ETV Bharat / state

దుష్ప్రచారాలన్నీ.. ఒక్క తీర్పుతో చెల్లు

author img

By

Published : Mar 5, 2022, 5:13 AM IST

అమరావతి కాదు భ్రమరావతి అంటూ ఎన్నో ఆరోపణలు. రాజధాని నిర్మాణానికి పనికిరాని ప్రదేశమంటూ... ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ మరెన్నో అభాండాలు. అధికారంలోకి వచ్చిన తరువాత వైకాపా ప్రభుత్వం మూడేళ్లుగా చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతేనని హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో... అవన్నీ పటాపంచలయ్యాయి.

Amaravati News
Amaravati News

రాజధాని అమరావతి కేవలం ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమేనని వైకాపా ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. అమరావతిలో అత్యధిక గ్రామాలున్న తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఈ ప్రాంతంలోని సామాజిక వర్గ ప్రజల వివరాలు, ప్రభుత్వానికి భూములిచ్చిన సన్న, చిన్నకారు రైతుల సమాచారం... ఐకాస నాయకులు పలు సందర్భాల్లో గణాంకాలతో సహా వివరించారు. కానీ గత ప్రభుత్వం కేవలం ఒక సామాజికవర్గం ప్రయోజనం కోసమే అక్కడ రాజధాని ఏర్పాటు చేసిందని మంత్రులు, వైకాపా నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లలో ఆ ప్రస్తావన లేదు. వారి ఆరోపణే నిజమైతే కోర్టులో ఎందుకు ప్రస్తావించలేదు? అని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే అమరావతిని శ్మశానమన్నారు. అక్కడి నేల భారీ నిర్మాణాలకు పనికిరాదని... ఇతర ప్రాంతాలతో పోలిస్తే నిర్మాణవ్యయం భారీగా ఉంటుందని ఆరోపించారు. కృష్ణా నదికి వరదలొస్తే రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేశారు. కానీ కోర్టులో ఆ ప్రస్తావన తేలేదని హైకోర్టు తెలిపింది.

అమరావతిని భ్రమరావతన్న మంత్రులు..

అమరావతిని భ్రమరావతి అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. అమరావతిలో పనులేమీ జరగలేదని, గత ప్రభుత్వం చూపించినవన్నీ గ్రాఫిక్సేనన్న మాటలకు.... రాజధానిలో రూ. 15 వేల కోట్ల విలువైన పనులు జరిగాయని, ఇప్పుడు రాజధానిని మార్చేస్తే అన్ని వేల కోట్ల ప్రజాధనానికి జవాబుదారీ ఎవరని హైకోర్టు ప్రశ్నతో వారిది అసత్యప్రచారమేనని తేలిపోయింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని... ప్రభుత్వంలోని వ్యక్తులు, వారి సన్నిహితులు పెద్ద ఎత్తున భూములు కొని లబ్ధి పొందారని ప్రచారం జరిగింది. అసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్నదే అక్కడ వర్తించదని హైకోర్టు ఇది వరకే స్పష్టం చేసింది. రాజధానిగా అమరావతి అనేది గత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమన్న కొందరి నాయకుల ప్రచారాన్ని కోర్టు తన తీర్పులో ప్రస్తావించి... అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ సహా ఇతర నేతలు అమరావతికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని... అందరి ఏకాభిప్రాయంతో జరిగిందని కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.

రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మార్చవచ్చు...

రాజధాని ఏర్పాటుపై గత ప్రభుత్వం శివరామకృష్ణన్‌ కమిటీ️ నివేదికకు విరుద్ధంగా వ్యవహరించిందన్న వాదనతో హైకోర్టు ఏకీ️భవించలేదు. గత ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం చేసినప్పుడే, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు మెగాసిటీ️లు, 14 స్మార్ట్‌ సిటీ️ల అభివృద్ధికి తీర్మానం చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు రికార్డు చేసింది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని మార్చే అధికారం తర్వాత ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టంచేసింది. అంత భారీ వ్యయంతో రాజధానిలో మౌ️లిక వసతులు అభివృద్ధి చేయలేమన్న ప్రభుత్వ వాదననూ తోసిపుచ్చింది.

హైకోర్టు తీర్పులో అదే ఉంది...
ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారతాయని, రాష్ట్రం శాశ్వతమని... రాష్ట్రం చేసుకున్న ఒప్పందాలు, ఇచ్చిన హామీలు శాశ్వతమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారవని న్యాయస్థానం అభిప్రాయపడినట్లు న్యాయవాదులు తెలిపారు. అమరావతి రైతులు తమ జీవించే అధికారాన్ని రాష్ట్రానికి ధారాదత్తం చేశారన్నారు. వారితో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్రం ఉల్లంఘిస్తే వారి జీవించే హక్కు, ఆస్తి హక్కు, మానవ హక్కుల హననం జరిగినట్టేనని తెలిపారు. హైకోర్టు తీర్పులో అదే చెప్పిందన్నారు. రాజధాని రైతుల్ని నివాసానికి అత్యంత యోగ్యమైన, సుస్థిరమైన రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేస్తామని చెప్పి ప్రభుత్వం వారితో ఒప్పందం చేసుకుందన్నారు. ప్రభుత్వం, అది చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థలు, అధికారులు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని హైకోర్టు తెలిపిందన్నారు.


ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుతో.. రాజధాని నిర్మాణంపై చిగురించిన ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.