ETV Bharat / state

ప్రభుత్వ బడుల్లో అదృశ్య విద్యార్థులు - గొప్పల కోసం సర్కార్​ తప్పుడు లెక్కలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 8:03 AM IST

Jagan Govt Illegal Calculations on School Students: బడిలో విద్యార్థులు ఉండరు - ఎన్నడూ పాఠశాలకు రారు - అయినా రికార్డులలో మాత్రం వారి పేర్లు ఉంటాయి. బూట్లు, సాక్సులు, బ్యాగ్‌లాంటి విద్యా కానుకలు మాత్రం తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం చేస్తారు ఇదేంటి? అనుకుంటున్నారా? ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న అదృశ్య విద్యార్థుల కథ. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 50వేల వరకు అదృశ్య విద్యార్థులు ఉన్నట్లు అంచనా. మధ్యలో చదువు మానేస్తున్న వారిని తగ్గించి చూపేందుకు ఇంతకాలం ప్రభుత్వం చేసిన గిమ్మిక్కు బయటపడింది. ఎన్నో రంగాల్లో ఇలాంటి విన్యాసాలతో గొప్పలకు పోయి బొక్కా బొర్లా పడ్డ వైసీపీ సర్కార్‌ చివరకు విద్యార్థుల విషయంలో అదే పంథా అవలంబిస్తోంది.

school_students
school_students

ప్రభుత్వ బడుల్లో అదృశ్య విద్యార్థులు - గొప్పల కోసం సర్కార్​ తప్పుడు లెక్కలు

Jagan Govt Illegal Calculations on School Students: 2021 జనవరి 12న నెల్లూరులో 'అమ్మఒడి' రెండో విడత జమ చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్‌ అనేక పాఠశాలల గురించి గొప్పలు చెప్పారు. కానీ వాస్తవంగా జరుగుతున్నదేంటో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపి, అందరూ బడికి వచ్చేలా చూడాలంటూ ప్రచారం చేయడంలో జగన్‌ను మించిన వారుండరేమో. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి గత డిసెంబరు వరకు విద్యార్థుల హాజరు సరాసరిన 78.12శాతం మాత్రమే ఉంది. ఇంతమంది విద్యార్థులు బడికి రాకపోయినా కనీసం వీరు ఎక్కడున్నారనే విషయాన్ని జగన్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మూడు, నాలుగేళ్లుగా లేని విద్యార్థుల పేరిట అక్రమ దందా కొనసాగుతోంది. ఉపాధి హామీ కూలి పనుల కోసం చాలామంది వలస బాట పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు మధ్యలో చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోతున్నారు. మరికొందరు బాలికలు చిన్నవయస్సులోనే వివాహాలు చేసుకుని బడులను వీడుతున్నారు. వారి పేర్లు తొలగించకపోవడం వల్ల ఇప్పటికీ రికార్డుల్లోనే కొనసాగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఎక్కువ రోజులుగా బడికిరాని విద్యార్థుల వివరాలను ఛైల్డ్‌ ఇన్ఫో కాలం నుంచి తొలగించి, డ్రాపౌట్‌ బాక్సులో వేయడంతో అదృశ్య విద్యార్థుల జాబితా అధికారికంగా బయట పడింది. ఒక్కో బడిలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు తేలింది. ఆన్‌లైన్‌ హాజరు యాప్‌లో అందరి విద్యార్థుల పేర్లు కనిపించకపోవడంతో ఈ సమాచారం బయటకు వచ్చింది.

కటిక నేలపై చలికి గజగజ! లైట్లు, తాగునీరు కరువు- రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు

Student Calculations in Records:

