రోడ్ల పనులకు నిధులివ్వక చేతులెత్తేసిన ప్రభుత్వం.. రుణాన్ని ఆపేసిన బ్యాంకు

author img

By

Published : Jan 5, 2023, 8:32 AM IST

R&B road renovation works

R&B road renovation works: రాష్ట్రంలో రహదారి పనులకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు పదేపదే చెబుతున్న ప్రభుత్వం.. రూ. 205 కోట్లు విడుదల చేయకుండా చేతులెత్తేసింది. ఇప్పటివరకు 90 శాతం రుణాన్ని విడుదల చేసిన ఓ బ్యాంకు.. సర్కారు తీరుతో మిగిలిన 10 శాతం రుణాన్ని ఆపేసింది. ఫలితంగా మూడు నెలలుగా చేసిన పనులకు బిల్లులు రాక గుత్తేదారులు ఎదురుచూడాల్సి వస్తోంది.

R&B road renovation works: రాష్ట్రంలో 7వేల 500 కిలోమీటర్ల మేర అర్​ అండ్‌ బీ రహదారుల పునరుద్ధరణ పనులు గత ఏడాది చేపట్టారు. వీటికి 2వేల 205 కోట్లు అవసరమని అంచనా వేయగా,...... దీనికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2వేల కోట్లు రుణంగా తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్​పై లీటరు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న రహదారి అభివృద్ధి సెస్సు బ్యాంకు రుణానికి హామీగా చూపారు. గుత్తేదారులకు బ్యాంకు నుంచి నేరుగా చెల్లింపులు జరిపేలా ఏర్పాటు చేశారు. మిగిలిన 205 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూరుస్తామని మొదట్లోనే చెప్పింది. దీంతో బ్యాంకు ప్రతివారం రుణాన్ని విడుదల చేస్తూ వచ్చింది.

జిల్లాల వారీగా మొత్తం 1,162 రహదారుల పనులు చేపట్టగా, ఇందులో 1,070 పనులు పూర్తయ్యాయి. 2 వేల కోట్ల రూపాయల రుణంలో 1800కోట్ల రూపాయల వరకు గుత్తేదారులకు బ్యాంకు నుంచి చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద సమకూర్చాల్సిన 205 కోట్లు రూపాయలు మాత్రం ఇవ్వకుండా చేతులెత్తేసింది.రుణంలో 90 శాతం మేర గుత్తేదారులకు బ్యాంకు చెల్లించినా సరే... రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాలేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులు గుర్తించారు.

ప్రభుత్వ వాటా చెల్లించాలంటూ పదే పదే కోరారు. అయినా స్పందన లేకపోవడంతో..అక్టోబరు నుంచి బ్యాంకు రుణంలో మిగిలిన పది శాతం విడుదల చేయకుండా ఆపేశారు. ఒప్పందం ప్రకారం ముందుగా ప్రభుత్వ వాటా విడుదల చేసే వరకు, మిగిలిన రుణం ఇవ్వబోమంటూ బ్యాంకు అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు గుత్తేదారులు దాదాపు 200 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే సర్కారు వాటా 205 కోట్లు రూపాయలు ఇప్పుడిప్పుడే ఇచ్చే అవకాశం లేదని చర్చ జరుగుతోంది.

ఇటీవల 1,733 కోట్ల రూపాయలతో మరో 8,181 కిలోమీటర్ల రహదారి పునరుద్ధరణ పనులను ఆర్ అండ్ బీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. వీటికి బ్యాంకు రుణం తీసుకోవాలా? ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత పనులకు....... ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడంతో.. ఆ ప్రభావం కొత్తగా చేపట్టబోయే పునరుద్ధరణ పనులపై ఉంటుందని అర్​ అండ్‌ బీ వర్గాలు చెబుతున్నాయి.

రహదారి పనులకు నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.