ETV Bharat / state

ముస్తాబవుతున్న కొత్త సచివాలయం..

author img

By

Published : Jan 25, 2023, 10:41 AM IST

Telangana New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం ముస్తాబవుతోంది. ప్రారంభోత్సవానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైన నేపథ్యంలో.. తుదిమెరుగులపై సర్కార్‌ దృష్టి సారించింది. ఈ మేరకు పాలనాసౌధం నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Telangana New Secretariat
Telangana New Secretariat

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న తెలంగాణ నూతన సచివాలయం

Telangana New Secretariat: కొత్త సచివాలయ భవనాన్ని వచ్చే నెల 17వ తేదీన అట్టహాసంగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించిన నేపథ్యంలో పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలు.. నలుదిక్కులా కలియతిరిగి అణువణువూ పరిశీలించారు.

ప్రధాన ద్వారం, ప్రహరీగోడ, రహదార్లను పరిశీలించిన సీఎం కేసీఆర్.. బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలు, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు. నూతన సచివాలయంలో సౌకర్యాలు, నిర్మాణ వివరాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతిలో నిర్మితమవుతున్న ప్రార్థనా మందిరాన్ని పరిశీలించిన సీఎం.. అంతర్గత రోడ్లు, ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని పరిశీలించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులు, వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని కూడా సందర్శించారు.

పలు సూచనలు చేసిన సీఎం కేసీఆర్: సచివాలయ భవనం మొదటి అంతస్తులో.. మెట్లకు ఇరువైపులా చేయాల్సిన పనులకు సంబంధించి సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఫాల్ సీలింగ్, ఉడ్ పానెలింగ్, ఏసీ ఫిట్టింగ్స్, తదితర తుది పనులను క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు చేశారు. సీఎస్ ఛాంబర్, సీఎంఓ కార్యదర్శులు, సిబ్బంది, ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను పరిశీలించారు.

సృజనాత్మకంగా, నాణ్యతతో పూర్తి చేయాలి: సీఎం ఛాంబర్‌లో కొన్ని మార్పులను సూచించారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులు, ఎలివేషన్ లో భాగంగా కళాకృతులు, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా.. ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ వ్యవస్థను కేసీఆర్ పరిశీలించారు.

ఇంటీరియర్ డిజైన్లు, విద్యుత్ పనులు, ఏసీల ఫిట్టింగ్, పిల్లర్లు, స్తంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్క్ పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి.. నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులు, ఉడ్ వర్క్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సీ పనులు, లిఫ్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

ప్రధాన ద్వారానికి ఎదురుగా రెండు వైపులా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లు, లాన్‌లు, గార్డెనింగ్ పనులను పరిశీలించిన సీఎం.. వీఆర్​వీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఏసీ ప్లాంట్లు, జనరేటర్లు, అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన.. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి.. ల్యాండ్ స్కేప్ పనులు, సీవరేజ్ వర్క్స్, రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్ పనులపై మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఇంజినీర్లకు సూచనలు చేశారు.

హాజరుకానున్న ఇద్దరు సీఎంలు: వచ్చే నెల 17న రాష్ట్ర నూతన పాలనాసౌధం ప్రారంభోత్సవం సందర్భంగా.. శాస్త్రోక్తంగా వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగసభ: సచివాలయ ప్రారంభం సందర్భంగా.. అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగసభలో అతిథులు పాల్గొననున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా భద్రత సహా ఇతర ఏర్పాట్ల విషయమై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయ ప్రాంగణంలో హైదరాబాద్ సీపీసీవీ ఆనంద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.

పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖ, విద్యుత్ ఐటీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంతోపాటు తదుపరి కార్యకలాపాలు సాగేందుకు వీలుగా.. తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లు సంబంధిత అంశాలపై చర్చించారు. అన్ని కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు వీలుగా సీనియర్ ఐపీఎస్ అధికారి విక్రమ్ సింగ్ మాన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.