ETV Bharat / state

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 7:27 AM IST

Updated : Dec 26, 2023, 9:10 AM IST

ycp-leaders_land_grabbing_in_andhra
ycp-leaders_land_grabbing_in_andhra

YCP Leaders Land Grabbing in Andhra: ఆంధ్రా ప్రజలారా జర భద్రం. మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ఖాళీ స్థలాలున్నాయా. అయితే వాటిపై ఓ కన్నేసి ఉంచండి. ఏ, అవెక్కడికి పోతాయి. మా దగ్గర సంబంధిత ధృవపత్రాలున్నాయి కదా అనుకుంటున్నారా? ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, దేవదాయశాఖ, మఠలకు సంబంధించిన భూములు ఇలా ఏవైనా సరే వైఎస్సార్​సీపీ నేతలకు సంబంధం లేదు. వారి కన్ను ఆ భూములపై పడిందంటే చాలు అంతే సంగతి.

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

YSRCP Leaders Land Grabbing in Andhra: మీకు ఖాళీ స్థలాలున్నాయా? ఎక్కడికెళ్తాయిలే అని వదిలేయకండి. ఎందుకంటే రాష్ట్రంలో ఊరికో భూ బకాసురుడు తయారయ్యాడు. చిన్నపిల్లలు చాక్లెట్లు చప్పరించేసినట్లు ఖాళీ జాగాల్ని మింగేస్తున్నారు. అది వారసత్వ భూమైనా. ప్రభుత్వానిదైనా, చివరకు దేవుడి భూమైనా సరే కన్నుపడితే కలిపేసుకుంటున్నారు.

బాధితులు 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తుంటే, చెప్పుకోండి చూద్దాం అంటూ కబ్జాకోరులు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డుల్నే పీకేసి నచ్చిన భూమిని చెరబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారం అండతో వైఎస్సార్​సీపీ నాయకులు బరితెగిస్తుంటే, రెవెన్యూ యంత్రాగం ఏమీ చేయలేక చేతులు కట్టేసుకుంది.

చుట్టూ ప్రహరి, లేఔట్​ మధ్యలో రోడ్ల నిర్మాణంతో ప్రొద్దుటూరులో చక్కగా లేఔట్‌ ఏర్పాటు చేశారు. దీన్ని అధికార పార్టీ నేతలు అక్రమాల పునాదులపై వేశారు. గతంలో ఇక్కడ కేసీ కెనాల్‌కు చెందిన లష్కర్‌ భవనం ఉండేది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చేయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇలా కూల్చేసిన భవనం వెనుకే వెంచర్‌ వేశారు. జగన్‌ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు - మైదుకూరు రహదారి వెంట ఉన్న బొజ్జవారిపల్లె వద్ద సాగించిన కబ్జా పర్వానికి సాక్ష్యమిది.

'మేం మంత్రి అనుచరులం - ఈ భూమి మాది ఎవరైనా అడ్డొస్తే లేపేస్తాం'

ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఓ లాడ్జి వెనుక వైపున వైఎస్సార్​సీపీ నేత వాణిజ్య సముదాయాన్ని నిర్మించుకున్నారు. దీన్ని ఏకంగా కొత్తపల్లె కాలువకు చెందిన ఉప కాలువపై నిర్మిస్తున్నారంటే ఎంత దర్జాగా కబ్జా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరకు అధికారపార్టీకే చెందిన వార్డు సభ్యుడొకరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

ఇక రాజంపేట మండలం తాళ్లపాక రెవిన్యూ పరిధిలోని ఎర్రబల్లి సమీపంలో మూడున్నర ఎకరాల పొలాన్ని వైఎస్సార్​సీపీ నేతలు అక్రమించుకున్నారు. ఆక్రమించుకోవడమేకాదు ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేయించేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ దాదాపు 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

