ETV Bharat / state

Lokesh letter to Governor: ముస్లింలపై దాడులు అరికట్టండి.. గవర్నర్​కు నారా లోకేశ్ లేఖ

author img

By

Published : May 10, 2023, 4:14 PM IST

Attacks on Muslims: రాష్ట్రంలో ముస్లింలపై దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. నేరస్తులను ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని లేఖ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన 50 దాడుల ఘటనల వివరాలను లోకేశ్ తన లేఖకు జత చేశారు.

Lokesh letter to Governor
నారా లోకేశ్ గవర్నర్​కు లేఖ

Lokesh's letter to the Governor: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. గవర్నర్ జస్టిస్​ అబ్దుల్​ నజీర్​​కు లేఖ రాశారు. ముస్లిం మైనారిటీలపై దాడులు చేసే నేరస్తుల్ని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. చాలా ఘటనల్లో వైసీపీ శ్రేణులే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడితే, పోలీసులు నేరస్థులతో చేతులు కలిపి కేసులు నీరుగార్చుతున్నారని లేఖలో మండిపడ్డారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలపై చోటు చేసుకున్న 50ఘటనల వివరాలను లోకేశ్ తన లేఖకు జత చేశారు. తన దృష్టికి వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే పంపుతున్నానని, అనధికారికంగా ఇంకా ఎన్నో చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. వైసీపీ వేధింపుల వల్ల నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, పల్నాడు ప్రాంతంలో ముస్లిం మైనార్టీల ఆస్తులపై దాడులు, హత్యలు, గెంటివేతల అంశాలు, పులివెందుల సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను లేఖ ద్వారా లోకేశ్ వివరించారు. లౌకిక వాదంపై జరిగే దాడుల్లో. గవర్నర్ సత్వర జోక్యం అవసరమని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను మరింత వెనుకబాటుతనం, పేదరికంలోకి నెట్టే విధంగా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని, లోకేశ్ ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ఆరోపించారు. ఆస్తుల కూల్చివేత, భౌతిక దాడులు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, తప్పుడు కేసుల నమోదు నుంచి హత్యల వరకూ అనేక విధాల ముస్లింలు హింసకు గురవుతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రేరేపిత చర్యలతో వైసీపీ నేతలు చాలా మంది ముస్లిం మైనార్టీల ఆస్తులు లాక్కున్నారని లేఖలో మండిపడ్డారు. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులు, వేధింపులతో ముస్లింలు అనేక అవమానాలకు గురయ్యారన్నారు. కొన్నిచోట్ల ఉద్యోగాల నుంచి కూడా తొలగించి జీవనోపాధికి గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు ప్రాంతంలో పలు చోట్ల టీడీపీకి అండగా నిలిచారనే అక్కసుతో.. ముస్లిం మైనార్టీలను గ్రామ బహిష్కరణ చేశారని లోకేశ్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను లేఖకు జాత చేశారు. బాధితులకు పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోగా ఎదురు తప్పుడు కేసులు నమోదు చేశారని లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని కోరారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలని లోకేశ్ గవర్నర్​కు లేఖలో విన్నవించుకున్నారు. గవర్నర్‌ తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ప్రాథమిక హక్కులను కాపాడటంతో పాటుగా... ముస్లిం మైనార్టీలను సంరక్షిస్తుందని లేఖలో లోకేశ్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.