ETV Bharat / state

PM Modi in Ramagundam : 'సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే కేంద్రానికి లేదు'

author img

By

Published : Nov 12, 2022, 5:51 PM IST

PM Modi in Ramagundam : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామగుండం పర్యటన సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని.. ఎన్టీపీసీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన మోదీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదనే తీయని మాటను చెప్పారు. సింగరేణి సంస్థలో అధిక వాటా రాష్ట్ర సర్కార్‌కు ఉన్నప్పుడు దాన్ని కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుందని ప్రశ్నించారు.

PM Modi in Ramagundam
PM Modi in Ramagundam

PM Modi in Ramagundam : సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే కేంద్రానికి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేస్తున్నామనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించిన మోదీ.. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించారు. ఆ ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కర్మాగారం ఏర్పాటు, ఎరువుల ఉత్పత్తి గురించి అధికారులు మోదీకి వివరించారు.

PM Modi on Singareni Privatization : అనంతరం ఎన్టీపీసీ మైదానానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత డిజిటల్‌ విధానంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. భద్రాచలం- సత్తుపల్లి రైల్వేలైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే, బోధన్ - బాసర- భైంసా హైవే, సిరొంచా - మహాదేవ్‌పూర్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

తెలుగులో ప్రసంగం.. అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం మోదీ బహిరంగ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భవిష్యత్‌లో భారత్‌ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యం అవుతుందని ప్రధాని తెలిపారు. ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌, నకిలీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఖమ్మం జిల్లాలో మరో రైల్వేలైన్‌ను ప్రారంభించామన్న మోదీ.. కొత్త రైల్వేలైన్‌తో ప్రజలకు, విద్యుత్‌ రంగానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కొత్తగా చేపడుతున్న హైవేల విస్తరణ వల్ల ఎన్నో మార్పులు రానున్నాయన్నారు. వీటివల్ల ఉపాధి అవకాశాలతో పాటు, ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయని వెల్లడించారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు రోడ్ల అనుసంధానం పెరుగుతుందని తెలిపారు.

అభివృద్ధితో ఉపాధి.. "రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టాం. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. తక్కువ ధరకే రైతులకు నీమ్‌ కోటింగ్ యూరియా అందిస్తున్నాం. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టాం. నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చాం. 2014 కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లు. మేం అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చేశాం. మేం తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్‌ బంద్‌ అయింది. 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. యూరియాపై కేంద్రప్రభుత్వం రూ.2వేల రాయితీ ఇస్తోంది." అని ప్రధాని మోదీ అన్నారు.

శంకుస్థాపనలకే పరిమితం కాలే.. పూర్తి చేసి చూపించాం.. : ఫర్టిలైజర్‌ ప్లాంట్‌, రైల్వేలైన్‌, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయని వెల్లడించారు. కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవనప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందన్న ప్రధాని.. ఈ 8 ఏళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని పేర్కొన్నారు. తాము మేం శంకుస్థాపనలకే పరిమితం కాలేదన్న మోదీ.. వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.