ETV Bharat / state

"రండి.. కదలిరండి.. భవిష్యత్​ కోసం పోరాడదాం".. చంద్రబాబు బహిరంగ లేఖ

author img

By

Published : Feb 22, 2023, 5:22 PM IST

Updated : Feb 23, 2023, 6:26 AM IST

CBN OPEN LETTER : రాష్ట్రంలో ప్రజల తరఫున గళం వినిపిస్తున్న వారిని అణిచివేయాలనే కుట్రలో భాగంగానే వైసీపీ నేతలు గన్నవరంలో దాడులకు పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా జరిగే పోరాటంలో అందరం కలసి ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామన్నారు.

CBN OPEN LETTER
CBN OPEN LETTER

CBN OPEN LETTER : ప్రజల తరఫున గళం వినిపిస్తున్న బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే అధికార పార్టీ నేతలు గన్నవరం హింసకు పాల్పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశ్నించే ప్రజలు, ప్రజాసంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే అన్నారు. రాష్ట్ర ప్రజలకు గన్నవరం విధ్వంసంపై ఆయన బహిరంగ లేఖ రాశారు.

వికృత రాజకీయానికి పావులుగా పోలీసులు: ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామన్నారు. మన భవిష్యత్తుని.. మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. జగన్ రాజకీయ కక్ష సాధింపునకు పోలీసులు పావుల్లా మారుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసుల చేతనే తప్పుడు కేసులు పెట్టించి, తన వికృత రాజకీయానికి జగన్ వారిని పావులుగా వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అట్రాసిటీ కేసు పెట్టి చట్టం ఉల్లంఘన: ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వ్యక్తిగతంగా కేసు పెట్టేందుకు అర్హత లేకపోయినా.. క్రిస్టియన్ అయిన గన్నవరం సీఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ ఘటనను బట్టి పోలీసు వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థం అవుతుందని దుయ్యబట్టారు. గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా.. ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ధి స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా ప్రధాన నిందితుడిగా ఉన్నాడని ఆరోపించారు.

ప్రశ్నిస్తే అక్రమ కేసులు: ప్రజల నుంచి 1100 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ధి స్కాంలో రంగా నిందితుడని పేర్కొన్నారు. గన్నవరం ఘటనలో బాధితులైన తెలుగుదేశం నేతలనే నిందితులుగా చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇందుకు గన్నవరం విధ్వంసం, తరువాత పరిణామాలు తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు.

గన్నవరంలో కొత్త కుట్రకు తెర: బాధితులనే నిందితులుగా మార్చి.. జైలుకు పంపిన వైనంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. జగ్గంపేట, పెద్దాపురంలో తమ పర్యటనల అనంతరం.. ప్రజా స్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం.. అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించిందని ధ్వజమెత్తారు. ఆంక్షలు, నిర్బంధాలు ఉన్నా దండి మార్చ్ స్ఫూర్తితో అద్భుతంగా జరిగిన అనపర్తి సభతో ఉలిక్కిపడిన జగన్.. గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపాడని దుయ్యబట్టారు.

వైసీపీ దాడులు చేసినా బాధ్యతలు వదిలేసిన పోలీసులు: హింసాత్మక ఘటనలతో ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కకపోతే ఇక లాభం లేదని భావించిన జగన్​.... గన్నవరం విధ్వంసానికి పాల్పడ్డాడని ఆరోపించారు. గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను, సంకల్ప సిద్ధి స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత దొంతు చిన్నా ప్రశ్నించినందునే ఈ దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా వైసీపీ మూకలు దాడులు చేస్తున్నా పోలీసులు తమ బాధ్యతలు వదిలేశారని విమర్శించారు. ఈ దాడుల ఘటనలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయినా... పక్కా ఆధారాలు దొరికినా కారకులపై చర్యలు లేవని మండిపడ్డారు.

వైసీపీ గూండాల స్వైరవిహారం.. పట్టించుకోని పోలీసులు: యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో వైఎస్సార్సీపీ శ్రేణులు, వారికి నాయకత్వం వహిస్తున్న గూండాలు స్వైరవిహారం చేసినా పోలీసులు వారిని కనీసం నిలువరించలేదని ఆక్షేపించారు. ఈ ఘటనలో 40 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారని ఆరోపించారు.

స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్య: తెలుగుదేశం నేతలనే బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి, పోలీస్ టార్చర్ పెట్టి.. వారిపైనే పోలీసులు తప్పుడు ఆరోపణలతో చివరకు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుందని.. దీనిలో కొంత మంది కళంకిత పోలీసు అధికారులు భాగస్వాములు కావడం విచారకరమన్నారు. ఈ తరహా దాడులు, విధ్వంసాలతో ఈ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని మండిపడ్డారు. తద్వారా ప్రభుత్వాన్ని ఎవరూ ఎదిరించకూడదనే భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.

ధర్మానికి.. అధర్మానికి యుద్ధం: ఈ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేది వారి కుట్ర అని ఆరోపించారు. బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరిచి... ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడ నుంచి కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి... ప్రజాస్వామ్యానికి, నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 23, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.