ETV Bharat / state

ఉద్యోగులు ఉసూరు!.. జీతం ఇస్తే చాలన్న పరిస్థితి

author img

By

Published : Jan 5, 2023, 8:36 AM IST

Condition of Employees in YCP Government: వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతం సమయానికి రాదు. ఆర్థిక ప్రయోజనాలకు నెలల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి. నిరసన తెలుపుదామంటే ఆంక్షలు, బైండోవర్‌ కేసులు. పింఛనర్లు డబ్బులు లేక మందుల దుకాణాల్లో బాకీలు పెట్టుకోవాల్సి వస్తోంది.

Condition of Employees in YCP Government
Condition of Employees in YCP Government

Condition of Employees in YCP Government: ‘నీతి లేని ఓ నాయకుడా..! పలుకు లేని పరిపాలకుడా..!’ అంటూ జగన్‌ పాలనపై ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు పాట రాశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతం వస్తుందనుకునే రోజులు పోయాయి. పింఛను డబ్బు ఎప్పుడొస్తుందో తెలియదు. జీతం ఇస్తే చాలనే పరిస్థితి వచ్చింది. ప్రతినెలా పాలు, సరకులు, బ్యాంకు రుణాల వాయిదాలకు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళనే. గత నెల 15తేదీ వరకు జీతాలు అందలేదు. ఏ నెలలోనూ ఐదో తేదీకి ముందు జీతాలు రాకపోవడంతో కొందరు ఈఎంఐ గడువు మార్చుకుంటున్నారు.

సమయానికి వచ్చేలా చేస్తా: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి: ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తేనే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడతాడు. ప్రతి ఉద్యోగికి చెబుతున్నా.. వారికి రావాల్సినవన్నీ సరైన సమయానికి వచ్చేలా, ప్రతి డీఏ సమయానికి వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతం అందట్లేదు. డీఏ బకాయిలు చెల్లించకుండానే ఇచ్చినట్లు చూపి, ఆదాయపన్ను మినహాయించేశారు. పీఎఫ్‌, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలకు దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా ఇవ్వరు. సీపీఎస్‌ రద్దు హామీ అటకెక్కింది. పొరుగుసేవల సిబ్బంది మెడపై తొలగింపు కత్తి వేలాడుతోంది. హక్కుల కోసం ఆందోళనలు చేస్తే నిర్బంధాలు, బైండోవర్‌ కేసులతో ఉద్యోగులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఇవ్వని సొమ్ముకూ ఆదాయ పన్ను

ఉద్యోగులకు 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు చెల్లించాలి. వీటి బకాయిలను పాత పింఛను విధానంలో ఉన్నవారికి జీపీఎఫ్‌లో జమ చేసి, సీపీఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు నగదు రూపేణా చెల్లించాలి. ఇవేవీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపించి, జీతాల నుంచి ఆదాయపన్ను మినహాయించేశారు. 2022 జనవరి, జులై నెలల్లో చెల్లించాల్సిన డీఏ బకాయిలు ఇవ్వలేదు. సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు రూపేణా 90% చెల్లించాలి. ఈ బకాయిలు రూ.3వేల కోట్ల వరకు ఉండగా.. మిగతా ఉద్యోగులకు చెల్లించాల్సినవి రూ.10వేల కోట్ల వరకు ఉన్నాయి.

దాచుకున్న డబ్బులకూ ఇబ్బందే

జీపీఎఫ్‌, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు, క్లెయిముల బిల్లులు రూ.1,600 కోట్లకుపైగా పెండింగులో ఉన్నాయి. వీటన్నింటినీ గతేడాది ఏప్రిల్‌ నాటికి క్లియర్‌ చేస్తామని చర్చల్లో మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఇప్పటికీ రాకపోవడంతో.. పిల్లల పెళ్లిళ్లనూ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.

జీతాల్లో కోత వేసి.. వాడేసుకుని..

సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి మినహాయించిన వాటాను గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రాన్‌ ఖాతాకు జమ చేయట్లేదు. ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా.. ఉద్యోగుల నుంచి మినహాయించిన దాన్నీ వాడేసుకుంటోంది. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవాటాను 14%కు పెంచాల్సి ఉన్నా, ఇప్పటికీ 10శాతమే చెల్లిస్తోంది. ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు 14% చెల్లించేందుకు గెజిట్‌ను విడుదల చేశాయి. దాదాపు రూ.1,800 కోట్లను ప్రాన్‌ ఖాతాకు ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. అలా చేయకపోవడంతో ఉద్యోగులు పీఎఫ్‌ నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మరోపక్క సీపీఎస్‌ ఉద్యోగుల సొమ్మును హామీగా పెట్టి ప్రభుత్వం అప్పులు చేస్తోంది.

పీఆర్సీలోనూ అదే తంతు..

పీఆర్సీ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వం మధ్యంతర భృతి (ఐఆర్‌) కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఐఆర్‌ 27% కాగా.. ఫిట్‌మెంట్‌ 23% ఇచ్చింది. ఉద్యోగుల ఆందోళన తర్వాత వ్యత్యాసం రికవరీని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటి అద్దెభత్యాన్నీ తగ్గించింది. 50 లక్షలకు పైగా జనాభా ఉంటే 24% ఇస్తామంది. కానీ, ఇంత జనాభా ఉన్న కార్పొరేషన్లు రాష్ట్రంలో ఎక్కడా లేవు.

సీపీఎస్‌ రద్దు.. ఒప్పంద క్రమబద్ధీకరణ లేదు

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దుచేస్తానని, అర్హతల ఆధారంగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీలు ఇచ్చారు. కానీ సీపీఎస్‌ రద్దు చేయకుండా ఇప్పుడు కొత్తగా గ్యారంటీ పింఛను పథకం(జీపీఎస్‌) తీసుకొస్తున్నారు. క్రమబద్ధీకరించాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు గడువు తేదీలను విధిస్తున్నారు.

పొరుగుసేవల మెడపై కత్తి

పొరుగుసేవల ఉద్యోగుల వేతనాలను పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు వీరి మెడపై తొలగింపు కత్తి పెట్టింది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అండ్‌ ఎకౌంట్స్‌ విభాగంలో పదేళ్లలోపు సర్వీసు ఉన్న 17మందిని తొలగించేందుకు డిసెంబరు 1న మెమో ఇచ్చింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని గురుకుల వసతిగృహాల్లో పనిచేస్తున్న సుమారు 300-350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగించేందుకు డిసెంబరు 4న ఆదేశాలు ఇచ్చింది.

ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గినా, మెమోను అబెయెన్స్‌లోనే పెట్టింది. రద్దు చేయలేదంటే ఎప్పుడైనా అమలుచేయొచ్చు. ఉద్యోగులు ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయకపోతే జనవరి నెల జీతం ఆపేస్తామని ఇప్పటికే ఏపీ పొరుగు సేవల సంస్థ ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 90,609 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. చాలామందికి విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు లేవంది.

పట్టభద్రులు కాకుండా రూ.18వేల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలు, పోస్టును బోర్డు అనుమతి ప్రకారం భర్తీ చేశారా? సాధారణ ఖాళీల్లోనే పోస్టు ఉందా? అనే వివరాలను పంపించాలని ఆదేశించింది. ఇవన్నీ పొరుగుసేవల ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఆందోళనకు దిగితే వేధింపులు

తమకు రావాల్సిన జీతాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తే నోటీసులు ఇచ్చి, బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. ధర్నాలు, ఆందోళనలకు అనుమతుల్లేవు. రాష్ట్రస్థాయిలో నిరసనలకు పిలుపునిస్తే ఉద్యోగులు వెళ్లకుండా పోలీసులు అష్టదిగ్బంధం చేస్తున్నారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీపీఎస్‌ ఉద్యోగులు మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు. గత సెప్టెంబరులో మిలియన్‌ మార్చ్‌కు పిలుపునిస్తే ఉద్యోగుల ఇళ్ల వద్ద పోలీసులను కాపలా పెట్టారు.

అగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.