ETV Bharat / state

Munugode bypoll: మనీగోడుగా మారుతున్న మునుగోడు.. కోటికి లక్ష కమిషన్​

author img

By

Published : Oct 25, 2022, 10:06 AM IST

Money distributed Munugode bypoll
మునుగోడులో గెలుపు కోసం ఆరాటం

Money distributed Munugode bypoll: తెలంగాణ మునుగోడులో గెలుపు కోసం ఆరాటపడుతున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నపార్టీలు ఓటర్లకు పోటీపడి తాయిలాలూ ప్రకటిస్తున్నాయి. నియోజకవర్గంలోకి మద్యం, డబ్బు ప్రవేశించకుండా పోలీసులు కట్టడి చేసేందుకు వేస్తున్నఎత్తులకు రాజకీయ పార్టీలు పైఎత్తులు వేస్తున్నాయి. డబ్బును సురక్షితంగా మునుగోడుకు తరలించేందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కోటికి లక్ష కమిషన్‌ ఇస్తున్నాయి.

మునుగోడులో గెలుపు కోసం ఆరాటం

Money distributed Munugode bypoll: తెలంగాణలో హుజూరాబాద్‌ తరువాత మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైనదిగా పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాలకు కంచుకోటైన నియోజకవర్గంలో సిటింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ, 2014లో విజయం సాధించిన తెరాస తిరిగి అక్కడ పాగా వేయాలని చూస్తోంది. ఆ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాతినిథ్యం లేని భాజపా కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసొచ్చిన రాజగోపాల్‌ రెడ్డి ద్వారా అక్కడ పాగా వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఏదొక విధంగా ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో మూడు పార్టీలు కూడా పోటీపడి డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తుండడంతోపాటు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. డబ్బు, మద్యం కట్టడి చేసేందుకు పోలీసు, ఎక్సైజ్‌, రెవెన్యూ శాఖలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి. దాదాపు 40 వరకు తనిఖీ కేంద్రాలు, మొబైల్‌ పార్టీలు ఏర్పాటు చేసి వాహన సోదాలు ముమ్మరం చేశారు.

నల్గొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మునుగోడు ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌తోపాటు పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. గట్టి నిఘా పెట్టిన అధికారులు మునుగోడుకు హవాలా ద్వారా డబ్బు తరలించే అవకాశం ఉందని భావించి ఆ దిశలో చర్యలు తీసుకున్నాయి.

మరొకవైపు ప్రధాన పార్టీలకు చెంది డబ్బులు నియోజకవర్గానికి పంపేందుకు సిద్ధం చేసుకున్న సందర్భంలోనే పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకుంటున్నారు. నియోజకవర్గానికి అన్ని వైపులా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర బలగాలను సైతం భాగస్వామ్యం చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరొకవైపు డబ్బు, మద్యం అక్రమంగా తరలించేందుకు ప్రత్యేక యంత్రాంగాలను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి.

కోటికి లక్ష రూపాయిలు మొత్తాన్ని సురక్షితంగా చేర్చినట్లయితే అందుకు కమిషన్‌ కింద లక్ష రూపాయిలు ఇచ్చేందుకు పార్టీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ రాజకీయ పార్టీ హైదరాబాద్‌ నుంచి మర్రిగూడ మండలానికి ఆరు కోట్లు నగదు చేర్చేందుకు ఇదే తరహా ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ బృందం రెండు విడతల్లో మూడేసి కోట్లు లెక్కన ఒకసారి బియ్యం బస్తాలల్లో, మరొకసారి యూరియా బస్తాలల్లో మర్రిగూడకు చేర్చింది. ఇందుకు ఆరు లక్షలు రూపాయిలు కమిషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాహనాలు తనిఖీలు చేసినా దొరకని రీతిలో బియ్యం బస్తా మధ్యలో నోట్ల కట్టలు పెడుతున్నారు.

రెండు మూడు బస్తాలల్లో నోట్ల కట్టలు పెట్టి పది నుంచి 20 బస్తాలు ఒకేసారి తరలిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా బియ్యం బస్తాలుగా భావించి వదిలేస్తున్నారు. అదేవిధంగా యూరియా బస్తా మధ్య నోట్ల కట్టలు పెడుతున్నారు. కనీసం పది బస్తాలు యూరియా రవాణా అయ్యేట్లు వాహనం ఏర్పాటు చేసుకుంటున్నారు.

దీంతో పోలీసులు తనిఖీలు చేసిన గుర్తించేందుకు అవకాశం లేని రీతిలో పైఎత్తులు వేసి నగదు రవాణా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మునుగోడు ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పది కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించారు. అయిదు కంపెనీల కేంద్ర బలగాలను ఇప్పటికే నియోజకవర్గానికి పంపగా, మరో 5 కంపెనీలు ఈ నెల 30వ తేదీన రానున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.