ETV Bharat / state

బాహుబలి బడ్జెట్‌.. తెలంగాణలో రూ.3 లక్షల కోట్ల మార్కు దాటనున్న పద్దు!

author img

By

Published : Feb 6, 2023, 9:16 AM IST

Telangana Budget 2023
Telangana Budget 2023

Telangana Budget 2023: మరో భారీ బడ్జెట్‌కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. తొలిసారిగా రాష్ట్ర వార్షిక ప్రణాళిక మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబడులు విశ్లేషిస్తూ వచ్చే ఏడాది 15 శాతానికి పైగానే వృద్ధి ఉంటుందని అంచనా వేసిన సర్కారు... ఆ మేరకు ఆశావహ దృక్పథంతో బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేసినట్లు సమాచారం. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ పథకాలు, హామీల అమలుకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

Telangana Budget 2023: తెలంగాణ వార్షిక బడ్జెట్ మొదటిసారి మూడు లక్షల కోట్ల మార్కు దాటనుంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో మరోమారు భారీ బడ్జెట్ రానుంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తూ పద్దును ప్రతిపాదించనున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షలా 56 వేల కోట్లు కాగా వచ్చే ఏడాది వృద్ధిరేటు 15 నుంచి 17 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. దీంతో 2023- 24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటినట్లు తెలిసింది.

ఎన్నికలకు ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో సంక్షేమ రంగానికి సింహభాగం నిధులు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు నిధులు పెరిగాయి. సొంత రాబడిపైనే ఎక్కువగా ఆధారపడి పూర్తి విశ్వాసంతో ఆశావాహ బడ్జెట్‌ను రూపొందించారు.

సొంత రాబడులే కీలకం : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెల వరకు వచ్చిన రాబడులను విశ్లేషించిన ఆర్థిక శాఖ... రానున్న ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి లక్షన్నర కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేసినట్లు సమాచారం. పన్నేతర ఆదాయం రుణాలు, గ్రాంట్లు కలిపి మరో లక్షన్నర కోట్లుగా అంచనా వేసి మొత్తం మూడు లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు ఖరారు చేసినట్లు తెలిసింది.

సొంత పన్నులపై పూర్తి విశ్వాసంతో రాబడి అంచనాలను గణనీయంగా పెంచారు. అమ్మకం పన్ను ద్వారా 40 వేల కోట్లు, జీఎస్టీ ద్వారా 42 వేల కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని... గనుల ద్వారా 9వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. భూముల అమ్మకం ద్వారా వచ్చేయడానికి ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రాష్ట్రానికి 21వేల 470 కోట్లు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల నిధులు రానున్నాయి.

ఆ పథకాలకు భారీ నిధులు ఇచ్చే అవకాశం : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్లు భారీగా ఆశించినప్పటికీ చాలా తక్కువగానే వచ్చాయి. 41 వేల కోట్ల గ్రాంట్లు అంచనాకు గాను 8వేల కోట్ల లోపే వచ్చాయి. అయినప్పటికీ ఈ మారు కూడా గ్రాంట్ల మొత్తాన్ని బాగానే ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు బాగా ఉన్న తరుణంలో రుణాలపై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్​ఆర్​బీఎం పరిమితి పెంచకపోయినప్పటికీ... జీఎస్​డీపీ పెరుగుదలతో రుణపరిమితికి లోబడి తీసుకునే అప్పుల్లో అంచనాలను పెంచారు. దళిత బంధు, రైతుబంధుతో పాటు సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం తదితర పథకాలకు అత్యధిక నిధులు దక్కినట్లు తెలిసింది.

ఎన్నికల హామీ అయిన రుణమాఫీ పూర్తికి కూడా భారీగా నిధులు కేటాయించినట్లు సమాచారం. సంక్షేమంతో పాటు ప్రాధానన్యతా పథకాలకు నిధులు భారీగా పెంచిన సర్కారు... భారీ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ వెలుపల రుణాలపై ఎక్కువగా ఆధారపడినట్లు సమాచారం.

శాఖల వారీగా చూస్తే సంక్షేమ శాఖలతోపాటు ఎప్పటిలాగే వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు సింహభాగం కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. విద్య, వైద్యం, ఆసరా పింఛన్లు, విద్యుత్ రాయితీ, ఇతర రాయితీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మౌలిక సదుపాయాల మెరుగుదల, తదితరాలకు తగిన రీతిలో నిధుల కేటాయింపు చేసినట్లు సమాచారం. ఆదాయ, వ్యయాలను నికరంగా పోల్చకుండా... అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబడులతో సంబంధం లేకుండా ఖర్చు ప్రతిపాదించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.