ETV Bharat / state

తెలంగాణలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు.. ఆనందోత్సాహాల్లో యువత

author img

By

Published : Jan 15, 2023, 8:50 PM IST

Sankranthi celebrations
సంక్రాంతి సంబరాలు

Sankranti Celebrations in Telangana : తెలంగాణలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు పండుగకు రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చాయి. చిన్నాపెద్దా పతంగులు ఎగురువేసుకుంటూ సందడి చేశారు. మహిళలు రంగవల్లులతో లోగిళ్లను శోభాయమానంగా మార్చారు.

Sankranti Celebrations in Telangana : తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతిని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా సంక్రాంతి ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీపడ్డారు. రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిచ్చాయి. ఖమ్మం, జగిత్యాలలో సంక్రాంతి సంబురాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. అందమైన ముగ్గులతో పాటు గొబ్బెమ్మల్లో నవ ధాన్యాలు, రేగు పండ్లు పెట్టి గౌరమ్మను పూజించారు. సంక్రాంతికే ప్రత్యేకమైన గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో యువతీయువకులు పాల్గొని పతంగులు ఎగురవేశారు. నిజామాబాద్‌లో మకర సంక్రాంతి పండగ వేళ యువత గాలిపటాలు ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. పతంగుల దుకాణాల వద్ద కొనుగోళ్ల సందడి నెలకొంది. భారతీయ సంస్కృతి వారసత్వంగా పంతగులు ఎగురవేడయం ఆనవాయితీగా వస్తోందని భాజపా నేతలు వివరించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో సంబురాలు వైభవంగా జరిపారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి అద్భుత ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. మైదానంలో యువత పతంగులు ఎగురవేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసాలు : నగరంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. పండుగ వేళ చిన్న పిల్లలకు భాజపా నాయకులు గాలిపటాలను పంపిణీ చేశారు. చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఓబీసీ మోర్చా హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ అధ్వర్యంలో... హిమాయత్‌ నగర్​లో గాలిపటాలను పంపిణీ చేశారు. గాలిపటాలు ఎగురవేయడం మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో అన్ని పండుగల్లో మన సంక్రాంతి పండుగకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఉన్న గాలిపటాలను పంపిణీ చేసి వారికి సంక్రాంతి గొప్పతనం గురించి తెలియజేశారు. మరో పక్క నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాటి వద్ద నగర వాసులు ఫొటోలు దిగుతూ.. పతంగులు ఎగుర వేస్తూ సందడి చేశారు.

కైట్​ ఫెస్టివల్​లో సందడి చేసిన ఎమ్మెల్యే : హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్‌లో జరుపుకుంటున్న సంక్రాంతి సంబురాలలో మలక్​పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కైట్‌ ఫెస్టివల్‌లో బలాల పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. యువకులు, పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేసి ఆకట్టుకున్నారు. పండుగలు ఆయా బస్తీల్లోని భిన్న మతాల ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అహ్మద్ బలాల తెలిపారు. సైదాబాద్ ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కైట్‌ ఫెస్టివల్‌లో సైదాబాద్ డివిజన్‌కు చెందిన ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.