మేం దేనికిచ్చాం..! మీరు దేనికి వాడారు..! నిధుల మళ్లింపుపై రుణసంస్థల నోటీసులు..!

author img

By

Published : Jan 28, 2023, 8:48 AM IST

Updated : Jan 28, 2023, 12:05 PM IST

నిధుల మళ్లింపుపై రుణసంస్థల నోటీసులు..!

Funds Misuse in AP: రాష్ట్ర ప్రభుత్వ నిధుల మళ్లింపుపై రుణదాతలు గరంగరం అవుతున్నారు. కార్పొరేషన్ల ముసుగులో పాత అప్పు చెల్లించేందుకు కొత్త అప్పు తీసుకున్న ప్రభుత్వం.. వాటిని ఖజనాకు మళ్లించడం.. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌కు ఆగ్రహం తెప్పించింది. తీసుకున్న రుణాలను.. ఎక్కడికి మళ్లించారు? ఎందుకు మళ్లించారో చెప్పాలని ప్రభుత్వానికి తాఖీదులిచ్చినట్లు తెలిసింది.

Funds Misuse in AP: రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు ఈ మధ్య పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మేరకు పోర్టుల నిర్మాణానికి, ఇతరత్రా అవసరాలకు ఈ రుణాలు తీసుకున్నాయి. నిజానికి కార్పొరేషన్లకు ఇచ్చిన రుణాలు ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధం. కార్పొరేషన్ల నిధులు ప్రభుత్వ అవసరాల కోసం మళ్లిస్తే కేంద్రం నిర్ణయించిన నికర రుణ పరిమితిలో వాటిని కూడా కలిపి లెక్కించాలని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి మూడో వారంలో వివిధ కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు.. ఐదు వేల కోట్ల రూపాయల వరకూ మళ్లాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు, అప్పుల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యక్తులు.. రుణాలిచ్చిన ఆయా సంస్థలకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎనర్జీ కార్పొరేషన్‌ పేరిట రుణాలు మంజూరు చేసిన గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ అప్రమత్తమైంది. తాము రుణంగా ఇచ్చిన మొత్తం.. నిల్వ ఉందో లేదో చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అధికారులకు తాఖీదు పంపినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాలను రాష్ట్ర ఖజానాకు ఎందుకు మళ్లించారు? ఏం చెప్పి అప్పు తీసుకున్నారు? వాటిని ఖజానాకు ఎందుకు మళ్లించారని నిలదీసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎనర్జీ కార్పొరేషన్‌ గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌కు ఎప్పట్నుంచో 2 వేల 200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దాదాపు మూడు నాలుగు నెలలుగా.. ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని.. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ అధికారులు.. ఏపీ ఎనర్జీ కార్పొరేషన్‌తో పాటు ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే తమ వద్ద నిధుల్లేవంటూ.. అధికారులు నెట్టుకొస్తున్నారు.

బకాయిలు చెల్లించకపోతే దివాలా తీసినట్లు ప్రకటించాల్సి వస్తుందనిహెచ్చరించిన గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ పెద్దలు.. తాము కొత్తగా అప్పు ఇస్తామని, ఆ మొత్తం నుంచి 2వేల 200 కోట్లు తిరిగి చెల్లించాలని షరతు పెట్టారు.కార్పొరేషన్ అధికారులు అలా చేయకుండా.. డబ్బును ఖజానాకు మళ్లించారు. కార్పొరేషన్ల నుంచి రుణాలు ఖజానాకు మళ్లించిన విషయంపై ఫిర్యాదులు రావడంతో ఆర్‌ఈసీ ప్రతినిధులు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులను నిలదీశారు. అయితే నెలాఖరులోగా బకాయిలు చెల్లిస్తామంటూ.. ఆర్థిక శాఖ అధికారులు నచ్చజెప్పినట్లు తెలిసింది.

ఇక పోర్టుల నిర్మాణానికి గతంలో తీసుకున్న రూ. 2,700 కోట్లు.. జనవరి మూడో వారంలో కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రూ. 5,000 కోట్లు.. ఖజానాకు చేరిపోయాయి. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన నిధులు.. పీడీ ఖాతాల్లో నిల్వ ఉన్నంత మాత్రాన ఆ నిధులు అక్కడే ఉన్నట్లు కాదనే అంశమూ చర్చనీయాంశమవుతోంది. గతంలోనూ ప్రభుత్వం అప్పులు తెచ్చి అప్పుల నుంచి బయటపడ్డ ఉదంతాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు వద్ద ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితికి మించి వినియోగించుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకూ కార్పొరేషన్లే ఆదుకున్నాయి.

కార్పొరేషన్‌ నిధుల మళ్లింపు

ఇవీ చదవండి:

Last Updated :Jan 28, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.