ETV Bharat / state

ఇవేం రోడ్లు.. గోతులమయమై ప్రయాణికులకు నరకం

author img

By

Published : Nov 11, 2022, 7:15 PM IST

special story on the condition of roads: మద్యం సేవించడం, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. రాష్ట్రంలో కొత్తగా.. మరో స్లోగన్‌ సైరన్‌లా మోగుతోంది. అదే ' ఏపీ రోడ్లపై ప్రయాణించడం ప్రమాదకరం'.. ఎక్కడైనా రోడ్లపై గుంతలుంటాయి.. కానీ గుంతల మధ్య రోడ్లు ఉంటే.. వినడానికే వింతగా ఉందా.. ఇనుప గుళ్లలా తేలిన కంకర.. లెక్కలేనన్ని గోతులు..రోడ్డు మార్జిన్ల కోతలు.. వర్షం పడగానే చెరువుల్లా మారే దారులు. ఇలా ఒకట్రెండు కాదు రాష్ట్రంలో దాదాపు 15 వేల కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ  రహదారులు.. గోతులమయమై ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి.

రహదారి
condition of roads

రాష్ట్రంలో దాదాపు 15వేల కి.మీ. మేర పాడైన ఆర్‌ అండ్‌ బీ రోడ్లు

ETV Bharat special story: లెక్కలేనన్ని గోతులు..రోడ్డు మార్జిన్ల కోతలు.. వర్షం పడగానే చెరువుల్లా మారే దారులు. ఇలా ఒకట్రెండు కాదు రాష్ట్రంలో దాదాపు 15 వేల కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు.. గోతులమయమై ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. విన్నారుగా ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ గారి ఆక్రోశం.. ప్రతిపక్షాలపై ప్రాసల పంచ్‌లు విసిరే ధర్మశ్రీ రోడ్లకు ప్యాచ్‌వర్కులైనా చేయించండి అంటూ అధికారుల్ని.. ప్రాధేయపడాల్సిన పరిస్థితి. ఓవైపు ముఖ్యమంత్రిగారేమో..రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వచ్చిన ఢోకా ఏమీ లేదంటారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం రోడ్డు గుంతలైనా పూడ్చండి అంటూ బతిమలాడుకుంటున్నారు.

పైకి తేలిన కంకర.. కమ్మేసిన దుమ్ము,ధూళి.. ఐనా ఆగని వాహనాలు.. ఇదేదో కొత్తరోడ్డు వేస్తున్నారు కదా అప్పటిదాకా వాహనదారులు ఆగొచ్చుకదా అనుకునేరు.. అలా అనుకుంటే మీరూ.. ఈ గోతిలో పడినట్లే.. ఇక్కడేమీ రోడ్డువేయడంలేదు. ఎప్పుడో వేసిన రోడ్డే ఇలా అయిపోయింది. ఇది శ్రీకాకుళం జిల్లా అలికాం-బత్తిలి రోడ్‌. శ్రీకాకుళం నుంచి.. ఒడిశా వెళ్లేందుకు ఇది దగ్గరిదారి. అలాగని రోడ్డెక్కారో.. లెంపలు వేసుకుని పశ్చాత్తాపపడాల్సిందే.

ఇక పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ నుంచి విజయనగరం జిల్లా.. బొబ్బిలి రోడ్డుకె ళ్దాం. దాదాపు 50 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు 15కిలోమీటర్ల మేర.. గోతులు తేలింది. దిబ్బగుడివలస సచివాలయం ఎదుట తారు పూర్తిగా లేచిపోయి..మురికికూపంలా మారింది. అనకాపల్లి జిల్లా కశింకోట-బంగారుమెట్ట రోడ్డంటేనే వాహనదారులకు హడల్‌. 24 కిలోమీటర్ల ఈ మార్గంలో మొదటి 15 కిలోమీటర్లు అసలు తారే కనిపించడం లేదు. మట్టి రోడ్డే నయం...అనిపించేంత అధ్వానంగా ఉంది. దీని విస్తరణకు ఏడాదిగా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. రోడ్డుకు అనకాపల్లిపైపు..మంత్రి అమర్నాథ్‌, బంగారుమెట్ట వైపు కరణం ధర్మశ్రీ అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. ఒకే రోడ్డుకు ఇద్దరు టెంకాయ కొట్టడంతో ఇక గట్టెక్కినట్లేనని స్థానికులు సంబరపడ్డారు. శిలాఫలకాలైతే కలర్‌ఫుల్‌గా ఉన్నాయిగానీ... వారి గోతుల కష్టాలు తీరడంలేదు.

'ఇది ఏలూరు జిల్లా భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రహదారి. రెండేళ్లుగా....మరమ్మతులే లేవు. ముప్పవరం వద్ద వద్ద ఇలా కొలనులా మారింది. ఈగోతుల్లో బైకులు జారిపడుతున్నాయి. మంచిగా ఇల్లు చేరేవారికన్నా.. మంచం పట్టేవారే ఎక్కువగా ఉన్నారు'.- వాహన దారుడు

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం మంటాడ వద్ద వాహనదారుల కష్టాలు. ఎంత అనుభవమున్న డ్రైవరైనా.. ఇక్కడ వాహనాన్ని వంకలు తిప్పాల్సిందే. లోడు లారీలైతే...కుయ్యోమొర్రో అని మొండికేస్తున్నాయి.

