HINDUJA: హిందుజాకు కోట్లు దోచిపెట్టిన ప్రభుత్వం.. తీసుకోని విద్యుత్తుకు చెల్లింపులా

author img

By

Published : May 25, 2023, 7:38 AM IST

హిందుజాకు కోట్లు దోచిపెట్టిన ప్రభుత్వం.. తీసుకోని విద్యుత్తుకు చెల్లింపులా

Govt paid crores to Hinduja: ఉత్పత్తేకాని విద్యుత్తుకు భారీ మొత్తంలో ప్రభుత్వం చెల్లింపులు చేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి అప్పుతీసుకుని మరీ.. హిందుజా సంస్థకు 12 వందల 34 కోట్లు కట్టబెట్టింది. బకాయిలు చెల్లించాలని ఆ సంస్థ లేఖ రాసిన నెల రోజుల్లోనే.. ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుంది. నియంత్రించాల్సిన ఏపీఈఆర్సీ అడ్డుచెప్పలేదు. ఇప్పుడు బకాయిలపై వడ్డీ కూడా చెల్లించాలంటూ హిందుజా సంస్థ మరో లేఖ రాసింది. దానికీ ప్రభుత్వం సరేనంటే.. ప్రజలపై మరో వెయ్యి కోట్ల రూపాయల భారం పడనుంది. హిందుజా సంస్థ విషయంలో ప్రభుత్వానికి ఇంత అత్యుత్సాహం ఎందుకో అన్నది అంతుచిక్కడం లేదు.

Govt paid crores to Hinduja

Govt paid crores to Hinduja: అసలు ఉత్పత్తే చేయని విద్యుత్తుకు.. ప్రభుత్వం నుంచి ఎవరైనా డబ్బులు తీసుకోగలరా? అది ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యం. మన రాష్ట్ర ప్రభుత్వం అలా డబ్బులు ఇవ్వడానికి డిస్కంలతో అప్పులు చేయించి.. వాటికి హామీ ఇవ్వడమే కాక ఆ డబ్బును ఫలానా సంస్థకు ఇవ్వాలనీ చెబుతోంది. హిందుజా కంపెనీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న అత్యుత్సాహానికి ప్రబల నిదర్శనమిది. ఫిబ్రవరి 16న ప్రభుత్వం జారీ చేసిన జీవో-19 సారాంశం ఇదే. హిందుజా సంస్థ నుంచి విద్యుత్తు తీసుకోవడానికి వీలుగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడంలో రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి- ఏపీఈఆర్సీ నిబంధనల మేరకు వ్యవహరించాలని చెప్పింది.

అవే ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు.. పీఎఫ్​సీ-ఆర్​ఈసీ నుంచి 12 వందల 34.68 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని.. ఆ రుణానికి ప్రభుత్వం హామీగా ఉంటుందని తెలిపింది. ఇలా తీసుకునే మొత్తాన్ని హిందుజా నేషనల్ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌-హేచ్ఎన్​పీసీసీఎల్​కు చెల్లించాలని ప్రభుత్వమే చెప్పింది. దీనికి ఏపీఈఆర్సీ అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్పలేదు. అసలు విద్యుత్తు ఉత్పత్తి చేయని కాలానికి హిందుజా సంస్థకు చెల్లింపులు చేయడంపై ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపినా.. ఆ మొత్తాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్లింది. ఈ దస్త్రంపై సంతకాలు చేసిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా మంత్రిమండలిలో ఆమోదం పొందేలా జాగ్రత్తలు తీసుకుని మరీ చెల్లించారు. మొదటి విడత 800 కోట్లు, రెండో విడత మిగిలిన మొత్తాన్ని పీఎఫ్​సీ నుంచి రుణంగా తీసుకుని డిస్కంలు చెల్లించాయి. ఆ భారం ప్రజలపైనే పడనుంది.

కోర్టు ఆదేశాల్లేవు.. ఏపీఈఆర్‌సీ అనుమతీ లేదు.. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో.. హిందుజా సంస్థకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎందుకు చెల్లిస్తున్నామనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. డిస్కంలు చెల్లించాల్సిన బకాయిల కింద ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నామనే పేర్కొంది. ఆ బకాయిలు ఏంటి? ఎప్పటినుంచి చెల్లించాల్సి వస్తోందనే వివరాలేవీ చెప్పలేదు. ఎక్కడినుంచి రుణం తీసుకోవాలనే మార్గాన్నే ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు లేట్ పేమెంట్ స్కీం కింద పీఎఫ్​సీ నుంచి రుణాన్ని తీసుకుని.. డిస్కంలు హిందుజాకు చెల్లించాయి. ప్రభుత్వం ఇంత హడావుడిగా వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి కోర్టు నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? పోనీ ఏపీఈఆర్సీ ఏమైనా సూచనలు చేసిందా? అవేమీ లేకుండానే విద్యుత్తు తీసుకోని కాలానికి స్థిర ఛార్జీల రూపేణా హిందూజ సంస్థకు ప్రభుత్వం హడావిడిగా చెల్లించింది. కనీసం ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోలేదు.

విద్యుత్తు తీసుకోకున్నా.. స్థిర ఛార్జీల చెల్లింపు.. హిందుజాతో ఉన్న వివాదం వల్ల 2020 జూన్‌ నుంచి 2022 జనవరి మధ్య డిస్కంలు విద్యుత్తు తీసుకోలేదు. ఈ వ్యవధిలో స్థాపిత సామర్థ్యంలో 80 శాతం విద్యుత్తు ఉత్పత్తి చేసినట్లుగా భావించి ఆ ప్రకారం యూనిట్‌కు 1.06 రూపాయల వంతున స్థిర ఛార్జీలు చెల్లించాలని హిందుజా సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. వెంటనే ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. ఆ మేరకు లెక్కలు కట్టి 12 వందల 34 కోట్ల రూపాయలు చెల్లించేలా ఇంధనశాఖ ప్రతిపాదన తయారుచేసింది. నెల రోజుల్లోనే చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హిందుజా రాసిన లేఖపై ఎలా వ్యవహరించాలనేదానిపై.. రాష్ట్ర విద్యుత్తు సమన్వయ కమిటీ- ఏపీపీసీసీ.. 2022 డిసెంబరు 25న ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత 2023 జనవరి 6, 11, 30 తేదీల్లో వరుసగా లేఖలు రాసి.. ఇదేదో ప్రాధాన్యాంశంలా.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ మొత్తంతో సర్దుకోని హిందుజా సంస్థ.. ఆ వ్యవధికి బకాయిలపై వడ్డీ చెల్లించాలంటూ ఇంధనశాఖకు మరో లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రజలపై భారం పడుతున్నా.. పట్టించుకోని ఏపీఈఆర్‌సీ.. బహిరంగ మార్కెట్‌ నుంచి ఎంత విద్యుత్తు, ఎంతకు కొనాలని నియంత్రణ విధించే ఏపీఈఆర్సీ.. నిబంధనలకు విరుద్ధంగా హిందుజా సంస్థకు చేస్తున్న చెల్లింపులను అడ్డుకోలేదు. 2023-24 టారిఫ్‌ ఆర్డర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో పలువురు విద్యుత్తురంగ నిపుణులు హిందుజాకు చేసే చెల్లింపుల విషయాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చి.. అభ్యంతరం తెలిపినా.. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవోను కమిషన్‌కు అందించి.. చెల్లింపులను నిలిపివేయాలని కోరినా.. కమిషన్‌ స్పందించ లేదు. ప్రజాధనం వృథా అవుతున్నా.. కమిషన్‌ చూస్తూ ఊరుకుందని.. విద్యుత్తురంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.