ETV Bharat / state

Kodi Katti Case: కోడికత్తి కేసులో కుట్రకోణం లేదన్న ఎన్‌ఐఏ.. తీర్పు 25కి వాయిదా

author img

By

Published : Jul 13, 2023, 8:49 AM IST

Kodi Katti Case Updates: కోడికత్తి కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని.. క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందున మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని N.I.A.తరపు న్యాయవాది కోర్టు స్పష్టం చేశారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై N.I.A తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

Kodi Katti Case Updates
Kodi Katti Case Updates

Kodi Katti Case Updates: కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని.. మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది వాదించారు. రెండో రోజు కూడా ఇన్‌-కెమెరా పద్ధతిలో విచారణ సాగింది. ఈ అంశంపై లోతైన దర్యాప్తునకు సీఎం జగన్‌ చేసిన అభ్యర్థనపై తాము ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేశామని ఎన్‌ఐఏ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విశాల్‌ గౌతం చెప్పారు. ఘటన జరిగి ఐదు సంవత్సరాలు అయ్యి, కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా తిరిగి దర్యాప్తు డిమాండ్‌ తీసుకురావడం సహేతుకం కాదని ఎన్​ఐఏ న్యాయవాది అన్నారు.

ఆ పిటిషన్​ కూడా కొట్టివేయండి: ఎన్‌ఐఏ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిందని, రాజకీయ జోక్యం, పక్షపాతానికి తావు లేకుండా నిర్వహించిందన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై అభియోగాల అన్నింటిపై నిజాలను వెలికితీశామన్నారు. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించామని, వీటి ప్రకారం అతనొక్కడినే నిందితుడిగా పేర్కొంటూ అభియోగపత్రం దాఖలు చేశామని చెప్పారు. కుట్ర కోణం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం సైతం లోతైన దర్యాప్తు కోసం చేసిన వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిందితుడు ఐదు సంవత్సరాలుగా రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా మగ్గుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తుది ఉత్తర్వుల నిమిత్తం న్యాయమూర్తి ఏ. సత్యానంద్‌.. కేసును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.

నిందితుడు శ్రీనివాస్​ ప్రజలకు లేఖ: సామాన్యులకు కూడా న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిందితుడు శ్రీనివాసరావు కోరారు. తనపై హత్యాయత్నం నేరం మోపారని, గత ఐదు సంవత్సరాలుగా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంటున్నానని.. తన ఆవేదనను అక్షర రూపంలో పెట్టి ప్రజలకు లేఖ రాశారు. దీనిని అతని న్యాయవాది సలీం విడుదల చేశారు. ఇందులో.. తమది నిరుపేద కుటుంబం అని, తనకు న్యాయం చేయమని కోర్టును కోరుతూనే ఉన్నానని నిందితుడు శ్రీనివాసరావు గుర్తు చేశారు. భారత్‌లో న్యాయం కోసం ఎదురుచూసే వారు దాదాపు కోట్లలో ఉన్నారని పేర్కొన్నారు. మన దేశాన్ని విశ్వగురువుగా చెప్పుకుంటున్న పెద్దలు, సామాన్యుడికి న్యాయాన్ని ఎప్పటికి అందుబాటులోకి తెస్తారని లేఖలో ప్రశ్నించారు.

జగన్​ తరఫు న్యాయవాది వాదనలు: కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ పలు అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నేరాభియోగపత్రం దాఖలు చేసిందని బాధితుడు సీఎం జగన్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిష్పక్షపాతంగా తిరిగి విచారిస్తే కుట్ర కోణం వెలుగులోకి వస్తుందని కోర్టుకు తెలిపారు. కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు నేరచరిత్ర ఉన్నా.. విమానాశ్రయ క్యాంటీన్‌ నిర్వాహకుడు హర్షవర్దన్, దీనిని పట్టించుకోకుండానే విధుల్లోకి తీసుకున్నారని జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అతను 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గాజువాక టికెట్ ఆశించారని.. అతని పాత్రపై ఎన్​ఐఏ విచారించలేదని న్యాయవాది వాదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.