నీటి తాకిడికి గురయ్యాయి. ఐ. పోలవరం మండలానికి చెందిన గోగుల్లంక, భైరవలంక, కేసనకుర్రు, పొగాకు లంక, పల్లెగూడాల గ్రామాలు నీటిలో ఉన్నాయి. ముమ్మిడివరం మండలంలోని కూనలంక, గురజాపులంక, కమిని, సలాదివారి పాలెం గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గౌతమి, గోదావరి, వృద్ధ గౌతమి నది పాయలకు ఆనుకొని ఉన్న లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తున్నారు. ఇళ్ల మధ్య నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో.. మంచినీరు పట్టుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. లంక భూములు నీట మునిగిపోవడంతో పశువులను అతి కష్టంగా.. ప్రమాదకరమైన పరిస్థితిలో మర పడవల్లో గట్టుకు చేరుస్తున్నారు.. కొబ్బరి తోటలోకి నీరు చేరడంతో.. పాడి పశువులకు రహదారిపైనే ఆవాసాలు ఏర్పాటు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి పొంగిపొర్లుతుంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇల్లు జలమాయం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా ఇంఛార్జ్ పోత్తూరు రామరాజు పర్యటించి.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వలన తమ ఇల్లులోకి నీళ్లు చేరాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పోత్తూరు రామరాజు కోరారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 13, 2022, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.