ETV Bharat / state

ఇసుక దందాను కొత్త పుంతలు తొక్కిస్తున్న వైకాపా ప్రభుత్వం... పరాకాష్ఠకు దోపిడీ

author img

By

Published : Oct 21, 2022, 10:01 AM IST

Sand Scam: ఇసుక నుంచి తెైలం పిండుకోవడంలో అధికార పార్టీ నాయకుల్ని మించిన ఘనుల్ని ఇంకెక్కడా చూడమేమో!! అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎప్పటికప్పుడు ఇసుక దందాను కొత్త పుంతలు తొక్కిస్తున్న వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లింది! ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్నామని డప్పాలు కొడుతూ..ఆ ముసుగులో ఇన్నాళ్లూ సాగించిన ఇసుక అక్రమాలకు ఇప్పుడు మరింతగా గేట్లు ఎత్తేసింది.

SAND
ఇసుక దందా

ఇసుక దందా

Sand Scam: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఇసుక దందా చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఏ గుత్తేదారు సంస్థను ముందు పెట్టి ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇసుక దందా సాగించిందో.. ఇప్పుడు అదే సంస్థకు షాక్‌ ఇచ్చింది. ఎక్కడైనా ప్రధాన గుత్తేదారే ఉపగుత్తేదారును నియమించుకోవడం చూశాం.. ఇక్కడ ప్రధాన గుత్తేదారుతో సంబంధం లేకుండా.. ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు ఉపగుత్తేదారులు.. ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. వీరు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఎవరు నియమించారన్నది.. అంతా జగన్మాయ.

ప్రధాన గుత్తేదారు సంస్థేమో తామింకా ఎవర్నీ నియమించుకోలేదు మొర్రో అంటోంది. కొత్త ఉపగుత్తేదారును నియమించుకునే వరకు ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని ఆ సంస్థ ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండగానే ఇక్కడ కొత్త ఉపగుత్తేదారు సంస్థల పేరుతో వేబిల్లులూ ఇచ్చేయడం మొదలైంది. వాటి ముసుగులో అధికార పార్టీలోని కొందరు ముఖ్యనేతలు, వారి అనుచరులకు ఇసుక రేవుల పంపకమూ జరిగిపోయింది. అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా మొదలైపోయింది. రాష్ట్రంలో ఇన్నాళ్లూ టర్న్‌కీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చినప్పుడల్లా.. ప్రధాన గుత్తేదారైన జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థే.. టర్న్‌కీ సంస్థను ఉపగుత్తేదారుగా నియమించుకుందని, దానితో తమకేం సంబంధమని బుకాయిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కిమ్మనడం లేదు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇసుకపై అనేక విన్యాసాలు చేస్తూ వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు తవ్వకాలు అప్పగిస్తామని టెండర్ల పేరుతో పెద్ద తంతే నడిపింది. రాష్ట్రం మొత్తంలో ఇసుక తవ్వకాల్ని 2021 మే 14 నుంచి ఉత్తరాదికి చెందిన జయప్రకాష్‌ (జేపీ) పవర్‌ వెంచర్స్‌ సంస్థకు అప్పగించింది. టన్ను విక్రయ ధరను 100 రూపాయల చొప్పున పెంచేసింది. ఇసుక టెండర్‌ దక్కించుకున్న జేపీ సంస్థ ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ఏపీవైపు కన్నెత్తి చూడలేదు. ఉపగుత్తేదారు పేరుతో టర్న్‌కీ సంస్థ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన, తమిళనాడుకు చెందిన వ్యాపారిదిగా ప్రచారంలో ఉన్న టర్న్‌కీ సంస్థ ఆధ్వర్యంలోనే తవ్వకాలు, అమ్మకాలు జరిగేవి.

ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఎవరైనా ఆరోపిస్తే.. మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగేవారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థకు నిబంధనల ప్రకారం సబ్‌కాంట్రాక్ట్‌కు ఇచ్చుకునే వెసులుబాటు ఉందని, ఇస్తే ఎవరికివ్వాలి? వంటివన్నీ ఆ సంస్థ ఇష్టమని, అందులో ప్రభుత్వ జోక్యం ఎందుకుంటుందని గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వీజీ వెంకటరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు.

