ETV Bharat / state

Water Recycling: మూడంచెల్లో మురుగు నీరు శుద్ధి... ఎలాగంటే..!

author img

By

Published : Oct 23, 2021, 7:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా నీటి వనరుల తగ్గుదల.. మానవాళి మనుగడకు సరికొత్త సవాళ్లు విసురుతోంది. ఈ తరుణంలో నీటిని పొదుపుగా వాడటంతో పాటు రీ సైక్లింగ్​పైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఈ దిశగా ముందడుగు వేసింది. సహజసిద్ధంగా నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుని రూపొందించారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటి.. ఉపయోగాలేంటో చూద్దాం.

మూడంచెల్లో ముగురు నీరు శుద్ధి
మూడంచెల్లో ముగురు నీరు శుద్ధి

మూడంచెల్లో ముగురు నీరు శుద్ధి

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో నిత్యం 5 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. గతంలో అదంతా మురుగునీరుగా బయటకు వెళ్లేది. నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో యూనివర్శిటీ యంత్రాంగం.. మురుగునీటి శుద్ధి ప్లాంటుకు రూపకల్పన చేసింది. ఇక్కడ మురుగు నీటిని మూడు అంచెల్లో స్వచ్ఛంగా మారుస్తున్నారు.

క్యాంపస్‌లోని మురుగునీరంతా ముందుగా ట్యాంకుల్లోకి చేరేలా ప్రణాళిక రూపొందించారు. దీనికోసం..లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన 7 ట్యాంకులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకదాని తర్వాత మరొక ట్యాంకులోకి నీరు చేరుతుంది. ఈ క్రమంలోనే నీటిలో బరువు ఎక్కువగా ఉండే లోహాలు, రసాయనాల్నీ అడుగుకు వెళ్లిపోతాయి. ముందుగానే ఈ ట్యాంకుల్లో మేలు రకం బ్యాక్టీరియాను వేసి ఉంచుతారు. నీటిలో అడుగుకు చేరిన మలినాల్ని బ్యాక్టీరియా సంగ్రహిస్తుంది. అనంతరం ట్యాంకుల్లోని నీటిని పైపుల ద్వారా.. పక్కనే ఉన్న తడి నేలల్లోకి పంపిస్తారు. ఇక్కడ నేలపై దాదాపు 2 అడుగుల మేర కంకరతో నింపారు. అందులో ఏడు రకాల మొక్కలు నాటారు. అవన్నీ కూడా వేర్ల ద్వారా వివిధ రకాల రసాయనాల్ని పీల్చుకునే స్వభావం కలిగి ఉంటాయి. ఆ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా గాలిని పంపింగ్ చేస్తారు. ఈ ప్రక్రియను ఏరియేషన్‌ అంటారు. ఈ ప్రక్రియతో నీటిలోని నైట్రేట్స్, సల్ఫేట్స్, లెడ్ వంటి హానికర పదార్థాలు తొలగిపోతాయి. ఏరియేషన్ ప్రక్రియలో మొక్కల ద్వారా శుద్ధి అయిన నీరంతా ఓపెన్ ట్యాంకులోకి చేరుతుంది. ఇక్కడ మూడోదశ శుద్ధిలో భాగంగా ఓజోనేషన్ చేస్తారు. దీంతో నీరు పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

గతంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు భిన్నంగా దీన్ని గ్రీన్ టెక్నాలజీ ఆలోచనతో ఏర్పాటు చేశారు. అతి తక్కువగా విద్యుత్ వాడకంతో పాటు...బురద అనేది లేకుండా దీనికి రూపకల్పన చేశారు. యూనివర్శిటిలోని వివిధ చోట్ల ఉపయోగించిన నీరు గ్రావిటీ ఆధారంగా ప్లాంట్ వద్దకు చేరుకుంటుంది. ఆ తర్వాత శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ కేవలం ఏరియేషన్ ప్రక్రియ కోసం మోటార్లు పని చేయాల్సి ఉంటుంది. దానికి మాత్రమే కరెంటు వినియోగిస్తారు. మిగతా ప్రక్రియలన్నీ సహజ సిద్ధంగా జరుగుతాయని సిబ్బంది చెబుతున్నారు.

ఇదీ చదవండి

ఆ ఆకుల కోసం ఎగబడ్డ జనం.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.