అమరావతి రాజధాని పరిధిలోని మరో నగరం గుంటూరు. ఇక్కడ పలకలూరు రోడ్డు చూస్తే.. ఇది నగరమా? నరకమా? అని ప్రశ్నించుకోవాల్సిందే. గుంటూరు నుంచి.. పేరేచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలకు రాకపోకలు ఇటుగానే సాగిస్తున్నా.. రెండేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు.

ప్రకాశం జిల్లా టంగుటూరు-కొండపి రోడ్డు వంద మీటర్ల దూరానికే.. 50గుంతలకుపైనే ఉన్నాయంటే.. ఇక వాహనాలకు, వాహనదారుల పార్ట్‌లకు గ్యారెంటీ ఉంటుందా?. ఇక నెల్లూరు జిల్లా కావలి -తుమ్మల పెంట రోడ్డు నరకానికి.. నకలుగా మారింది. రోడ్డుపై అసలు తారేలేదు. వర్షాలకు మొత్తం మడగులమయమై ఎర్రబారింది.

ఇక రాయలసీమరోడ్లు చూద్దాం.. ఒకప్పుడు ఇదీ రోడ్డే.. కాకపోతే నిర్వహణలేక నీటికుంటైంది. డోన్ నుంచి దాదాపు 10 గ్రామాలకు ఇదే మార్గం. రోజూ ఈ మడుగులో స్నానం చేసే వాహనాలకు లెక్కేలేదు. సత్యసాయి జిల్లా సీకే పల్లి మండలంలోని ప్యాదండి- ధర్మవరం రోడ్డు.. దాదాపు 3కిలోమీటర్ల దారుణంగా తయారైంది. పెనుకొండ, హిందూపురం, బెంగుళూరు, రాప్తాడు వెళ్లడానికి ఇదే దారి. గోతుల వల్ల వాహనాలు షెడ్లకు వెళ్లాల్సి వస్తోందంటూ, ట్రాక్టర్‌ డ్రైవర్లే మట్టితో గోతులు పూడ్చుకున్న పరిస్థితి.

రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 46వేల 225 కిలోమీటర్ల రోడ్లున్నాయి. చాలా కాలంగా మరమ్మతులు, నిర్వహణ లేక లేక గతంలోనే కొన్ని దెబ్బతిన్నాయి. అవి కాకుండా, ఈసారి వర్షాలకే 15 వేల కిలోమీటర్ల మేర అద్వానంగా తయరైనట్లు.. ఇంజినీర్లు లెక్కవేశారు. దెబ్బతిన్నరోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తే వాహనాదారులకు కొంతలో కొంతైనా ఉపశమనం కలుగుతుంది. కానీ.. ఏ జిల్లాలోనూ గుత్తేదారులు కనీసం గుంతలు పూడ్చేందుకు ముందుకురావడంలేదు. గతేడాది వర్షాలకు ఏర్పడిన గుంతలు పూడ్చిన డబ్బే ఇంకా చెల్లించలేదు. 90 కోట్ల రూపాయల వరకూ గుత్తేదారులకు ప్రభుత్వం బకాయి పెట్టింది. అందుకే మళ్లీ గుంతలు పూడ్చాలంటే.. గుత్తేదారులు మొహం చాటేస్తున్నారు. అనేక జిల్లాల్లో ఇంజినీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు బతిమాలుతున్నా మావల్ల కాదు.. మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అంటూ మొహంమీదే చెప్పేస్తున్నారు.

గతేడాది రూ.2 వేల కోట్లు బ్యాంకు రుణం తీసుకొని..8వేల268 కి.మీ రహదారులను.. పునరుద్ధరణచేసినట్లు ప్రభుత్వం తెలిపింది. బ్యాంకు నుంచి నేరుగా చెల్లింపులు చేయడంతో 85 శాతం పనులు జరిగాయి. వర్షాల వల్ల మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈసారి వర్షాలకు మరో 7 వేల కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉందని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలనా అనుమతులు రాలేదు. దాదాపు రూ.1,700 కోట్ల వరకు అవసరమని.. అధికారులు అంచనా వేస్తుండగా.. ఆ నిధులను ప్రభుత్వం ఎలా సమకూరుస్తుందనేది అంతుచిక్కడంలేదు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో 12వందల 44 కి.మీ మేర రహదారులను.. 2వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం 18 నెలల కిందట ఒప్పందం చేసుకుంది. కానీ, ఇప్పటి వరకు 13.75 శాతమే పనులు జరిగాయి. ఎన్​బీడీ ఇచ్చిన నిధులను ప్రభుత్వం వాడేసుకుంది. గుత్తేదారులకు కొంతే చెల్లించింది. ఫలితంగా కొత్త పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడంలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.