TOEFL Exams for Students From Third Class : మూడో తరగతి నుంచి విద్యార్థులను టోఫెల్ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నామంటూ.. అంతర్జాతీయ సర్టిఫికేషన్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని.. జూన్ 20న సీఎం జగన్ ఘనంగా ప్రకటించారు. ఆంగ్ల భాషలో పిల్లలు వినడం, మాట్లాడటం రెండింటిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే పరిస్థితి రావడం కోసం ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పరీక్ష జరుగుతుందన్నారు. కానీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా టోఫెల్ కంటెంట్ లేకుండా వారు ఎలా బోధిస్తారు? పూర్తి స్థాయిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్- ఐఎఫ్‌పీ (Interactive Flat Panel)లు ఏర్పాటు చేయకుండా విద్యార్థులు ఎలా సన్నద్ధమవుతారు..? ఇవేమీ పట్టించుకోకుండా సీఎం జగన్ టోఫెల్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు.
Students Suffers with No IFP in Schools : కొన్నిచోట్ల ఉపాధ్యాయులు తమ సొంత సెల్ ఫోన్‌లో ఆడియోలను వినిపిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఐఎఫ్‌పీలో ఆడియో సక్రమంగా రాకపోవడంతో ఆంగ్ల పదాల ఉచ్ఛారణ సక్రమంగా వినపడని దుస్థితి నెలకొంది. ప్రతిదాన్నీ రాజకీయంగా వాడుకోవాలని చూడటం తప్ప పిల్లలకు ఎంత వరకు ఉపయోగపడుతుందనే దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ టోఫెల్ బోధన మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్ల భాషను నేర్పించేస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప క్షేత్ర స్థాయిలో బోధన తీరు అధ్వానంగా ఉంది. టోఫెల్ ప్రవేశపెట్టామంటూ ప్రచారం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం అమలు తీరును పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులకు ఎలాంటి మెటీరియల్ ఇవ్వకుండా కంటెంట్ సక్రమంగా సిద్ధం చేయకుండా విద్యార్థులను సన్నద్ధం చేయాలని వారిపై ఒత్తిడి చేస్తోంది.
IB Syllabus in AP Schools: ప్రభుత్వ బడుల్లో మరో కొత్త సిలబస్.. ఇంటర్ వరకు ఐబీ అమలు దిశగా అడుగులు
రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల పాఠశాలలు ఉండగా.. మొదటి విడత 'నాడు-నేడు' పనులు చేసిన 15 వేల 715 బడుల్లోనే ఐఎఫ్‌పీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. వీటిలోనూ అన్ని తరగతుల్లో ఇప్పటికీ ఐఎఫ్‌పీల ఏర్పాటు పూర్తి కాలేదు. అవి ఉన్నచోట ఆడియోలను పంపిస్తున్నారు.
తరగతిలో 50 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే చివరి వారికి ఆడియో సరిగా వినిపించని దుస్థితి నెలకొంది. మాట్లాడటానికి సంబంధించి పంపిస్తున్న పేరా మొత్తం ఒకేసారి తెరపై కనిపించక పోవడంతో.. తిప్పలు తప్పడం లేదు. ఐఎఫ్‌పీ లేని చోట కొంతమంది ఉపాధ్యాయులు ఆడియోలను తమ ఫోన్‌ల ద్వారా వినిపిస్తున్నారు. ఇవి సక్రమంగా వినపడక పోవడంతో విద్యార్థులకు అర్థం కావడం లేదు.
Jobs to Btech Students In AP: అరకొర చదువుతో.. కొలువులు అంతంత మాత్రమే..!
టోఫెల్ పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వలేదు. కానీ వారానికి మూడు రోజులు టోఫెల్ తరగతులు నిర్వహించాలంటూ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. తరగతిలో 20 నిమిషాలు చదవడం, మరో 20 నిమిషాలు వినడం సాధన చేయాలని ఆదేశించింది. పలు పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు.
ఇలాంటి చోట విద్యార్థులకు సాధారణ పాఠాలు, 3,4,5 తరగతులకు టోఫెల్ చెప్పడం ఎలా సాధ్యం..? ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీ ఒక్కటే ఇచ్చారు. దీంతో అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి బోధించడం కుదురుతుందా? ప్రశ్నలు ఇచ్చి, వాటిని నోటు పుస్తకాల్లో రాయిస్తున్నారు. ఈ బట్టీ విధానంతో ఆంగ్ల భాష వస్తుందా? అనేదాన్ని పట్టించుకోవడం లేదు. ఐఎఫ్‌పీ లేని బడుల్లో కొన్నిచోట్ల టోఫెల్ బోధన సాగడం లేదు.
బోధన, అభ్యసనను పట్టించుకోకుండా పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లోనూ టోఫెల్ ప్రశ్నలు ఇచ్చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఫార్మెటివ్-1 పరీక్షలో టోఫెల్ ఇవ్వడంతో వాటిని రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.