ETV Bharat / state

రాత్రి గోడ దూకి పోలీసులు ఇంట్లోకి వచ్చారు: మంత్రి గన్​మెన్ బాధితురాలు ఆరుద్ర

author img

By

Published : Feb 4, 2023, 11:52 AM IST

ARUDRA : కూతురు వైద్యం కోసం ఆవేదన చెందుతున్న కాకినాడకు చెందిన ఆరుద్రను పోలీసులు మరోసారి భయాందోళనలకు గురిచేశారు. గురువారం రాత్రి పోలీసులు గోడ దూకి వచ్చారని ఆమె ఆరోపించారు.

ARUDRA
ARUDRA

ARUDRA : ఆరుద్ర.. కూతురు ఆరోగ్యం కోసం అవస్థలు పడుతున్న తల్లి. కన్నబిడ్డకు వైద్యం చేయించాలంటే ఇళ్లు అమ్ముకోవాల్సిన దుస్థితి. బిడ్డ ఆరోగ్యం కోసం ఇళ్లు అమ్ముకోడానికి సిద్ధపడింది. అయితే ఇల్లు అమ్ముకోనీయకుండా ఇద్దురు మంత్రి దాడిశెట్టి రాజా వ్యక్తిగత కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారంటూ సీఎం జగన్​కు చెప్పుకోడానికి కాకినాడ నుంచి వచ్చింది. అయితే అధికారులు మాత్రం సీఎంను కలవడానికి అనుమతి నిరాకరించారు. దాంతో మనస్థాపం చెందిన ఆమె..​ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆరుద్ర ఘటనపై స్పందించిన సీఎం.. ఈ ఘటనకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలు కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కేసుకు సంబంధించి అన్ని వివరాలు చెప్పినా.. మళ్లీ చెప్పాలంటూ వేధిస్తున్నారని ఇటీవల మరోమారు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. మళ్లీ పోలీసులు నిరాకరించడంతో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.

అయితే కుమార్తె ఆరోగ్యం గురించి దిగులు చెందుతున్న సమయంలో ఆరుద్రను మరోసారి పోలీసులు భయాందోళనలకు గురిచేశారు. కాకినాడ జిల్లా రమణయ్యపేటలో నివాసం ఉంటున్న ఆరుద్ర ఇంటికి.. గురువారం రాత్రి పోలీసులు గోడ దూకి వచ్చారని ఆమె ఆరోపించారు.

తమ ఇంటిని అమ్ముకోకుండా కానిస్టేబుళ్లు మెరపల కన్నయ్య, మెరపల శివలు అడ్డుపడుతున్నారని గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి పలుసార్లు తన నుంచి వివరాలు సేకరించినా.. మళ్లీ చెప్పాలంటూ పోలీసులు గోడ దూకి వచ్చారని ఆరుద్ర వాపోయారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.