ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు.. 32కు చేరిన సంఖ్య

author img

By

Published : Jan 25, 2023, 9:56 AM IST

Two Judges Appointed to the AP High Court

Two Judges Appointed to the AP High Court: రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వారి నియామకంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరిద్దరితో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరనుంది.

Two Judges Appointed to the AP High Court: రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయాధికారులుగా పని చేస్తున్న పి.వెంకటజ్యోతిర్మయి, వి.గోపాలకృష్ణారావుకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం.. ఈనెల 10న చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా త్వరలో ప్రమాణం చేయిస్తారు.

ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం

రాష్ట్ర హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 30 మందే సేవలు అందిస్తున్నారు. జ్యోతిర్మయి, గోపాలకృష్ణారావు నియామకంతో మొత్తం హైకోర్టు జడ్జిల సంఖ్య 32కు చేరనుంది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన న్యాయాధికారి వెంకట జ్యోతిర్మయి డిగ్రీ వరకూ తెనాలిలోనే విద్యాభ్యాసం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్‌కు ఎంపికయ్యారు. ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీడీజేగా పని చేస్తున్నారు.

ఇక న్యాయాధికారి వి.గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లాచల్లపల్లికి చెందిన వారు. అవనిగడ్డ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన ఆయన 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 2016 నుంచి జిల్లా అదనపు జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయ సేవలు అందించారు. ప్రస్తుతం గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్నారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.