ఇన్నాళ్లూ ఏ పేరు చెబుతూ ఇసుక దోపిడీ సాగిస్తున్నారో, ఇప్పుడు అదే జేపీ సంస్థకు ప్రభుత్వ పెద్దలు దిమ్మతిరిగేలా చేశారు. నెలరోజుల క్రితం టర్న్‌కీ సంస్థను హఠాత్తుగా సీన్‌ నుంచి తప్పించారు. సెప్టెంబరు రెండోవారంలో బ్రాక్స్‌టన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉపగుత్తేదారుగా తెరపైకి వచ్చింది. దాని పేరుతోనే వేబిల్లులు జారీచేయడం మొదలైంది. దాన్ని ఎవరు తెచ్చారో తెలీదు. మళ్లీ 3 రోజులకే కేకేఆర్‌ ఇన్‌ఫ్రా పేరిట కొత్తగా వే బిల్లుల జారీ మొదలైంది. టర్న్‌కీ వెళ్లిపోయాక.. మేం ఇంకా ఉపగుత్తేదారుగా ఎవర్నీ నియమించలేదు, ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని ఓవైపు జేపీ సంస్థ లేఖలు రాస్తుంటే..ఆ సంస్థకు తెలియకుండానే బ్రాక్స్‌టన్‌, కేకేఆర్‌లను ఎవరు నియమించారో అంతుచిక్కడం లేదు.

ప్రధాన గుత్తేదారుకు తెలియకుండా ఉపగుత్తేదారుల ముసుగులో జరుగుతున్న డ్రామా చూస్తుంటే ఇన్నాళ్లూ టర్న్‌కీ కూడా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మేనని అర్థమవుతుంది. ఆ సంస్థ ఉపగుత్తేదారుగా ఉన్నంతకాలం ఎన్ని అక్రమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతి నెలా ఎవరికి వెళ్లాల్సింది వారికి ఠంచనుగా వెళ్లిపోయేది. అలాంటి టర్న్‌కీని ప్రభుత్వం హఠాత్తుగా ఎందుకు తప్పించింది? ప్రభుత్వంలోని పెద్దల తరఫున మద్యం వ్యవహారాలు చూసే, వారి ఆంతరంగిక వ్యక్తి దృష్టి ఇటీవల ఇసుక వ్యాపారంపై పడింది. బాగా ‘కసి’గా డబ్బులు రాబట్టగలరని పేరున్న ఆయనంటే పెద్దలకు ఎనలేని ప్రేమ. ఆ వ్యక్తి కొంతకాలం ప్రభుత్వంలో సలహాదారు పదవీ వెలగబెట్టారు. ఇసుకలో నెలవారీ దందా ఇంకా బాగా చేయవచ్చని, ఇంకా ఎక్కువ పిండుకునే అవకాశం ఉందని ఆయన గమనించారు. వెంటనే టర్న్‌కీ సంస్థ బాధ్యుల్ని పిలిచి నెలవారీ పంపేది ఇంకా పెంచాలని, అదనంగా ఇంత కావాలని ఒక అంకెను చెప్పారు. అంత పెద్దమొత్తాలు తమవల్ల సాధ్యంకాదని వాళ్లు చేతులెత్తేశారు. అంతే వాళ్లను తట్టాబుట్టా సర్దుకోమని చెప్పి, ఉన్నపళంగా తరిమేశారు.

టర్న్‌కీ వైదొలిగే సమయంలో ఇసుక రేవుల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన గుత్తేదారైన జేపీ సంస్థ ప్రమేయం లేకుండానే... వాటి విక్రయాలు జరిగిపోతున్నాయి. కొత్త ఉపగుత్తేదారును నియమించుకునేంత వరకు ఇసుక తవ్వకాలు ఆపాలని సెప్టెంబరు 12 - 29 మధ్య జేపీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు లేఖలు రాసింది. కానీ సెప్టెంబరు 12నే బ్రాక్స్‌టన్‌ పేరుతో వేబిల్లులు జారీ అయ్యాయి. సెప్టెంబరు 15 నుంచి కేకేఆర్​ ఇన్‌ఫ్రా పేరుతోనూ వేబిల్లులు జారీ అవుతున్నాయి. అన్ని ఇసుక నిల్వ కేంద్రాల్లోనూ కేకేఆర్​ ఇన్‌ఫ్రా పేరిట యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లోని రేవుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పడవ రేవుల్లోనూ ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుగుతున్నాయి. లెక్కల్లోకి రాని ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళుతోందో సీబీఐతో విచారణ చేస్తేగాని తెలియని పరిస్థితి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.