Lands Market Value : ఇలా అయితే సామాన్యులు ఆస్తులు కొనేదెలా..

author img

By

Published : May 24, 2023, 11:29 AM IST

Lands Market Value

Lands Market Value : సామాన్య ప్రజలు ఆస్తులు కొనుగోలు చేసుకోవాలనే కలలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. భూముల మార్కెట్ విలువను ప్రస్తుతం ఉన్న దానికన్నా కొన్నిచోట్ల భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా పెంచిన భూముల విలువలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు

Government Try to See To Increase Land Value: భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 50గ్రామాలుంటే.. దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల మార్కెట్ విలువను పెంచబోతున్నారు. ఈ పెంపులో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న స్థలాల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ విలువలు ఎంత? రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం బేరీజు వేస్తూ కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేయబోతున్నారు. ఇవి జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

పట్టణాలు, నగరాల్లో వార్డుల వారీగా పెంచాలన్న విధంగా చర్చలు సాగుతున్నాయి. గ్రామాల విషయంలోనూ ఇదే విధానం అనుసరించాలని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ విలువలు పెరిగే కొద్దీ కొనుగోలుదారుడు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. ప్రభుత్వ ఖజానా నిండుతుంది. కొన్నిచోట్ల మాత్రమే 10శాతం నుంచి 20శాతం వరకు మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉంది. మిగిలినచోట్ల చాలా వరకు 30శాతం పైనే మార్కెట్ విలువలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2020 తర్వాత మార్కెట్ విలువలు పెంచనందున స్పెషల్ రివిజన్ పేరుతో మార్కెట్ విలువలు పెంచేసి, ఫీజుల రూపంలో ఆస్తుల కొనుగోలుదారుల నుంచి పిండేయాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఒకేరకంగా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెరిగేవి. కొన్నిచోట్ల డోర్ నెంబర్ల ఆధారంగా మార్కెట్ విలువలు ఉండేవి. ప్రతి ఏడాదీ ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి అర్బన్ ప్రాంతాల్లో మార్కెట్ విలువ సవరిస్తారు. ఆగస్ట్‌ ఒకటి నుంచే.. రెండేళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరిస్తారు. ప్రతి ఏడాదీ మార్కెట్ విలువ సవరించడం ఆనవాయితీ. 2020లో చివరిగా మార్కెట్ విలువ సవరించారు. కోవిడ్ కారణంగా 2021లో సవరించలేదు. సంప్రదాయంగా వస్తోన్న ఆనవాయితీని పక్కనబెట్టిన ప్రభుత్వం స్పెషల్ రివిజన్ పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు మార్కెట్ విలువలను పెంచుతూ వస్తోంది.

కొత్త జిల్లాల విభజన జరగకముందే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచింది. గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువలను జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా పెంచింది. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండును బట్టి మార్కెట్ విలువల్లో 13శాతం నుంచి 75శాతం వరకు పెంచారు. తాజాగా పెంచబోతున్న మార్కెట్ విలువల ప్రాంతాల్లో ఇవి ఉంటాయా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ప్రతి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని 20శాతం గ్రామాల్లో మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధార ప్రాంతంలో ప్రస్తుతం చదరపు గజం విలువ 62 వేలు. దీనిని 66 వేల రూపాయలకు పెంచాలన్నది ప్రతిపాదన. మధురవాడలోని పీఎం పాలెంలో కమర్షియల్ ప్రాంతంలో చదరపు గజం ధర 45 వేల వరకు ఉంది. దీనిని 50 వేల రూపాయలు చేసేలా ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల గేటెడ్ కమ్యూనిటీలు కొత్తగా వచ్చాయి. ఇక్కడ చదరపు గజం మార్కెట్ విలువ 50 వేల రూపాయల వరకు పెంచాలన్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం పరిసరాల్లో భూమి ధరలు 20 నుంచి 60శాతం పెరగబోతున్నాయి. ఏలూరులో ప్రస్తుతం ఆర్​ఆర్​పేట కమర్షియల్ ఏరియాలో గజం ధర 60 వేలు ఉండగా 65 వేల రూపాయలకు పెరగనుంది. ఏలూరు జిల్లాలోని.. నూజివీడులో ప్రస్తుతం ఉన్న గజం ధర 5,900 నుంచి 7 వేల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. అదే ఎకరం భూమి ధర 11లక్షల 90వేలు ఉండగా.. దీనిని 14 లక్షల రూపాయలకు పెంచేందుకు ప్రతిపాదించారు. కమిటీలు ఖరారు చేసిన మార్కెట్‌ విలువలను సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా గురువారం నుంచి ప్రకటిస్తారు. వీటిపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత మళ్లీ కమిటీ సమావేశమై పునః సమీక్షిస్తుంది. ఈ ప్రక్రియ ఈనెల 30తో ముగియాల్సి ఉంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.