  • కర్నూలు జిల్లాలో ఓ స్కూళ్లో రికార్డుల ప్రకారం 310మందికిపైగా విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో క్రమం తప్పకుండా, అడపాదడపా వస్తున్న విద్యార్థులు 239 మంది కాగా మిగిలిన 71 మంది గత మూడు, నాలుగేళ్లుగా పాఠశాల ముఖమే చూడలేదు. అయినా వీరు బడిలోనే చదువుతున్నట్లే లెక్కలో చూపారు.
  • నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఓ పాఠశాలలో 500 మందికిపైగా విద్యార్థులు ఉంటే ఇప్పుడు ఆన్‌లైన్‌ హాజరు యాప్‌లో కనిపిస్తోంది 482మంది పేర్లే. ఈ పాఠశాలల్లో 37మంది అదృశ్య విద్యార్థులున్నారు. విచిత్రమేమిటంటే ఇక్కడ 500కుపైగా విద్యాకానుకలు ఇచ్చినట్లు బయోమెట్రిక్‌ కూడా నమోదు చేశారు.
  • తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభం నుంచి రావడం లేదు. ఇంతకాలం వారు చదువుతున్నట్లు చూపి ఇప్పుడు ఆన్‌లైన్‌ హాజరు యాప్‌లో డ్రాపౌట్‌ బాక్సులోకి చేర్చారు.
  • కడప జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలలో 12మంది విద్యార్థులు బడికి రాకున్నా ఇంతకాలం వస్తున్నట్లే లెక్కలు చూపారు. విచిత్రమేమిటంటే నలుగురు పదోతరగతికి పరీక్ష ఫీజు కట్టారు. ప్రతిబడిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
  • 2022-23లో పదో తరగతి తప్పిన లక్షా 23వేల మంది విద్యార్థుల్లో లక్షా 3వేల మంది పునఃప్రవేశాలు పొందినట్లు అధికారులు చూపుతున్నారు. ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చిన పరీక్ష ఫీజు కట్టించారు. వీరిలో 10శాతం కూడా రెగ్యులర్‌గా బడికి రావడం లేదు. అధికారులు మాత్రం వీరికి విద్యా కానుక ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు.

విద్యాకానుక కిట్ల మాటున 121 కోట్ల రూపాయలు హాంఫట్‌-విజిలెన్స్ హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం

ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి: పిల్లలు బడికి వచ్చిన రాకపోయినా రిజిస్టర్‌లో రాసుకోవాలని, ఛైల్డ్‌ ఇన్ఫోలో చూపాలని ప్రధానోపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. డ్రాపౌట్‌ బాక్సులో ఉన్న బడికి రాని విద్యార్థుల వివరాలను వెనక్కి తీసుకోవాలని, బడిలో చదువుతున్నట్లు నమోదు చేసుకోవాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు అందరి పేర్లను ఛైల్డ్‌ఇన్ఫోలో నమోదు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వలసలు వెళ్లే విద్యార్థుల కోసం సీజనల్‌ వసతిగృహాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా జగన్‌ సర్కార్‌ దీన్ని అటకెక్కించింది. దీంతో ఇంటి వద్ద పిల్లల్ని చూసే పెద్ద దిక్కు లేని వారు పిల్లల్ని తమతోపాటు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లిపోతున్నారు. ఫలితంగా భావి భారత పౌరులు చదువులకు దూరమై ఉజ్వల భవిష్యత్‌ను కోల్పోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సీఎం జగన్‌ బహిరంగ సభలో విద్యార్థుల పాట్లు - జెండాలు, క‌టౌట్లు మోయించిన వైసీపీ శ్రేణులు

బడికి రాకపోయినా రికార్డుల్లో కొనసాగింపు: ప్రభుత్వం 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలకు కలిపి రికార్డుల్లోని పిల్లల కంటే 7లక్షల59వేల విద్యాకానుకల కిట్లను అదనంగా కొనుగోలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పునఃప్రవేశాలతో కలిపి బడికిరాని విద్యార్థుల సంఖ్య లక్షా 50 వేల వరకు ఉంటుంది. బడికి రాకపోయినా రికార్డుల్లో కొనసాగుతున్న పిల్లలకు విద్యా కానుక ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. రికార్డుల్లోని పిల్లల కంటే అదనంగా కొనుగోలు చేసిన 7లక్షల 59వేలతో పాటు పాఠశాలల్లో లేని లక్షా 50వేల విద్యాకానుకల కిట్లు ఏమయ్యాయి? ఎవరి ఖాతాల్లో జమ అయ్యాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఒక్కో కిట్‌ ధర 1,960 రూపాయలుగా ఉంది. ఇలా లేని విద్యార్థుల పేరిట వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.