ETV Bharat / state

సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌పై చర్యలకు డీజీపీకి ప్రభుత్వం ఆదేశం

author img

By

Published : Feb 26, 2023, 9:31 AM IST

Updated : Feb 26, 2023, 3:21 PM IST

సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌
సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌

former CID chief PV Sunilkumar: సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌పై చర్యలకు డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Actions against former CID chief PV Sunilkumar : సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. చర్యలు తీసుకుని నివేదిక పంపాల్సిందిగా డీజీపీకీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈనెల 23న ఆదేశాలు జారీ చేయగా ఉత్తర్వుల కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునేందుకు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్ చట్టాన్ని ఉపయోగిస్తూ.. ఎంపిక చేసుకున్న పౌరులను ఆరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ మేరకు అక్టోబర్​లో వివిధ స్థాయిల అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. అరెస్టులు, కస్టడీలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కారని, సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ ఏడీజీ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ, డీవోపీటీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆన్ పిటిషన్లు, ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్​లకు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.

సునీల్ కుమార్​పై టీడీపీ ఆరోపణలు..: లా అండ్ ఆర్డర్​ను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థే అడ్డదారులు తొక్కుతున్నారని, రక్షించాల్సిన వారే శిక్షిస్తున్నారని.. టీడీపీ నాయకులు అప్పట్లోనే సీఐడీ సునీల్​పై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సీటు కోసమే సీఎం జగన్​కు ఊడిగం చేస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. లా అండ్ ఆర్డర్​ను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థే అడ్డదారులు తొక్కుతోందని ఆగ్రహించారు. సీఐడీ శాఖని చీఫ్ మినిస్టర్ డిపార్ట్​మెంట్​గా మార్చేశారని మండిపడ్డారు. అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిని సంతృప్తి పరచడానికే సీఐడీ ఆరాటపడుతున్నారని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులను దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్​ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ సునీల్ మానసిక స్థితి సరిగా లేదని, టీడీపీ నాయకులే లక్ష్యంగా చేసుకుని అణచివేత ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా నోటీసులు లేకుండా కేసులు పెట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ..: సీఐడీ ఏడీజీగా ఉన్న సునీల్ కుమార్.. ఐపీఎస్‌ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు 2021లో హోం శాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగంలో చేరి.. ఆ తర్వాత క్రిస్టియన్‌గా మారిన పీవీ సునీల్‌ కుమార్‌ను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను కోరారు. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై స్పందించిన కేంద్ర హోం శాఖ.. అప్పట్లో చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులను జారీ చేసింది.

ఇవీ చదవండి :

Last Updated :Feb 26, 2023, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.