కడప వినాయకనగర్‌ సమీపంలో మినిస్టర్ కాలనీ పేరిట ఓ వెంచర్ వెలిసింది. ఈ లేఔట్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులదేనని విక్రేతలు అంటున్నారు. ఆయన పేరుతోనే కొనుగోలుదారులకు ఎరవేస్తున్నారు. అసలు ఈ వెంచర్‌కు అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

ఏకంగా యూనివర్శిటీ భూములకే ఎసలు పెట్టారు - ఎస్కేయూలో 150 ఎకరాల కబ్జాకు వైసీపీ నేతల పన్నాగం

2020 జనవరి 1 నుంచి 2023 మే 1వరకు కూడ కడప నగర పాలక సంస్థ పరిధిలో ఊటుకూరు వద్ద సాయిమిత్ర డెవలపర్స్‌కు మాత్రమే లే అవుట్‌కు అనుమతి ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాచారం ఇచ్చారు. ఆ లెక్కన అంజాద్‌ బాషా కుటుంబ సభ్యులది చెబుతున్న లేఔట్‌కూ అనుమతి లేనట్టే అనేకదా. ఇదొక్కటే కాదు కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 400వరకూ అక్రమ లేఔట్లు ఉండొచ్చని అంచనా. అందులో సింహభాగం వైఎస్సార్​సీపీ నాయకులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వేసిన వెంచర్లే. అందుకే అనుమతుల ప్రస్తావన ఉండదు.

సీఎం సొంతజిల్లానే కాదు ఇతర జిల్లాల్లోనూ వైఎస్సార్​సీపీ నాయకుల కబ్జాలకు అంతేలేదు. కర్నూలు నడిబొడ్డులోని ఏ క్యాంప్, బీ క్యాంప్, సీ క్యాంప్ ప్రాంతాల్లోని వసతి గృహాలను మరమ్మతుల కోసం అధికారులు వీటిని ఖాళీచేయించారు. ఆ సమయంలో అందులోకి ఆక్రమణదారులు దూరారు. ఏకంగా 446 వసతిగృహాల్ని అనధికారిక వ్యక్తులు అక్రమించారని ఆర్‌అండ్ బీ అధికారులే స్వయంగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. కబ్జాకోరులకు రాజకీయ నాయకుల అండదండలుండడం వల్లే అధికారులు మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో సుమారు 121 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవలి కాలంలో వైఎస్సార్​సీపీ నాయకులు మరింతగా ఆక్రమిస్తున్నారు.

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా - వివాదాలుంటే సెటిల్మెంట్ ! మాట వినికపోతే బదిలీలు, కేసులు - తండ్రి అడుగు జాడల్లో కుమారుడి అక్రమాలు!

స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమదాలవలస - శ్రీకాకుళం మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకుని దాదాపు 199 ఎకరాల బావాజీ మఠం భూములు ఉన్నాయి. ఇందులో తమ్మినేని అనుచరులు దాదాపు పదెకరాలు తప్పుడు దస్త్రాల సృష్టించి దురాక్రమణకు పాల్పడ్డారన్నది ఆరోపణ. తాజాగా శ్రీకాకుళం జగన్నాథస్వామి ఆలయానికి ఉన్న 4ఎకరాల భూమినీ ఆక్రమించేశారు. ఇక్కడ ఎకరా భూమి విలువ పది కోట్ల పైనే పలుకుతోంది. మఠం భూములు కాపాడుకునేందుకు మఠం ప్రతినిధులు పోరాడుతునే ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నమురపాకలోని డాబాల చెరువు భూములు సైతం ఆక్రమణకు గురయ్యాయి. ఈ అక్రమణకు గురైన భూముల్లో ఏకంగా వరి, పత్తి, కొబ్బరి, నీలగిరి, సరుగుడు వంటి పంటలను సాగు చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాలపైనే చెరువు గర్భాన్ని ఆక్రమించారు. కబ్జాల పర్వంలో వైఎస్సార్​సీపీ నేతల బరితెగింపునకు ఈ చెరువు భూములు పరాకాష్ట.

