ETV Bharat / state

Rape case: గుంటూరు అత్యాచారం కేసు.. పాత నేరస్థులను విచారిస్తున్న పోలీసులు

author img

By

Published : Sep 13, 2021, 1:12 PM IST

Updated : Sep 13, 2021, 3:24 PM IST

seven members were under police custody in guntur rape case
గుంటూరు అత్యాచారం కేసు.. పాత నేరస్థులను విచారిస్తున్న పోలీసులు

13:09 September 13

కొర్రపాడుకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం(gang rape) కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. కొర్రపాడుకు చెందిన ఏడుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి.. నిందితులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  

అసలేం జరిగింది

గుంటూరు నగరానికి 28 కి.మీ దూరంలో.. ఈ నెల 8న రాత్రి 10 గంటల సమయంలో వైవాహిక యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. దంపతులిద్దరినీ తీవ్రంగా కొట్టి.. చిత్రహింసల పాల్జేశారు. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. 

కర్ర అడ్డం పెట్టి.. కింద పడగొట్టి..

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు (భార్య 26, భర్త 30 ఏళ్లు) బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9.45 గంటలకు స్వస్థలానికి బయల్దేరారు. 2.50 కి.మీ దూరం ప్రయాణించాక.. దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచే వాహనాన్ని ముందుకు పోనివ్వగా.. దుండగులు కర్ర అడ్డంపెట్టి బైక్‌ పైనుంచి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే ఇద్దరిపై పిడిగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత కొడవళ్లు చూపించి చంపేస్తామని బెదిరించారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు. బాధితురాలి భర్త బనియను, దుస్తుల్ని చించేసి వాటితోనే అతన్ని కట్టేశారు. అతని వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా, మరో ఇద్దరు బాధితురాల్ని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 గంటల వరకూ భార్యాభర్తలిద్దరినీ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.

స్థానిక కూలీల విచారణ

ఘటనాస్థలికి అర కిలోమీటరు దూరంలో ఓ శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు ఇక్కడ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం ఘటనా స్థలానికి క్లూస్‌టీమ్‌ వెళ్లింది. వారితో తీసుకెళ్లిన జాగిలం ఈ శీతలీకరణ కేంద్రం వైపు వెళ్లి ఆగింది. పోలీసులు అక్కడ పనిచేస్తున్న 20 మంది కూలీల వేలిముద్రలు సేకరించారు. బాధితురాలిని ఈ నెల 9న ఉదయం 8:15కు గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు పరీక్షించి కాన్పుల విభాగం వార్డుకు తరలించి పలు రకాల పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత కథనం: 

GANG RAPE: భర్తను కట్టేసి.. భార్యపై సామూహిక అత్యాచారం

Last Updated : Sep 13, 2021, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.