ETV Bharat / state

టెన్త్​ పరీక్షలు.. సవాళ్లను అధిగమించి పరీక్షలకు హాజరైన విద్యార్థులు

author img

By

Published : Apr 3, 2023, 12:55 PM IST

SSC EXAMS IN AP : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని పరీక్షాకేంద్రాల్లో వసతులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. కొన్నిచోట్ల వారికున్న సమస్యలను అధిగమించి పరీక్షలు రాసేందుకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి గెలిచారు. ఆ విద్యార్థుల గురించి కొన్ని వివరాలు..

SSC EXAMS IN AP
SSC EXAMS IN AP

SSC EXAMS IN AP : విద్యార్థి జీవితంలో మొట్టమొదటి దశ పదో తరగతి. చాలా మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు వస్తున్నాయంటే.. రాత్రింబవళ్లు చదివి ఎలాగైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు. అయితే అందులో కొద్దిమంది సఫలీకృతమైతే.. మరికొందరు ఫెయిల్​ అవుతుంటారు. కానీ జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉంటే చదువుకు ఏది ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు సత్యసాయి జిల్లా విద్యార్థి.

హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముఖేష్ అనే విద్యార్థి.. గత నెల 26వ తారీఖున ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి పదవ తరగతి పరీక్షలు రాయాలని సంకల్పించాడు. ఆసుపత్రి వద్దకు పుస్తకాలు తీసుకురావాలని.. తాను పరీక్షలు రాయాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు.. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులను సంప్రదించారు.

విద్యార్థి స్థితిగతులు తెలుసుకున్న వారు.. మరొకరి సహాయంతో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని విద్యార్థి తండ్రి చేత ఉన్నతాధికారులకు దరఖాస్తు చేయించారు. దీనిపై స్పందించిన అధికారులు.. ముఖేష్​కు సహాయకుడితో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈరోజు ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు విద్యార్థి ముఖేష్ పట్టణంలోని నేతాజీ మున్సిపల్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి చేరుకొని ఓ సహాయకుడి సహాయంతో పరీక్షలు రాసేందుకు వచ్చాడు. ఆ విద్యార్థి తపనను చూసిన ప్రతి ఒక్కరూ.. శభాష్ ముఖేష్ అంటూ అభినందిస్తున్నారు.

పరీక్ష రాయాలనే సంకల్పం..మంచంపైనే పరీక్ష కేంద్రానికి..: గుంటూరులోని ఆక్సీలియం పాఠశాలలో చేయి విరిగిన విద్యార్థి , దివ్యాంగుడు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. ప్రవీణ్ అనే విద్యార్థి సైకిల్ నుంచి కిందపడి ఎముక విరగడంతో కాళ్లకు చికిత్స జరిగింది. నడవలేని పరిస్థితుల్లో ఉన్నందున.. తల్లిదండ్రులు మంచంపైనే పరీక్ష రాయడానికి తీసుకొచ్చారు.

పదో తరగతి విద్యార్థినికి తొమ్మిదో తరగతి బాలిక సాయం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో తమకు కేటాయించిన సీట్ల కోసం విద్యార్థులు పరుగులు తీశారు. సెయింట్ క్లారిటీ స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద పదో తరగతి బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థిని ధర్మాన తనుజాకు తొమ్మిదో తరగతి విద్యార్థి మమత పరీక్షకు రాసేందుకు వచ్చారు.

పడవలపై పరీక్షకు: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఈ జిల్లాకు సరిహద్దులో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్య లంకకు చెందిన విద్యార్థులు కోనసీమ జిల్లా వైపు నుంచి వచ్చి చదువుకుంటుంటారు. ఈ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పడవలపై వశిష్ట గోదావరి నదిని దాటి కోనసీమ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు.

పది పరీక్షలకు వెళ్తుండగా ప్రమాదం: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సమీపంలోని 42వ జాతీయ రహదారిలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున, వంశీ అనే పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు విడపనకల్లు మండలం, హావళిగి గ్రామానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వీరు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాదైనా పరీక్షలు రాసి పాస్​ అవ్వాలన్నా వారి కలలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది.

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తప్పని ఇబ్బందులు: తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షల కేంద్రంలో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. బల్లలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు పరీక్షలు రాయడం ఇబ్బందిగా మారింది. ఒకవైపు సిమెంటు దిన్నెలు ఉండగా వాటి మధ్యలో ప్లాస్టిక్ స్టూల్స్ వేసి ఇబ్బందులు లేకుండా చేయాలని పరీక్షల నిర్వహణ అధికారులు చర్యలు తీసుకున్నా తిప్పలు తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.

పదో తరగతి పరీక్షలు: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 వేల 349 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్ల విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరారు. ఒక నిమిషం నిబంధనతో.. చాలా మంది విద్యార్థులు పరుగు పరుగున వచ్చి ఇబ్బంది పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసే విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసి పంపించారు. ఫోన్‌లు, డిజిటల్ వాచీలు అనుమతించలేదు. కొన్ని కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో.. జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.