కన్నుపడితే ఖతమే! - అధికార పార్టీ అండతో కలెక్టరేట్​లో భూ దస్త్రాలు తారుమారు

అనకాపల్లి జిల్లాలోనైతే అధికారం మాది అడిగేదెవరో చూద్దాం అన్నవిధంగా వైఎస్సార్​సీపీ నేతలు, వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. కశింకోట మండలం బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను లేఅవుట్‌ కోసం చదును చేశారు. దీనికోసం అర్లికొండను కొంత తొలిచేశారు.

అర్లికొండ పక్కనే దళితులకు గతంలో ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని ఆక్రమించేశారు. ఈ వ్యవహారమంతా మంత్రి అమర్నాథ్‌ ప్రధాన అనుచరుడు ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక్కడ పదెకరాలు ఆక్రమణకు గురైనట్లు తేల్చగా అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. ఆ మరుసటిరోజే బోర్డు అక్కణ్నుంచి మాయమైంది. ఈ భూదందాపై లోకాయుక్తకూ ఫిర్యాదు కూడా అందింది.

ఒంగోలులో రోజురోజుకూ పెరిగిపోతున్న భూ దందాలు- దొంగ వీలునామాలు, నకిలీ రిజిస్ట్రేషన్లతో కబ్జాలు

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరైన తారువ చుట్టుపక్కలే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక్కడ కొండను ఆనుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి సుమారు 60 ఎకరాల్లో లేఅవుట్‌ వేసేందుకు చదును చేశారు. ఆ భూముల్లో మారేపల్లి రెవెన్యూ పరిధిలోని 23.15 ఎకరాల దేవాదాయభూములు కూడా ఉన్నాయి. వాటిని నిషిద్ధజాబితాలో పెట్టేందుకు దేవాదాయశాఖఅధికారులు చర్యలు ప్రారంభించినా తాత్సారం జరుగుతోంది.

ఆ స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ ముఖ్యనేత ఆశీస్సులుండడమే కారణమనే ఆరోపణలున్నాయి. రావికమతం మండల కేంద్రంలో మండల పరిషత్‌కు చెందిన కోటి రూపాయలవిలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకుడొకరు ఆక్రమించారు. న్యాయస్థానంలో మండల పరిషత్తుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆక్రమణ దారుల నుంచి స్థలాన్ని స్వాదీనం చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమిత స్థలంలోనే సదరు నాయకుడు దర్జాగా షెడ్లు వేసుకున్నాడు.

YCP Leaders Land Grabs: పార్టీ కోసం పదవిని త్యాగం చేస్తే భూకబ్జాలకు పాల్పడుతున్నారు.. ఎమ్మెల్యే ఎదుట వైసీపీ నేత ఆవేదన

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమార్కులు కబ్జా చేశారు. గుర్ల మండలం పోలాయివలస రెవెన్యూ పరిధిలోని చిల్లంగిమెట్టలోని 97 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 12 ఎకరాలకు కొందరు అక్రమంగా కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు పొందారు.

చిల్లంగిమెట్టలోని ఎకరా 10 లక్షలు పలుకుతోంది. నెల్లిమర్లలోని రామతీర్థం దేవస్థానానికి చెందిన ఆలయ భూముల్లోనూ అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్వతీపురం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధిలోని చెరువులను చదునుచేసి, ప్లాట్లు వేసి గజం 8వేల నుంచి 12వేల మధ్య విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఇలా వైసీపీ నేతలు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ జాగాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. తప్పుడు పత్రాలతో చెరబడుతున్నారు.

YSRCP Leader Anarchists in Tirupati District: కన్నుపడిందంటే అంతే.. ఆయన ముందు రాహుకేతువులైనా దిగదుడుపే..

Last Updated :Dec 26, 2023, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.