ETV Bharat / state

Municipal Workers Agitation: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు.. సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనలు

author img

By

Published : Aug 7, 2023, 9:34 PM IST

Municipal Workers Agitation: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు మరోసారి కదం తొక్కారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీలు.. వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. చాలా జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి కార్మికులు యత్నించడంతో.. ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరగగా... పలువురిని అరెస్టు చేశారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి సేవందించినా.. వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని కార్మికులు మండిపడ్డారు.

municipal_workers_Agitation
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు

Municipal Workers Agitation: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. శ్రీకాకుళంలో మున్సిపల్‌ కార్మికులు రోడ్డెక్కారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించడంతో.. కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకునిస్టేషన్​కు తరలించారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులు వినూత్న ధర్నా చేపట్టారు. కార్మికులు, సీఐటీయూ నాయకులు.. రోడ్డుపై పొర్లు దండాలు పెట్టారు.

పార్వతీపురంలోనూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ.. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విశాఖలో చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

Municipal Outsourcing Workers Problems: "మున్సిపల్​ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఉద్యమం"

Municipal Workers Demands to Resolve Problems: విజయవాడ ధర్నాచౌక్ వద్ద మున్సిపల్ కార్మికులు.. ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్మికులను క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్వంలో గుంటూరు మున్సిపల్ సిబ్బంది కలెక్టరేట్‌ను ముట్టడించారు. నాలుగేళ్లుగా హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్ మున్సిపల్ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే.. విధుల్ని బహిష్కరించి ఉద్యమం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

Municipal workers strike జగన్ హామీల అమలు కోసం కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల యాత్ర

Municipal Workers Protests: ఒంగోలులో మున్సిపల్ కార్మికుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ముట్టడి యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులను రెగ్యులర్ చేయడం.. తదితర సమస్యలు పరిష్కరించాలని నంద్యాల కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్‌ గేటు ముందు కార్మికులు బైఠాయించారు. హామీలు నెరవేర్చకపోతే.. ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. త్వరలోనే ఛలో విజయవాడ కార్యక్రమం చేపడతామని అన్నారు.

అనంతపురంలోనూ కలెక్టరేట్ ముట్టడికి కార్మికులు యత్నించారు. సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కర్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాటలో.. కార్మికులు గాయపడ్డారు. మహిళా కార్మికులు గేటు వద్ద బైఠాయించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలకి పైగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని హెచ్చరించారు. కార్మికురాలిని మహిళా కానిస్టేబుల్ విచక్షణారహితంగా తన్నడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏళ్లు గడుస్తున్నా కనికరించని అధికార్లు.. 'అనంత' పారిశుధ్య కార్మికుల వ్యధ

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.