ETV Bharat / state

Police Physical Fitness Test: ప్రాథమిక పరీక్ష పూర్తై రెండు నెలలు.. దేహదారుఢ్య పరీక్షలు ఇంకెప్పుడు?

author img

By

Published : May 10, 2023, 2:58 PM IST

Police Physical Fitness Test Notification: నాలుగేళ్ల తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో నిరుద్యోగులు సంతోషించారు. ఇక ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రాథమిక పరీక్ష పూర్తై రెండు నెలలు గడుస్తున్నా.. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఇంతవరకు మళ్లీ వాటి ఊసేలేదు.

Physical Fitness Test
Physical Fitness Test

దేహదారుఢ్య పరీక్షలు ఇంకెప్పుడో.. ఆర్థిక భారం భరించలేక స్వస్థలాలకు

Police Physical Fitness Test Notification: ప్రభుత్వ కుంటి సాకులతో పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సాధన చేస్తున్న అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారు. ప్రాథమిక పరీక్ష పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా.. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 28న 6 వేల100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా.. 95 వేల 208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్సై ఉద్యోగాలకు ఫిబ్రవరి 19న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా.. 57 వేల 923 మంది అర్హత సాధించారు.

మొదట మార్చి 13 నుంచి 20 వరకు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈలోపే ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల కారణంగా షెడ్యూల్ వాయిదా వేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. పరీక్షల తేదీల్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. నేటీకి వాటి ఊసేలేదు. ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు క్రీడా మైదానంలో కుస్తీ పడుతున్నప్పటికీ.. ప్రభుత్వ అలసత్వం వారి గమ్యాన్ని దూరం చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నెలల తరబడి మైదానాల్లో సాధన చేస్తున్న అభ్యర్థుల్లో నిరాశ మొదలైంది.

ఆర్థిక భారం భరించలేక నిరాశతో స్వస్థలాలకు.. ప్రాథమిక పరీక్ష నిర్వహించి రెండు నెలలు గడిచినా.. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకపోవటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు హఠాత్తుగా పరీక్షలను వాయిదా వేయటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎంత కష్టపడైనా పోలీసు కొలువు సాధించాలనే దృఢ సంకల్పంతో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. వసతి, భోజన సదుపాయాల కోసం నెలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష పూర్తి అవుతుందని అభ్యర్థులు ఆశించినప్పటికీ.. వాస్తవ పరిస్థితిల్లో అది నెరవేరేలా కనిపించడం లేదు. దీంతో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక.. నెలల తరబడి సాధన చేయలేక.. ఆర్థిక భారం భరించలేని అభ్యర్థులు.. నిరాశతో స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.

లక్షా 53 వేల మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్ష కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం అభ్యర్థుల సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని.. త్వరగా పరీక్ష నిర్వహించాలని అటు అభ్యర్థులతో పాటు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇప్పుటికే జాబ్‌ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న జగనన్న ప్రభుత్వం.. కనీసం విడుదల చేసిన పోలీసుల కొలువులనైనా త్వరితిగతిన పూర్తి చేయాలని అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.